Big Stories

AP Assembly Session: ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session: ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మూడురోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు సమావేశాలు జరగనున్నాయి. అయితే, వాస్తవానికి 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉండగా, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండడంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. సమావేశాలు ప్రారంభమయ్యేరోజు అనగా 24న ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. ఆ తరువాత నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రం ఉండనున్నది.

- Advertisement -

గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో కొనసాగారు. అయితే, ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పలు వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు శపథం చేశారు. ఈ సభలో తమపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారంటూ, తాను సీఎం అయినతరువాతనే అసెంబ్లీలో అడుగుపెడుతాను తప్ప అప్పటివరకు సభలో అడుగుపెట్టబోనంటూ పేర్కొన్నారు. అన్నట్టుగా ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి గెలిచింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు.. పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకున్నది. పలువురు చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శపథం చేసి మరి ముఖ్యమంత్రి హోదాలో తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారంటూ ఆయన పొగుడుతున్నారు.

- Advertisement -

Also Read: ఏపీలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: హోం మంత్రి అనిత

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. మొదటగా పోలవరం ప్రాజెక్టు వద్ద ఏరియల్ వ్యూ నిర్వహించారు. స్పిల్ వే తోపాటు పోలవరం చుట్టుపక్కల ప్రాంతాలను వీక్షించారు. ఆ తరువాత అధికారులతో మాట్లాడి.. పనులపై ఆరా తీశారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం విషయంలో గత ప్రభుత్వం చేయకూడని తప్పులు చేసిందన్నారు. గత ప్రభుత్వం పోలవరం పనులను కొనసాగించి ఉంటే ప్రాజెక్టు 2022లోనే పూర్తయ్యి ఉండేదన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పోలవరాన్ని ప్రారంభించామని, కానీ పోలవరాన్ని పూర్తి చేయకుండా తన కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరుగా మార్చారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరంభం నుంచి కూడా ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నదన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News