Big Stories

Vidadala Rajini: “వసూళ్ల” విడదల.. మేడం సార్.. మేడం అంతే..

Former Health Minister Vidadala Rajini Illegal Corruptions: ఒకప్పుడు రాజుల పాలనలో.. ప్రజలకు రాజు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం. రాజు ఆగ్రహిస్తే కొరడా దెబ్బలు.. కరుణిస్తే వజ్ర వైడూర్యాల హారాలే.. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఆ తరహా పాలనని ప్రజలు కూడా ఎక్కడా అనుమతించడం లేదు. కానీ కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజకవర్గాన్నే.. తమ రాజ్యంగా భావించి ప్రజలను ముప్పతిప్పలు పెట్టారు. అయితే రాజుల కాలంలో రాజుపై తిరగబడడానికి ఆయుధాలు ఉన్నట్టే.. ఇప్పుడు ప్రజలకు ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కుతోనే గత ఐదేళ్లు ఆ నియోజకవర్గంలో మహారాణిలా పెత్తనం చేసిన ఆ ప్రజా ప్రతినిధి.. ఇప్పుడు కనీసం ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆమె ఎవరు? ఆ నియోజకవర్గం ఏంటి ?

- Advertisement -

తమ సమస్యలను పరిష్కరించి.. నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఎంతో ఆశతో నేతలను తమ ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకుంటారు. అయితే అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోయి నియోజకవర్గాన్నే తమ రాజ్యంలా భావించి ఇష్టానుసారంగా పెత్తనం సాగించి పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు చేసిన పాపానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి బిజినెస్ లను కొనసాగించే వరకూ కూడా అన్నింటా ముడుపులు చెల్లించకపోతే.. వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు గత వైసీపీ ప్రభుత్వంలోని పలువురు ప్రజాప్రతినిధులు. ఇక కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ కుప్పకూలి .. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక.. వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

- Advertisement -

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఐదేళ్లు మంత్రిగా కొనసాగి సీనియర్లకు కూడా షాక్ ఇచ్చారు విడదల రజినీ. అధికారం అండతో మాజీ మంత్రి నియోజకవర్గంలో ప్రజలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారోనని ఒక్కో ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాప్రతినిధిని అనే విషయం మర్చిపోయి తన అనుచరులు తన కుటుంబీకులతో రాచరికపు పరిపాలన సాగించిందని స్వయంగా నియోజకవర్గ ప్రజలే చెప్పటం ఇప్పుడు అందరిని నోటిన వేలు వేసుకునేలా చేస్తుంది. రజినీతో పాటు.. ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ ఆగడాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

ముందుగా రజినీపై.. పసుమర్రు రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగనన్న కాలనీ భూముల్లో ఆమె భారీ స్కామ్‌కు పాల్పడినట్లు వారు తెలిపారు. జగనన్న కాలనీ పేరుతో రైతుల నుంచి 200 ఎకరాల భూ సేకరణ చేశారని ఆరోపించారు. భూ సేకరణలో తమ వద్ద కొన్న ప్రతి ఎకరానికి రెండున్నర లక్షలు చొప్పున విడుదల రజని టీమ్ లంచం తీసుకున్నారని ఆరోపించారు. రజినీ కాజేసిన డబ్బులను రికవరీ చేయాలని వారు కంప్లైట్ లో కోరారు. అలానే బాధితులంతా కలసి.. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును కలిసి.. రజినిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం కూడా అందజేశారు.

ఊహించని రీతిలో రైతులు ఒక్కసారిగా ఎదురుతిరగడంతో.. తమ తప్పులు సరిదిద్దుకున్నారు రజినీ. పసుమర్రు రైతుల నుంచి తీసుకున్న భూములకు మొత్తం 32 మంది రైతులకి ఒక కోటి 16 లక్షల రూపాయలను మధ్యవర్తుల ద్వారా విడుదల రజనీ ఫ్యామిలీ చెల్లించినట్లు తెలుస్తోంది. కేసులకే భయపడే విడదల రజనీ డబ్బులు ఇచ్చేరని బాధిత రైతులు అంటున్నారు. అయితే తిరిగి ఇచ్చిన డబ్బులో కూడా కొందరు చేతివాటం చూపారని.. మిగతా డబ్బును కూడా ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: ఏపీ జీవనాడి.. పోలవరం పంచాయతీ

పసుమర్రు రైతులను ఆదర్శంగా తీసుకున్న గుదేవారిపాలెం రైతులు సైతం ప్రస్తుతం రజనీపైన ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. జగనన్న కాలనీ కోసం తీసుకున్న తమ భూములకు పరిహారంగా ఇచ్చే డబ్బుల్లో కూడా కమిషన్ రూపంలో నాలుగు లక్షల వసూలు చేశారంటూ గోడు వెళ్లబోసుకున్నారు. అందుకు గాను రజినీ పీఏ రామకృష్ణకు మధ్యవర్తిగా శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వ్యవహరించినట్టు బాధితులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వద్దకు రజినీ బాధితులు క్యూ కడుతున్నారు. చిలకలూరిపేట టౌన్ లో స్థలాన్ని ఆక్రమించారంటూ మరో బాధితుడు కూడా ఎంపీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అలానే పట్టణ పరిధిలో పెట్రోల్ బ్యాంక్ ఉన్న స్థలాన్ని ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్నారని విడదల గోపీనాథ్ పై ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది.

పోలీసు వ్యవస్థల్ని సైతం చిన్నాభిన్నం చేయటమే కాకుండా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వారిని.. తమకు రక్షకులుగా మార్చుకొని పరిపాలన సాగించారని ప్రజలు వాపోతున్నారు. నియోజవర్గంలో బిజినెస్ చేయాలంటే ప్రభుత్వానికి చెల్లించే టాక్స్ కాకుండా విడుదల రజిని కుటుంబానికి సంబంధించి గాని విడుదల రజిని చుట్టూ ఉండే అంగరక్షకులకైనా ముడుపులు చెల్లించాలని అంటున్నారు. ఇందుకు యడ్లపాడులోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. 2010 నుంచి లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ నడుస్తోండగా.. వ్యాపారాన్ని నడిపించుకోవడానికి డబ్బులు వసూలు చేశారంటూ నరసరావుపేట డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. స్టోన్ క్రషర్ కొనసాగాలంటే 5 కోట్లు ఇవ్వాల్సిందేనని రజని పీఏ రామకృష్ణ హెచ్చరించగా.. అంత ఇవ్వలేమంటూ చెప్పగా.. డబ్బులు ఇవ్వకపోతే అంతు చూస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతటితో ఆగకుండా స్టోన్ క్రషర్‌ను పరిశీలించడానికి వచ్చిన అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా.. అవకతవకలు జరిగాయని రూ.50 కోట్లు కట్టాలంటూ బెదిరించారని అంటున్నారు. ఇక విడదల రజని పీఏను కలిసి సెటిల్మెంట్ చేయమని కోరగా.. రూ.5 కోట్లు ఇస్తేనే కేసు మాఫీ చేస్తామని చెప్పారని.. బాధితులు వాపోయారు. అయితే తమకు డబ్బులే కావాలంటూ రామకృష్ణ పట్టుబట్టడంతో.. కొంత టైమ్ కావాలంటూ వచ్చేశామని తెలిపారు. ఆ తర్వాత విడుదల రజని మరిది విడదల గోపిని ఆశ్రయిస్తే.. రజనికీ రూ.2 కోట్లు, జాషువా కు రూ.10 లక్షలు, తనకు రూ.10 లక్షలు ఇచ్చేలా డీల్ సెట్ చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఏప్రిల్ 4, 2021న గోపికి డబ్బులు అందించామంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు.

ఎమ్మెల్యేగా తనకున్నటువంటి పవర్స్ ని నియోజకవర్గ అభివృద్ధికి కాకుండా తాను రాజకీయంగా ఎదగటానికి మాత్రమే రజినీ ఉపయోగించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తనకు తానే తన చుట్టూ ఒక కంచెను ఏర్పాటు చేసుకొని సామాన్యులకు ఆ కంచె దాటి వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని.. అదే కాకుండా నియోజకవర్గంలో ప్రతీ పనిలోనూ రజినీ కుటుంబ సభ్యులు వేలు వేలు పెట్టడం.. పరోక్షంగా తామే ఎమ్మెల్యేలుగా భావించి అధికారాన్ని వినియోగించడం.. ఆమె ఓటమికి కారణమయ్యాయని అంటున్నారు. నియంతగా మారిన రాజుల్ని ప్రజలు ఎలా తరిమికొట్టారో.. అదే విధంగా ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు సైతం రజినీ పేరు చెప్తే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని తెలుస్తోంది.

Also Read: ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధం.. టీడీపీకి కొత్త టెన్షన్

2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి బరిలోకి దిగిన రజినీ.. 2024 ఎన్నికల్లో మాత్రం గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ కార్యకర్తలు సైతం ఆమెను కలవాలంటే మూడు అంచల కంచెని దాటాల్సిన పరిస్థితులు ఉండేవని అంటున్నారు. ఆమె గెలుపు కోసం పనిచేసిన సొంత పార్టీ నేతలే రజినీ చేసిన అరాచకాల గురించి వాపోతుండడం మరింత చర్చనీయాంశం అవుతోంది. సామాన్య ప్రజలు కానీ, మీడియా కానీ మాజీ మంత్రిని సంప్రదించాలన్నా.. ముందుగా తన చుట్టూ ఉండే కొఠారిలోని పిఏ లను సంతృప్తి చేస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేదనేది పార్టీ వర్గాల్లో ఓపెన్ సీక్రెట్ గా నడిచింది. రజినీకి గుంటూరు వెస్ట్ లో మొదటిలో మంచి పేరు వచ్చినప్పటికీ.. తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన వల్ల ప్రజల్లోకి పూర్తిస్థాయిలో నెగిటివ్ ఇమేజ్ తీసుకెళ్లాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే చిలకలూరిపేట ప్రజలు లాగా మోసపోతామేమోనని.. గుంటూరు వెస్ట్ లో ఓటమి కట్టబెట్టారని టాక్ ఉంది.

మొత్తానికి ఈ వరుస వివాదాలతో ప్రజల ముందుకు కూడా విడుదల రజిని వెళ్లలేని పరిస్థితి నియోజవర్గంలో నెలకొంది. ప్రజల నమ్మకాన్ని ఒమ్ముచేస్తూ.. అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోతే.. చివరకు ఈ పరిస్థితే ఎదురవుతుందనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితి ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News