Big Stories

Central Taxes and Funds: ఉత్తరాది రాష్ట్రాలపై ప్రేమ.. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష..!

Central Taxes and Funds: ఇండియా.. అనేక రాష్ట్రాల కలయిక మన దేశం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇలా అన్నింటిని కలిపి కేంద్ర ప్రభుత్వం పాలిస్తుంది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నా.. కొన్ని అంశాలపై కేంద్రానిదే గుత్తాధిపత్యం. అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. మరి కేంద్రం ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తుందా ? ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో సరైన పద్ధతులను పాటిస్తుందా ? ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాలను సృష్టిస్తుందా ?

- Advertisement -

కేంద్రం ఉత్తరాది రాష్ట్రాలపై ప్రేమ కురిపిస్తూ.. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోంది. ఇది ఎన్నాళ్లుగానో ఉన్న ఆరోపణలు.. ఇప్పుడీ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పన్నులు, ఇతర పద్ధతుల్లో సేకరించిన నిధులు కేంద్రానికి వెళ్లిన తర్వాత మళ్లీ తిరిగి పంపిణీ అవుతాయి. అయితే ఆ తిరిగి వచ్చే సమయంలోనే అసలు పంచాయితీ మొదలవుతుంది. ఫర్ సపోజ్‌ కేంద్రం ప్రతి రాష్ట్రం నుంచి ఒక రూపాయి వసూలు చేస్తే.. కొన్ని రాష్ట్రాలకు తిరిగి కేటాయించేప్పుడు 50 పైసలు కూడా ఉండటం లేదు.

- Advertisement -

పైపైన చెప్పుకోవడం కాదు.. గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. కొన్ని రాష్ట్రాలకు అయితే ఈ కేటాయింపులు మరీ దారుణంగా ఉన్నాయి. కర్ణాటకకు అయితే సేకరించే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే రిటర్న్ వస్తున్నాయి. తమిళనాడుకు 28 పైసలు, ఏపీకి 42 పైసలు, తెలంగాణకు 47 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే రిటర్న్ వస్తున్నాయి. కానీ విచిత్రంగా మరికొన్ని రాష్ట్రాలకు మాత్రం భారీ కేటాయింపులు ఉన్నాయి. ఇందులో టాప్‌ ప్లేస్‌లో ఉన్నవి ఈశాన్య రాష్ట్రాలు. నిజానికి ఇది తప్పేం కాదు. ఎందుకంటే అక్కడి భౌగోళిక పరిస్థితులు, సరిహద్దు సమస్యల దృష్ట్యా ఈ కేటాయింపులు చేస్తున్నారు. దీన్ని అస్సలు తప్పే పరిస్థితి లేదు. కానీ కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం భారీ అంటే భారీ కేటాయింపులు చేస్తుంది కేంద్రం.

Also Read: ఫ్లాట్‌ఫామ్ టికెట్స్, బ్యాటరీ కార్లకు ఇకనుంచి నో జీఎస్టీ

రాజస్థాన్‌కు సేకరించే ప్రతి రూపాయికి.. ఒక రూపాయి 20 పైసలు కేటాయిస్తుంది. ఒడిశాకు ఒక రూపాయి 25 పైసలు. మధ్యప్రదేశ్‌కు అయితే తీసుకునే ప్రతి రూపాయికి బదులుగా రెండు రూపాయల 9 పైసలు, యూపీకి 2.49 పైసలు కేటాయిస్తుంది. అయితే ఈ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న రాష్ట్రం బీహార్. ఈ రాష్ట్రం నుంచి కేంద్రం వసూలు చేసే ప్రతి రూపాయికి ఏకంగా 7 రూపాయల 26 పైసలు కేటాయిస్తుంది కేంద్రం. ఇదెక్కడి లాజిక్కో అస్సలు అర్థం కావడం లేదు.

మరి ఏ లాజిక్‌తో ఈ కేటాయింపులు చేస్తున్నారు ? యాక్చువల్‌గా 2021 నుంచి 2026 మధ్య కేటాయింపులు ఎలా చేయాలన్నదానిపై 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉన్నాయి. ఈ సిఫార్సుల ఆధారంగా 42 శాతం నిధులను రాష్ట్రాలకు కేటాయించాలి. రాష్ట్రాల విస్తీర్ణం, రాష్ట్రాల జనాభా, అత్యల్ప తలసరి ఆదాయం, అటవీ, పర్యావరణం, పన్నూ వసూలులో రాష్ట్రాల సామర్థ్యం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి కేటాయింపులు చేస్తారు. అయితే ఇక్కడో తిరకాసు ఉంది. అదేంటంటే జనాభా నియంత్రణ. అవును.. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలకు సంబంధించిన చర్యలు సమర్థంగా తీసుకున్నారు. దీంతో దక్షిణాదిలో జనాభా తగ్గింది. కానీ ఉత్తరాదిలో జనాభా పెరుగుతూనే వచ్చింది. ఇది ఇప్పుడా రాష్ట్రాలకు ప్లస్‌గా మారింది. మనకు మైనస్‌గా.. ఇదే సమయంలో 2011 జనాభా లెక్కలను రిఫరెన్స్‌గా తీసుకోవడంతో దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు గణనీయంగా తగ్గిపోయాయి.

Also Read: ప్రధాని ప్రారంభించిన అతి పొడవైన వంతెనలో పగుళ్లు.. కాంగ్రెస్ ఫైర్

నిజానికి కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చేది దక్షిణాది రాష్ట్రాలు. కానీ ఇప్పుడా నిధులను ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారనేది ఆరోపణ. ఇదే విషయాన్ని ఫైనాన్స్ కమిషన్‌ ముందు ఉంచాయి దక్షిణాది రాష్ట్రాలు. దీంతో జనాభా నియంత్రణ చేసినందుకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అమలు కూడా చేశారు.. కానీ ఓ తిరకాసు పెట్టారు. అదేంటంటే 1976కి బదులు 2011 నుంచి ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మరి జనాభా కంట్రోల్‌ అవ్వడం 1980, 90ల్లో జరిగితే.. 2011 నుంచి పరిగణలోకి తీసుకోవడంతో మరోసారి నష్టపోయాయి దక్షిణాది రాష్ట్రాలు. సో ఏం చేసినా లబ్ధి మాత్రం ఉత్తరాది రాష్ట్రాలు పొందేలా ఉన్నాయి కేంద్రం చర్యలు. 10వ ఫైనాన్స్‌ కమిషన్‌, 15వ ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులను కంపేర్ చేసుకొని చూస్తే.. దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు తగ్గాయి. ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయింపులు పెరిగాయి. అంటే ఇలా నష్టపోయిన వాటిలో గుజరాత్, హర్యాణా కూడా ఉన్నాయి. కానీ దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఉన్నాయి.

మరి కేంద్రం ఏం చెబుతుంది ? తాము ఏ రాష్ట్రంపై వివక్ష చూపడం లేదని.. ఆర్థిక నిపుణులు చెప్పినదానినే అనుసరిస్తామని చెబుతోంది. మరికొందరు బీజేపీ నేతలు ఉత్తరాది రాష్ట్రాలు పేదరికంలో ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఈ అసమానతలు తొలగాలంటే ఇలాంటి కేటాయింపులు అవసరమంటూ సమర్థిస్తున్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయింపులు చేయడంలో తమకు అభ్యంతరం లేదు కానీ.. దక్షిణాది రాష్ట్రాలకు కూడా కేటాయింపులు పెంచితే మంచిదన్నది ఈ ప్రాంత నేతల వాదన.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News