Big Stories

YSRCP Defeat: వైసీపీ నాయకులకు తెలిసిన నిజం జగన్ తెలియలేదా..?

YSRCP Defeat in AP Elections 2024: నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్న రకంగా వైసీపీ అధినేత జగన్ వ్యవహారం ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి పార్టీ నేతలతో వరుసగా మీటింగులు పెడుతున్నారు. సమీక్షలు జరుపుతున్నారు. కానీ, ఆయన చెప్పాలనుకున్నదే చెబుతున్నారు తప్పా.. ఓటమికి కారణాలను వెతుక్కోవడం లేదు. నిజాయితీగా రాజకీయాలు చేయడం వలనే ఓడిపోయానని ఆయన పార్టీ నేతలతో చెప్పడం వినడానికి ఇంపుగా ఉంది. మొదటి నుంచి జగన్ అదే విషయం చెబుతున్నారు. అక్కా చెల్లెమ్మలకు, అవ్వా తాతలకు చేసిన సేవ ఎటు పోయిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ నెంబర్ సీట్లే వస్తాయని ఆశపడుతున్నారు.

- Advertisement -

ఇవే తప్పా.. అసలు ఓటమికి కారణం ఏంటీ అని మాత్రం విశ్లేషించుకోలేకపోతున్నారు. అసలు ఆ దిశగా అడుగులు కూడా వేయడం లేదు. ఫలితాలు ఎవరూ ఊహించనంత దారుణంగా వచ్చాయి కాబట్టి.. కొన్ని రోజులు బాధపడతారు. దాన్ని ఎవరూ కాదనలేదు. ఆ బాధలో ఈవీఎంలను సహజంగా తప్పుపట్టొచ్చు. కానీ ఫలితాలు వచ్చి 20 రోజులు అవుతున్నా.. ఇంకా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడలేకపోతే అది వైసీపీకే నష్టం. తనదేమీ తప్పు లేదు.. చంద్రబాబుదే తప్పు.. ప్రజలు తనకు ఎందుకు ఓట్లు వేయలేదో తెలియదని అనుకుంటే.. తన తప్పును సరిదిద్దుకొనే అవకాశం ఉందదు. అయితే, ఓవైపు పార్టీ నేతలు వరుసగా వారి అభిప్రాయాలు చెబుతున్నారు. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుతున్నారు.

- Advertisement -

గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తనకు అవగాహన ఉన్న కారణాలను ఆయన చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు. చంద్రబాబు, పవన్ ను బూతులు తిట్టడం ప్రజల్లో తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచిందని అన్నారు. దాన్ని కట్టడి చేయాల్సిన వారు చేయలేదని కాసు మహేష్ రెడ్డి చెప్పారు. సజ్జల, విజయసాయిరెడ్డి దగ్గరకు పార్టీలో జరుగుతున్న తప్పులను తీసుకొని వెళ్లినా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. కొడాలి నాని బూతులు, వల్లభనేని వంశీ భువనేశ్వరిపై చేసిన కామెంట్స్ వైసీపీకి తీరని నష్టం చేశాయని అన్నారు. వైసీపీ ఓటమికి కాసు మహేష్ రెడ్డి చెప్పినవి కూడా ప్రధాన కారణాలే. అయితే, వీటికి వైసీపీ అధినేత అంగీకరించే పరిస్థితిలో లేరు.

Also Read : వైసీపీ ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ అధికారుల రాజీనామాలు..

కాసు మాత్రమే కాదు.. అడపా దడపా.. వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే నోరు మెదుపుతున్నారు. వారి అభిప్రాయాలు చెబుతున్నారు. పార్టీ నేతలు వారి అభిప్రాయాలను అధినేత దగ్గర ఆఫ్ ది రికార్డ్ చెబితే.. ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. కానీ, జగన్ దగ్గర చెప్పే స్వేచ్ఛ ఇంకా వారికి లేనట్టు ఉంది. అందుకే ఆఫ్ ది రికార్డ్ చెప్పాల్సిన మాటలు ఆన్ ది రికార్డ్ చెబుతున్నారు. అయినా.. పార్టీ నేతల అభిప్రాయాలకు విరుద్దంగా జగన్ క్లాసులు తీసుకుంటే.. ఇంకా వారేం చెబుతారు. కొన్ని రోజుల్లో చంద్రబాబు తప్పు చేస్తారు. ఆ తప్పులనే ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ గెలుస్తామని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది. ముందు మనం చేసిన తప్పులను సరిదిద్దుకొని ప్రజల్లోకి వెళ్లారు. మన తప్పులు మనం తెలుసుకోకుండా ఎదుటివారి తప్పులను ఎత్తి చూపితే ప్రజలు అంగీకరిస్తారా?

చంద్రబాబు 2019 ఎన్నికల ఓటమి తర్వాత 23 స్థానాలకే ప్రజలు పరిమితం చేశారా? అంత పెద్ద తప్పులు చేశామా అని పార్టీ నేతల దగ్గర ప్రశ్నించారు. అంటే.. తప్పులు జరిగాయి.. వాటిని సరిదిద్దుకోవడానికి ఆయన అప్పుడే రెడీ అయ్యారు. దానికి తగ్గట్టుగానే అడుగులు వేశారు. ఓడిపోయిన ప్రతీసారి చంద్రబాబు.. గతంలో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుంటామని పదేపదే చెబుతూ వచ్చేవారు. ఆయన పాలనలో కూడా ఆ మార్పు కనిపించేది. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు ఐటీ, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలెమ్మెంట్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. సాగు నీటి ప్రాజెక్టులను ఒకింత నిర్లక్ష్యం చేశారు.

Also Read : జగన్ బెంగుళూరుకి వెళ్తున్నారా? గాలితో మంతనాలు?

కానీ.. 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి వ్యవసాయం, నీటి పారుదల శాఖలపై ఎక్కువ దృష్టి పెట్టి రైతులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు 2014 తర్వాత పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంటే.. పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చంద్రబాబు తన ఆలోచనలు మార్చుకున్నారు. అందుకే ఓడిపోయినా.. తన తప్పులను సరిదిద్దుకొని మళ్లీ అధికారంలోకి వస్తున్నారు. కానీ, జగన్ అలా చేయడానికి ఇష్టపడటం లేదు. అసలు తనదేం తప్పే లేదని అనుకుంటున్నారు. జగన్ ఆలోచన అక్కడే ఉంటే.. ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం ఉండదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News