Big Stories

Mithun Reddy vs Kirankumar Reddy : రాజంపేట రాజెవరు ? మిథున్ రెడ్డికి హ్యాట్రిక్కా ?.. మాజీ సీఎంకు రీ ఎంట్రీనా ?

Mithun Reddy vs Kirankumar Reddy : వరుసగా రెండుసార్లు విజయం సాధించిన మిథున్‌రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తారా? లేక మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఘనంగా రీఎంట్రీ ఉంటుందా. పాత కాపుల మధ్య సాగుతున్న పోరులో విజేత ఎవరు? ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా పోటీ పడని రెండు కుటుంబాలు మధ్య జరిగిన పోరులో విజయం సాధించేదెవరు?

- Advertisement -

ఏపీలో ఉత్కంఠ నెలకొన్న స్థానాల్లో రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్‌ ఒకటి. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూమారుడు. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డి మూడోసారి పోటీ చేయగా.. పదేళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఉమ్మడి ఏపీ చిట్టచివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి.. మిథున్‌కు ప్రత్యర్థిగా ఉన్నారు. కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ఆయన.. ఘనవిజయంతో రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నారు.

- Advertisement -

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాజంపేటలో తెలుగుదేశం పార్టీ కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో మిథున్‌రెడ్డి.. నాటి బీజేపీ అభ్యర్థి పురందేశ్వరిపై ఘనవిజయం సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభపైనా విన్ అయ్యారు. 2014 ఎన్నికల్లో 6 లక్షలు, 2019లో 7 లక్షల ఓట్లుపైనే సాధించి.. ఘనవిజయాలను సొంతం చేసుకున్నారు. మరోసారి విజయం సాధించి.. హ్యాట్రిక్ ఎంపీగా నిలవాలని ఆశలు పెట్టుకున్నారు.

Also Read : పేర్ని కిట్టు Vs కొల్లు రవీంద్ర.. పోరు బందరు.. గెలిచేది ఎవరంటే..?

2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న TDP అధినేత చంద్రబాబు. మిథున్‌రెడ్డికి ధీటైన నేతను రంగంలోకి దించాలని నిర్ణయించారు. కూటమి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రూపంలో అస్త్రం లభించినట్లు అయ్యింది. ఎందుకంటే.. రాజంపేటలో పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా చాలా పేరుంది. ఓ రకంగా చెప్పాలంటే ఆ కుటుంబమే అక్కడ పొలిటికల్‌గా చక్రం తిప్పుతుందని అనటం అతిశయోక్తి కాదు. అలాంటి కుటుంబం నుంచి పోటీ చేస్తున్న మిథున్‌రెడ్డికి సరైన ప్రత్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి అవుతారని కూటమి భావించింది. ఆ రకంగా అక్కడ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలిపేందుకు చంద్రబాబు తనదైన వ్యూహాలు అమలు చేశారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కూటమి తరుపున బీజేపీ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించగానే.. చంద్రబాబు విస్తృత ప్రచారం చేస్తూ.. వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు.. పుంగనూరు, పీలేరు, రాయచోటి, తంబల్లపల్లి నియోజకవర్గాల్లో వందశాతం వెబ్ కాస్టింగ్‌తో పాటు సెంట్రల్ బలగాలతో బందోబస్తుతో పోలింగ్ జరగటం కూటమికి లాభం చేకూర్చాయనే టాక్ నడుస్తోంది.

ఇక్కడవరకూ బాగానే ఉన్నా.. రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదని వాదనలూ ఉన్నాయి. పీలేరులో టీడీపీ నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్‌రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అక్కడ 25 వేలకు పైనే మెజార్టీ వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. మాజీ సీఎం సోదరుడు ఎంపీగా ఉండటంతో పాటు కిషోర్‌కు ఉన్న ఛరిష్మాతో అది సాధ్యమనే టాక్ నడుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి పోటీ చేస్తున్న పుంగనూరులో మాత్రం ఈసారి మెజార్టీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. వందశాతం వెబ్ కాస్టింగ్ తో పాటు సెంట్రల్ ఫోర్స్‌ బలగాల రక్షణతో మొదటి సారిగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని నేతలే చెబుతున్నారు.

పోలింగ్ రోజు తెల్లవారుజామున టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేయడం.. తర్వాత ఎన్నికల కమిషన్ రియాక్ట్ కావటంతో కిడ్నాప్ అయిన వారిని విడుదల చేయటం వంటి అంశాలు.. కూటమికి కలసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. దీంతో పాటు పోలింగ్‌కు ముందు.. పలమనేరు DSPతో పాటు సదుం ఎస్సైను సస్పెన్స్ చేయటం ద్వారా పోలింగ్ స్వేచ్ఛంగా జరగడానికి వీలు అయ్యిందనేది తెలుగుదేశం పార్టీ వాదన.

Also Read : ఆ దెబ్బతో ద్వారంపూడి ఓటమి ఫిక్స్! సేనాని పంతం నెగ్గే!

రాజంపేట పార్లమెంటు పరిధిలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయవర్గాల సమాచారం. రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రమణ్యం తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలవగా.. YCP నుంచి మాజీ MLA ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి పోటీ చేశారు. ఇక్కడే మరోట్విస్ట్ నెలకొంది. ఇక్కడ నుంచి టిక్కెట్‌ ఆశించిన మేడా మల్లికార్జునరెడ్డికి వైసీపి అధిష్టానం హ్యాండ్ ఇవ్వటంతో.. ఆయన వర్గీయులంతా TDPకి అనుకూలంగా పనిచేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

దానికి కారణం లేకపోలేదు. కిరణ్‌ కుమార్‌రెడ్డితో మల్లికార్జునరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండటం TDPకి కలసి వచ్చిందనే వాదన ఉంది. రైల్వేకోడూరులో జనసేన పోటీలో నిలిచింది. ఆ పార్టీ నుంచి అరవ శ్రీధర్‌ పోటీ చేయగా.. సిట్టింగ్ MLA శ్రీనివాసులు మరోసారి వైసీపీ నుంచి బరిలో నిలిచారు. ఇక్కడ టీడీపీ ,జనసేన శ్రేణులు కలసికట్టుగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎవరు గెలిచినా.. వెయ్యి, రెండు వేల లోపే మెజార్టీ ఉంటుందని ప్రచారం సాగుతోంది. యువత ఓట్లు కూటమికి కలసి వస్తుందనే భావనలో నేతలు ఉన్నారు.

రాయచోటిలో టీడీపీ నుంచి రాంప్రసాద్ రెడ్డి పోటీ చేయగా.. వైసీపి నుంచి శ్రీకాంత్‌రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. ఐతే..టీడీపీ మాజీ MLA రమేష్ కూమార్ రెడ్డి.. అధికార వైసీపీలో చేరటంతో కూటమికి కాస్త నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదనే టాక్ నడుస్తోంది. మైనార్టీ ఓటర్లు ఎక్కువుగా ఉండటం కూడా కూటమికి నష్టం కలిగించే అంశంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఎవరు గెలిచినా.. అతి తక్కువ మెజార్టీ వస్తుందనే అభిప్రాయం ఉంది. మదనపల్లిలో టీడీపీ నుంచి షాజహాన్ భాషా పోటీ చేయగా.. వైసీపీ నుంచి నిషార్ అహ్మద్ బరిలో ఉన్నారు.

Also Read : బొబ్బిలి యుద్ధం తప్పదా? హిస్టరీ రిపీట్స్?

షాజహాన్ భాషాకు.. టీడీపీ, జనసేన,బీజేపీ నేతల సహకారం ఆశించిన స్థాయిలో లభించలేదనే వాదన ఉంది. పైగా.. ఎంపీ అభ్యర్థిగా ఉన్న కిరణ్ కూమార్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారట. దీంతో పాటు పోల్ మేనేజ్‌మెంటులోనూ టీడీపీ ఫెయిల్యూర్ అయ్యిందనే సమాచారం. తంబల్లపల్లి నియోజకవర్గంలో దాసరిపల్లి జయచంద్రారెడ్డి.. టీడీపీ నుంచి పోటీ చేయగా.. కూటమి నేతల నుంచి ఆశించిన సహాయం అందలేదనే టాక్ నడుస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారాక నాథ్ రెడ్డి బరిలో ఉన్నారు.

వైసీపీ మాత్రం పాతకాపులతోనే పార్లమెంటు పరిధిలో పోటీ చేసింది. మైనార్టీ నేతలున్న ప్రాంతంలో వారి ఓట్లన్ని గుంపగుత్తగా తమకే పడ్డాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరుజిల్లాలోని పుంగనూరు, పీలేరు, తంబల్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికలను.. మిథున్ రెడ్డే స్వయంగా చూసుకున్నారట. పార్లమెంటు వ్యాప్తంగా జరిగిన పోలింగ్ 78 శాతంగా నమోదైంది. ఈసారి జనసేన ఓటర్లు.. కూటమికి బాగా లాభం చేకూర్చాయనే వాదన ఉంది.

బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు.. ఇక్కడ మైనార్టీ ఓటర్లతో ఇంచుమించుగా ఉండటం కూడా కిరణ్‌కుమార్‌రెడ్డికి కొంతధైర్యాన్ని ఇచ్చిందని అంటున్నారు. మరోవైపు.. రెడ్డి, ఎస్సీ సామాజికవర్గం ఓటర్లు కిరణ్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌లో ప్రశాంతంగా సాగటంతో పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరులో వచ్చే మెజార్టీతో బయటపడతామని కిరణ్ వర్గీయులు ఆశాభావంతో ఉన్నారు. పుంగనూరు, తంబల్లపల్లి, మదనపల్లి, రాయచోటిలోనూ విజయం సాధిస్తామని.. తద్వారా కచ్చితంగా గెలుపు తమదేనన్న భావనలో ఉన్నారు.

Also Read : ఒంగోలులో మ్యాచ్ ఫిక్సింగ్! గెలుపు ఫిక్స్!

మరోవైపు.. రాజంపేట, మదనపల్లిని జిల్లా కేంద్రం కాకుండా పెద్దిరెడ్డి కుటుంబం అడ్డుకుందనే ప్రచారం వైసీపీకి మైనస్ అయినట్లు సమాచారం. దీంతో పాటు మెడికల్ కాలేజీ వ్యవహారం. క్రిష్టియన్ భూముల అక్రమణ వ్యవహారంతో పాటు తంబల్లపల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు దాడులు, గర్భవతిపై దాడి వ్యవహారం, అక్రమకేసులు, చంద్రబాబుపై రాళ్లదాడి, అన్నమయ్య డ్యామ్ తెగిపోవడం వంటి ఘటనలు కూటమికి ప్లస్‌ అవుతాయనే టాక్ నడుస్తోంది.

కూటమి నుంచి బలమైన అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డి నిలిచినా.. పోల్ మేనేజ్‌ మెంట్‌లో కాస్త వెనుబడ్డారనే వాదనలూ ఉన్నాయి. టికెట్ వచ్చాక ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పి.. ఎన్నికల పోలింగ్‌ నాటికి చేతులెత్తేయటం కూడా కూటమికి మైనస్‌ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తం మీద.. గతంలో 7 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన మిథున్‌రెడ్డి హాట్రిక్ ఖాయని వైసీపీ నేతలు చెబుతుండగా.. స్వల్ప మెజార్టీతో అయినా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విజయం సాధిస్తారని కూటమి నేతలు ఆశాభావంతో ఉన్నారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలు తమకు కలసి వచ్చాయని.. దీంతో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉన్న ఇమేజ్‌తో తాము బయటపడతామన్న ధీమాతో ఉన్నారు. రాజంపేటను ఎవరు కైవసం చేసుకున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News