Big Stories

Munugodu Politics : రేవంత్ రెడ్డిపై కుట్ర!.. కోమటిరెడ్డినే కోవర్ట్?

Munugodu Politics : అనుముల రేవంత్ రెడ్డి. అభిమానులకు టైగర్ రేవంత్ రెడ్డి. దూకుడు పాలిటిక్స్ ఆయన స్టైల్. కంచు కంఠం, పంచ్ డైలాగ్స్, పదునైన విమర్శలు, ఆకట్టుకునే ప్రసంగాలతో తెలంగాణ రాజకీయాల్లో టాప్ లీడర్ గా ఎదిగారు. ఆయన టాలెంట్ ను గుర్తించే పీసీసీ చీఫ్ పోస్ట్ వరించింది. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. కేసీఆర్ అండ్ కో కు నిద్ర లేకుండా చేస్తున్నారు. అలాంటి రేవంత్ రెడ్డి సామర్థ్యానికి మునుగోడు ఉప ఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో గెలవక తప్పని పరిస్థితి. అందుకే, మునుగోడు బాధ్యతలను పూర్తిగా తానే తీసుకున్నారు. స్థానికంగా మకాం వేసి.. ఫుల్ టైమ్ ప్రచారం చేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు తోడుగా.. మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతిని అసెంబ్లీకి పంపించాలంటూ ఊరూరా తిరుగుతున్నారు. అయితే.. ప్రచారంలో భాగంగా తాజాగా రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఆ ఫైర్ బ్రాండ్ లీడర్.. ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏం అన్నారంటే…..

- Advertisement -

పీసీసీ చీఫ్ గా ఉన్న తనపై కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. మునుగోడులో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఓడించి.. ఆ ఓటమిని తనపై నెట్టేయాలని.. అది సాకుగా చూపించి తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొందరు పెద్ద కుట్ర చేస్తున్నారంటూ పొలిటికల్ బాంబ్ పేల్చారు. సీఎం కేసీఆర్ తో చేతులు కలిపి.. కొందరు సొంతపార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. త్వరలోనే వారందరి పేర్లు బయటపెడతానని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తించి.. మునుగోడులో కష్టించి పనిచేసి.. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని గెలిపించాలంటూ వేడుకున్నారు. ఈ విషయం చెబుతూ.. రేవంత్ రెడ్డి కాస్త ఎమోషనల్ అయ్యారు.

- Advertisement -

కట్ చేస్తే.. రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్ట్ పాలిటిక్స్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది. మునుగోడులో తన సోదరుడైన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ ఓ కాంగ్రెస్ నేతతో వెంకట్ రెడ్డి మాట్లాడిన ఫోన్ కాల్ లీక్ అయ్యింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. తానే పీసీసీ ప్రెసిడెంట్ అవుతానని.. ఆ వెంటనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని ఆ ఆడియోలో వెంకట్ రెడ్డి అంటున్నట్టు స్పష్టంగా ఉంది. పార్టీలను చూడకుండా రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలంటూ వెంకట్ రెడ్డి చెబుతున్న ఆడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అంటే.. రేవంత్ ను ఎలాగైనా పీసీసీ చీఫ్ పదవి నుంచి దించేసేలా.. వెంకట్ రెడ్డి కోవర్ట్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ లో ఉంటూనే.. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి ప్రయత్నించడాన్ని క్షమించలేమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పాలిటిక్స్ తో దూసుకుపోతుంటే.. సొంతపార్టీ నేతలే ఇలా వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతుండటంపై కాంగ్రెస్ వర్గాలు కస్సుమంటున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సీఎం కేసీఆర్ తో కుమ్మక్కై ఇలా చేస్తున్నారా? లేక, తన సొంత ఎజెండా ప్రకారం పీసీసీ కుర్చీపై కన్నేసి కుట్ర చేస్తున్నారా? లేదంటే, తన తమ్ముడిని గెలిపించుకునేందుకే కాంగ్రెస్ కు ద్రోహం చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News