Big Stories

CM Chandrababu: జగన్‌ పాలన పోలవరానికి ఓ పెద్ద శాపం

- Advertisement -

2014-19 మధ్య అధికారంలో ఉండగా సీఎం చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నారు. పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించారు. వేగంగా ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో అలాంటి అంచనాలతో పనులను పరుగులు పెట్టించారు. కానీ ఆ తర్వాత వచ్చిన జగన్ హయాంలో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టాక ఇదే పోలవరాన్ని ప్రాధాన్య అంశంగా తీసుకుని ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేశారు. అణువణువూ పరిశీలించారు. పనులు ఎక్కడికి వరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రివ్యూ నిర్వహించారు. పోలవరంలో చేపట్టాల్సిన అంశాలపై ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

గతంలో చేపట్టిన పనులకు రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఆ చేసిన పనులకూ డ్యామేజ్ ఏర్పడింది. కాఫర్‌ డ్యాంల నుంచి పెద్దఎత్తున నీళ్లు లీక్ అవుతూ ప్రధాన డ్యాం ప్రాంతాన్ని కవర్ చేశాయి. దీంతో వాటిని నిర్మించినా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలా? నిర్మిస్తే ఎలా కట్టాలన్న డౌట్లు అలాగే ఉన్నాయి. ఈ విషయంలో ఇంటర్నేషనల్ ఎక్స్ పర్ట్స్ వస్తే తప్ప తామేమీ చేయలేమంటూ కేంద్ర జలసంఘం నిపుణులు, రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు తేల్చేశారు. అంతర్జాతీయ నిపుణుల కోసం టెండర్లు పిలవాలని ఇది వరకే నిర్ణయించారు. మొత్తంగా పోలవరంపై సందేహాలు ముసురుకున్న టైంలో చంద్రబాబు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే సవాళ్లు మాత్రం అలాగే ఉండిపోయాయి.

జగన్‌ పాలనలో పోలవరం పనుల్లో పురోగతి అంతంతగానే ఉండిపోయింది. ప్రభుత్వ రిపోర్టుల జగన్‌ సర్కార్‌ చేయించిన పనులు 5.57శాతమే. ఇక 2019 మే నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు 71.6శాతం పూర్తైతే 2023 డిసెంబర్‌ నాటికి 72.71శాతానికి చేరాయి. అంటే జగన్‌ హయాంలో చేసింది కేవలం 1.11 శాతమే పని. ఇప్పుడు వాటిని పరుగులు పెట్టించాల్సి ఉంది. గోదావరిలో మట్టి స్వభావం వల్ల నది మధ్యలో స్పిల్‌ వే నిర్మించే అవకాశం లేకుండా పోయింది.

Also Read: ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు.. ఎప్పట్నుంచంటే..?

దీంతో గోదావరి ప్రవాహ మార్గాన్ని మార్చి, కొండలు ఉన్నచోట ఊళ్లన్నీ ఖాళీ చేయించి, అక్కడ స్పిల్‌ వే కట్టారు. నది మధ్యలో ప్రధాన డ్యాం నిర్మించాలి. ఆ కట్ట దిగువన డయాఫ్రం వాల్‌ విదేశీ టెక్నాలజీతో కట్టారు. విదేశీ కంపెనీ బావర్‌తో ఈ పనులు చేసింది. ఓవరాల్ గా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో ఒక్క స్పిల్‌ వే తప్ప మిగిలిన అన్నింటి కెపాసిటీ, క్వాలిటీ ప్రశ్నార్థకమయ్యాయి. జగన్‌ హయాంలో ఏడాది పాటు పనులు చేయకపోవడం, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం సకాలంలో చేయకపోవడంతో 2020 భారీ వరదల నుంచి సమస్యలు పెరిగాయి.

ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతానికి ఎగువన, దిగువన నీరు మళ్లించేందుకు నిర్మించిన తాత్కాలిక కట్టడాలే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు. చంద్రబాబు హయాంలో కొంత, ఆ తర్వాత మరికొంత పూర్తయ్యాయి. ఈ రెండూ పూర్తయినా వాటినుంచి నీరు లీక్ కాకుండా చూసుకోవడం పెద్ద సవాల్. ముందు వీటిని సెట్ చేస్తేనే ప్రధాన డ్యాం కట్టే చోట నీళ్లు నిల్వ ఉండవు. మళ్లీ డయాఫ్రం వాల్‌ నిర్మించుకోవాలంటే… ఇందుకోసం రెండు సీజన్ల టైం పడుతుంది. ఆపైన మళ్లీ ప్రధాన డ్యాం కట్టాలి. అంటే ఎంత లేదన్నా ఐదేళ్లు పడుతుందన్న అంచనాలున్నాయి. అప్పటివరకు ఈ కాఫర్‌ డ్యాంలు వరదలను తట్టుకోవాలి. అలా జరగాలంటే వీటిని మరింత పకడ్బందీగా డీల్ చేయాలి. రిపేర్లు చేసి వరదలకు తట్టుకునేలా మార్చాలి. వీటిపైనా సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు.

పోలవరంలో ప్రధాన డ్యాం మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు. రెండో పార్ట్ చాలా పెద్దది. అండ్ ముఖ్యమైంది కూడా. గ్యాప్‌ 3లో ఇప్పటికే కాంక్రీట్ డ్యాం నిర్మాణం కంప్లీట్ అయింది. గ్యాప్‌ 1లో రాతి, మట్టికట్ట డ్యాం కొంతమేర నిర్మాణం జరిగింది. గ్యాప్‌ 1లో 565 మీటర్ల మేర రాతి, మట్టికట్ట నిర్మాణంలో భాగంగా వైబ్రోస్టోన్‌ కాలమ్‌ల నిర్మాణం చేపట్టారు. పోలవరంలో గైడ్‌బండ్‌ కుంగడానికి కారణాలను కమిటీ ఇది వరకే తేల్చింది.

ఒకే సీజన్‌లో కాకుండా వేర్వేరుగా నిర్మించడం వల్ల, స్టోన్‌ కాలమ్స్‌లో బంకమట్టి చేరి గైడ్‌బండ్‌ దెబ్బతిందని కేంద్ర కమిటీ చెప్పింది. వీటిని తాజాగా చంద్రబాబు దగ్గర్నుంచి పరిశీలించారు. ప్రధాన డ్యాం మొదటి భాగంలోనూ స్టోన్‌కాలమ్స్‌ అలాగే కట్టారు. ఇక్కడా బంకమట్టి చేరి ఉంటే ఈ కట్టడం క్వాలిటీపైనా కమిటీ పలు డౌట్లు వ్యక్తం చేసింది. సో ఇప్పుడు ఈ అంశాన్నీ మరింతగా స్టడీ చేయాల్సి ఉంది. దీనిపైనా సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పోలవరంలో స్పిల్‌ వేపై ప్రవాహ ఒత్తిడి తగ్గించేందుకు గైడ్‌బండ్‌ నిర్మించాలని కేంద్ర సంస్థలు సిఫార్సు చేశాయి. 80 కోట్ల రూపాయలతో నిర్మించగా అది కుంగిపోయింది. డిజైన్లకు తగ్గట్లుగా నిర్మాణం చేపట్టలేదని కట్‌ ఆఫ్‌ వాల్‌లో 105 ప్యానళ్లు ఉండగా 42 దెబ్బతిన్నాయని కమిటీ తేల్చింది. ఈ నిర్మాణం విషయంలో ఆల్టర్నేట్ మెథడ్స్ ఏంటన్నది తేల్చాల్సి ఉంది. ప్రధాన డ్యాం నిర్మించేచోట పెద్ద పెద్ద అగాధాలను ఎలా పూడుస్తారో తేల్చాల్సి ఉంది.

పోలవరం ప్రాజెక్టుకు ఒకవైపు ఇన్ని సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కార మార్గాలపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. మరో వైపు కేంద్రం నుంచి నిధుల రాక కూడా కీలకమే. ఇంతవరకు రెండో డీపీఆర్‌ను కేంద్రం మంజూరు చేయలేదు. చంద్రబాబు హయాంలో 55 వేల 656 కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోదించింది. తర్వాత రివైజ్డ్‌ కాస్ట్‌కమిటీ 47 వేల 725 కోట్ల 74 లక్షల రూపాయలకు సిఫార్సు చేసింది. ఆ నిధులకు ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు.

Also Read: సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో భేటీ

మరోవైపు జగన్‌ హయాంలో తొలిదశ నిధులు అంటూ 41.15 మీటర్ల స్థాయి పునరావాసాన్ని, భూసేకరణను పరిగణనలోకి తీసుకుని, కట్టడాల కాలువల విషయంలో యథాతథ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని 31 వేల 625 కోట్లకు కేంద్ర జలసంఘం సిఫార్సు చేసింది. ఆ నిధులతో పోలవరం పూర్తిచేయడం సాధ్యం కాదు. తాజాగా ధ్వంసమైన కట్టడాల నిర్మాణానికి అదనపు నిధులు అవసరం. ఆ నిధులన్నీ కలిపి రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే కేంద్ర సహకారం కీలకమంటున్నారు సీఎం చంద్రబాబు.

పోలవరంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించాలంటే అంతర్జాతీయ నైపుణ్యం, అనుభవం ఉన్న ఎక్స్ పర్ట్స్ అవసరమని కేంద్ర జలసంఘం తేల్చింది. ఇందుకోసం ఇంటర్నేషనల్‌ డిజైన్‌ ఏజెన్సీ సహకారం తీసుకోవాలంటున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించింది. ఈ డిజైన్లు, సవాళ్ల పరిష్కారం విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News