Big Stories

AP: ఏపీలో డయేరియా కలకలం.. ఇద్దరు మృతి

Diarrhea cases increase in Kakinada(AP news live): ఏపీలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. కాకినాడ జిల్లాలో అయితే డయేరియా కేసులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు డయేరియా బాధితుల సంఖ్య 210కు చేరింది. కొమ్మనాపల్లికి చెందిన ఓ మహిళ, వేట్లపాలెంకు చెందిన మరో మహిళ మృతిచెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో డయేరియా బాధితులకు చికిత్స అందించేందుకు కాకినాడ జీజీహెచ్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. డీఎంహెచ్ఓ ఆఫీస్ లో నిరంతరం మానిటరింగ్ చేసేలా హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. తొండంగి మండలం కొమ్మనాపల్లి, సామర్లకోట మండలం వేట్లపాలెంలో వైద్యబృందాలతో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. కలుషిత తాగునీరు సరఫరా, పైప్ లైన్ల లీకేజీలతో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసిన అధికారులు టెస్టింగ్ కు పంపించారు.

- Advertisement -

ఇటు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా జనాలను డయేరియా కలవరపెడుతుంది. ఇప్పటికే డయేరియా వల్ల ఒకరు మృతిచెందడం, కేసులు భారీగా నమోదవ్వడంతో జనాలు వణికిపోతున్నారు. నియోజకవర్గంలోని 8 గ్రామాలకు డయేరియా పాకింది. దీంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రి రోగులతో నిండిపోయింది. ఇక వెంటనే అప్రమత్తమైన అధికారులు రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో 16 మంది వైద్యులు 24 గంటలపాటు సేవలు అందిస్తున్నారు. నియోజకవర్గంలో డయేరియా ప్రబలడంతో పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు. నీరు రంగు మారిపోవడం, ఆ ప్రాంతంలో డ్రైనేజీ లోంచే మంచి నీటి పైప్ లైన్లు వెళ్లడం ఆందోళనకు గురి చేస్తుంది. ఈ విధంగా జరుగుతుందంటూ గత ఐదేళ్ల నుంచి ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ స్థానిక ప్రజలు చెబుతున్నారు.

- Advertisement -

Also Read: ఏపీ మహిళలకు శుభవార్త.. ఫ్రీ బస్సు జర్నీ వివరాలను వెల్లడించిన మంత్రి

అయితే, డయేరియా విజృంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమయ్యింది. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నది. వర్షాకాల నేపథ్యంలో అంటురోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు సూచిస్తోంది. ఇటీవల డయేరియా వ్యాధి కట్టడిపై అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిలదీశారు. ఇటు వివిధ శాఖల అధికారులతో సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. మంచినీటి పైపులైన్లలో లీకేజీలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News