Amaravathi : ఆర్-5 జోన్ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో సీఎం జగన్ పట్టాల పంపిణీ నేపథ్యంలో.. రైతులు నిరసన బాటపట్టారు. రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలె గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు.
వెలగపూడిలోని దీక్షా శిబిరం వద్ద రైతులు నల్లబెలూన్లు, నల్ల జెండాలు ఎగురవేశారు. సీఎం జగన్ మొండి వైఖరి నశించాలని నినదిస్తున్నారు. అమరావతిని విచ్ఛిన్నం చేసే సీఎం గో బ్యాక్ , అమరావతిని నిర్మించండి.. ఆంధ్రప్రదేశ్ కాపాడండి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు.
మందడంలోని దీక్షా శిబిరం వద్ద నుంచి నిరసనకారులు బయటకు రాకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో 3 వేల మంది పోలీసులను మోహరించారు. అమరావతి రైతుల ఆందోళనపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అమరావతి జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ముందుస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు.
సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందిని, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లేఔట్లు ఏర్పాటు చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు, సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో గృహాలనూ లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు.
Leave a Comment