Big Stories

BRS : ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. కేసీఆర్ వ్యూహం ఇదేనా..?

BRS : బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై కేసీఆర్ దృష్టి పెట్టారు. అందుకు పక్క రాష్ట్రాన్నే వేదికగా ఎంచుకున్నారు. ఇటీవల తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, పార్థసారథి లాంటి నేతలను పార్టీలో చేర్చుకున్న గులాబీ బాస్ ఇప్పుడు ఏపీలో కార్యకలాపాలను ముమ్మరం చేసే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు.

- Advertisement -

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, పార్టీ నేత చింతల పార్థసారథి బుధవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఏపీలో పార్టీ విస్తరణపై చర్చించారు. ఏపీలో ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో సభా వేదిక, తేదీలను ఖరారు చేయనున్నారు. దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ప్రజల్లోకి ప్రబలంగా తీసుకెళ్లాలని కేసీఆర్..తోట చంద్రశేఖర్‌కు సూచించారు. ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని నిర్దేశించారు. పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. ముందుకొచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలని సూచించారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ చెప్పారని సమాచారం. పార్టీ ఆవిర్భావ సభ జరిగే రోజు భారీ చేరికలుంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

- Advertisement -

ఇప్పటివరకు చేరిన నేతల్లో ఎక్కువ మంది బీజేపీ, జనసేన నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఆ తర్వాత టార్గెట్ టీడీపీనే అని తెలుస్తోంది. ఆ పార్టీ నుంచి కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ మధ్య వైసీపీలో కొందరు నేతలు బాహాటంగా పార్టీపై వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఆనం రాంనారాయణరెడ్డి, వసంత కృష్ణప్రసాద్ బహిరంగంగానే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. వైసీపీ టిక్కెట్ దక్కదనే అనుమానం ఉన్న నేతలు బయటకు వచ్చే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

వైసీపీ నుంచి బయటకు వచ్చే నేతలకు బీఆర్ఎస్ గేలం వేస్తుందా? వారు టీడీపీ , జనసేన, బీజేపీ వైపు వెళ్లకుండా ఆకర్షిస్తుందా ? అంటే అది అంత వీజీ కాదనే స్పష్టమవుతోంది. ఎందుకంటే వైసీపీని వీడె నేతలు టీడీపీవైపే ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఈ మధ్య దూకుడు పెంచారు. మళ్లీ ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వం నిబంధనల పేరుతో తన కార్యక్రమాలపై ఆంక్షలు పెడుతున్నా తగ్గేదే లేదంటూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలు అదే ఉత్సాహంతో వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి ఊపు వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్న ఏపీలో బీఆర్ఎస్ బలమైన నేతలను ఆకర్షించ గలుగుతుందా ? వైసీపీ, టీడీపీలకు దీటుగా పోటీ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే కష్టమే అంటున్నారు రాజకీయ పండితులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News