Big Stories

Bandi Vs Etela: బండి బాసిజం.. బీజేపీలో గ్రూపిజం.. మరో కాంగ్రెస్!?

Bandi Vs Etela: కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరికివాళ్లు నిర్ణయాలు తీసుకుంటారు.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. కానీ బీజేపీలో అలాకాదు. ఓ పద్ధతి ఉంటుంది. తెలంగాణ నాయకులు ఆ కట్టుబాట్లను తెంచేస్తున్నారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ దేనికి సంకేతం? ఇన్నాళ్లూ నాలుగ్గోడల మధ్య నలిగిన ఆధిపత్య పోరు ఇప్పుడు రోడ్డున పడిందా?

- Advertisement -

ఢిల్లీ పెద్దలేమో అధికారమే లక్ష్యంగా టూర్లేస్తున్నారు. ఇక్కడి లీడర్లేమో ఎవరికివారు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అరె.. పార్టీకి ఒక పాలసీ ఉంటుంది.. కలిసి నిర్ణయం తీసుకోవాలి అనే సోయి లేకుండా పోతోంది. పొంగులేటితో మంతనాలు సాగించేందుకు వెళ్లిన ఈటల రాజేందర్ ఒక్క ముక్క కూడా బండి సంజయ్‌కు చెప్పలేదట. ఇదీ అసలు యవ్వారం.

- Advertisement -

బండిని లైట్ తీసుకుంటున్నారా?
బండి సంజయ్. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఏం చేయాలో, ఎలా చేయాలో రాష్ట్ర నాయకులకు డైరెక్షన్ ఇవ్వాల్సిన పెద్ద తలకాయ. పైగా.. కేసీఆర్ ప్రభుత్వం పేరు చెప్తేనే ఒంటికాలిపై లేస్తారు. అలాంటి బండి సంజయ్‌కు ఒక్క మాట కూడా చెప్పకుండానే పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించేదుకు ఈటల వెళ్లడంతో ఆశ్చర్యపోతోంది కాషాయ దళం. అఫ్ కోర్స్, చేరికల కమిటీ చీఫ్ ఈటల రాజేందరే అయినా.. మనతో ఎవరు టచ్‌లో ఉన్నారు.. మనం ఎవరితో టచ్‌లో ఉన్నాము.. ఎవర్ని చేర్చుకుంటే ఏంటి ప్రయోజనం.. ఎవరితో సంప్రదింపులు జరుగుతున్నాయో అధ్యక్షుడికి చెప్పాల్సిన బాధ్యత లేదా? బీజేపీలో క్రమశిక్షణ ఉంటుందని ఇన్నాళ్లు అనుకున్నమాట.. అదంతా ఉత్తుదేనని బండి సంజయ్ మాటలతో తేలిపోయినట్టయింది. అసలు మిగతా నాయకులకు బండి లోకువైపోయారా? అంత పాపం ఆయనేం చేశారు? బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలస నాయకుడు ఈటల రాజేందర్ కూడా పార్టీ చీఫ్ బండి సంజయ్‌ను ఎందుకిలా లైట్ తీసుకుంటున్నారు?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా ఆరు నెలలే ఉన్నాయి. ఈలోగా వీలైనంత మందిని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడే.. నాయకుల మధ్య సమన్వయ లోపం బయటపడింది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌కు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం మొదలైపోయింది. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి బండి సంజయ్ మాటలు.

కాషాయ దళంలో కల్లోలం?
ఈటలకే కాదు.. మరికొందరికీ బండి కంటగింపుగా మారారన్నది ఓపెన్ సీక్రెట్. ఢిల్లీ నుంచి హైకమాండ్ పెద్దల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి.. బహిరంగ సభల్ని సక్సెస్ చేసి క్రెడిట్ కొట్టేస్తుండడమే అందుకు కారణం. అదే అధిష్టానం అప్పగించిన చేరికల టాస్క్‌లో ఎవరి మార్క్‌ వాళ్లు చూపించాలనుకుంటున్నారు. పొంగులేటి ఇంటికి ఈటల వెంట రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర రెడ్డి వెళ్లారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తారని కవర్ చేసుకున్నారు బండి. తెలంగాణలో రాక్షస రాజ్యంపై పోరాడేందుకు ఎవరినైనా కలుపుకునిపోతామంటూ తనదైన మార్క్ డైలాగ్ విసిరారు. జేపీ నడ్డా, అమిత్ షా ఆదేశాలతోనే తాము పొంగులేటితో మంతనాలు జరిపామంటూ బండికి ఈటల పరోక్షంగా కౌంటర్ కూడా ఇచ్చారు. వాళ్లిద్దరి యవ్వారం చూస్తుంటే.. కాషాయం కల్లోలంగా ఉందని తేలిపోతోంది.

బండి బాసిజం చూపిస్తున్నారా?
ఏదో, అధ్యక్షుడికి చెప్పకుండా ఈటల వెళ్లారే అనుకున్నా.. ఆయన మాత్రం అలా మీడియాతో ఓపెన్ అయిపోవాలా? తన అసంతృప్తిని బయటకు వెళ్లగక్కాలా? పెద్దరికం ప్రదర్శించి తనకు తెలిసే వెళ్లారని చెప్పొచ్చుగా? ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని క్లాస్ ఇవ్వొచ్చుగా? అలా కాకుండా తనకు చెప్పలేదంటూ పరోక్షంగా ఈటల, రఘునందన్‌రావులను బండి సంజయ్ టార్గెట్ చేయడం కరెక్టేనా?

బండి.. అందరితో మొండి?
బండి సంజయ్‌కి రఘునందర్‌రావుకు మధ్య గ్యాప్ ఉంది. ఈటలతోనూ బండికి కోల్డ్ వార్ నడుస్తోంది. అటు, ధర్మపురి అర్వింద్ అయితే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అడుగే పెట్టడం లేదు. కిషన్‌రెడ్డితో పడదనేది ఓపెన్ సీక్రెట్. ఇలా బండి సంజయ్‌కు ఎవరితోనూ పొసగడం లేదని అంటున్నారు. బండి ఎదుగుదలను మిగతా నేతలు ఓర్వలేకపోతున్నారని కూడా చెబుతున్నారు. కమలదళం.. మరో కాంగ్రెస్ మాదిరి తయారైదనే విమర్శ వినిపిస్తోంది.

అంతా ఈటలనే చేస్తున్నారా?
బీజేపీలో కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారంటూ గతంలో ఈటల రాజేందర్ సంచలన కామెంట్లు చేశారు. అందుకేనా.. పార్టీ అధ్యక్షుడికి కూడా చెప్పకుండా పొంగులేటిని ఇంటికెళ్లి మరీ కలిసి చర్చలు జరిపారు? మరి, చేరికల కమిటీలో ఉన్న వివేక్ వెంకటస్వామిని ఎందుకు తీసుకెళ్లలేదు? బండితో విబేధిస్తున్న రఘునందన్‌ను కావాలనే వెంటబెట్టుకుని వెళ్లారా? సంజయ్‌కు పోటీగా ఈటల పార్టీలో ఎదగాలని చూస్తున్నారా? చేరికలతో హైకమాండ్‌ను ఇంప్రెస్ చేస్తున్నారా? అధికారంలోకి వస్తే ఈటలనే సీఎం అవుతారనే ప్రచారం వెనుక ఎవరున్నారు? ఇలా అనేక ప్రశ్నలు. బీజేపీలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News