Big Stories

Jagan : బందరు పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం.. ఎప్పటికి పూర్తవుతుందంటే..?

CM Jagan News Today(Latest news in Andhra Pradesh) : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. తపసిపూడిలో భూమి పూజ చేసి పైలాన్‌ ఆవిష్కరించారు. మచిలీపట్నం పోర్టులో మొత్తం నాలుగు బెర్తులు ఉంటాయి. రెండు జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌ గా ఉపయోగిస్తారు. 35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ పోర్టు పనులను 24–30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోర్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది. భవిష్తత్తులో 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు.

- Advertisement -

ఈ పోర్టు.. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్‌ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారుతుంది.

- Advertisement -

పూర్వకాలంలో తూర్పుతీరంలో ఆంగ్లేయులతోపాటు డచ్, పోర్చుగీస్‌ వారికి వ్యాపార కేంద్రంగా మచిలీపట్నం పోర్టు ఉపయోగపడింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. రూ.5,156 కోట్ల నిధుల విడుదల కోసం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న పోర్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు, ఏప్రిల్‌ 13న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసం 1,923 ఎకరాల భూసేకరణ చేపట్టారు.

పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4,000 ఎకరాల సాల్ట్‌ భూములను ప్రభుత్వం గుర్తించింది. పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్‌ ఏర్పాటు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం లభిస్తుంది.

పోర్టును ఎన్‌హెచ్‌ 216కు అనుసంధానం చేస్తూ 6.5 కి.మీ. 4 లేన్ల రహదారి నిర్మిస్తారు.పెడన రైల్వేస్టేషన్‌ నుంచి పోర్టు వరకు 7.5 కి.మీ రైల్వే లైన్‌ నిర్మాణం చేపడతారు. బందరు కెనాల్‌ నుంచి 11 కి.మీ పైప్‌లైన్‌ ద్వారా 0.5 ఎంఎల్‌డీ నీటి సరఫరా చేస్తారు. పెడన 220 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి 15 ఎంవీఏ విద్యుత్‌ సరఫరా జరగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News