Big Stories

Supremecourt : ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టాలి.. జీవో నం.1పై సుప్రీం ఆదేశాలు..

Supremecourt : ఏపీలో రహదారులపై రోడ్డు షోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1 పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు హైకోర్టులో విచారణ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 23న జీవో నెం 1పై ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం విచారణ జరపాలని ఆదేశించింది.

- Advertisement -

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విచారించే పరిధి వెకేషన్ బెంచ్‌కు లేదని కోర్టుకు తెలిపారు. తనకు లేని పరిధిలో వెకేషన్ బెంచ్ తీర్పు చెప్పిందని వాదించారు. ఉదయం 10:30 గంటలకు కేసును మెన్షన్ చేసి.. ప్రతివాదుల వాదనలు వినకుండానే అదే రోజున తీర్పు వెల్లడించిందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ వాదనను తన ఉత్తర్వులలో రికార్డు చేసిన సీజేఐ డీవై చంద్రచూడ్.. కేసు మెరిట్స్ లోపలికి వెళ్లడం లేదని తెలిపారు. హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.

- Advertisement -

జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైకోర్టులోనే కేసు విచారణ జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు. రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలను ఇబ్బంది పెట్టేందుకే జీవో నంబర్‌ 1ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News