Big Stories

Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. చిన్నచిన్న వార్తల సమాహారం..

Chota News: జమ్మూ–కశ్మీర్‌లో హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మరణించిన తెలంగాణ జవాన్‌ పబ్బాల అనిల్‌ భౌతికకాయం ఆయన స్వస్థలమైన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం, మల్కాపూర్‌కు తరలించారు. నేడు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో బండి సంజయ్, వినోద్ కుమార్ పాల్గొననున్నారు.

- Advertisement -

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని శిల్పా వెంచర్‌లో ఓ వ్యక్తి ఇనుప్ప రాడ్లు దొంగిలించాడనే కారణంతో.. అతడిని తాడుతో కట్టేసి కొట్టారు. బలంగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. మృతుడు బాగారెడ్డిపల్లి కాలనీనికి చెందిన మహేష్‌గా గుర్తించారు. తమకు తగిన న్యాయం చేయాలని మృతుడి కుటుంబీకులు కోరుతున్నారు. పోలీస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ ప్రేమ జంట ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ప్రేమ జంటపై తేనెటీగలు దాడి చేశాయి. మల్లప్ప కొండపై ప్రేమ కార్యకలాపాలలో నిమగ్నమైన ప్రేమ జంటను ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టాయి. తేనెటీగల దాడిలో ప్రేమజంట తీవ్రంగా గాయపడింది. స్థానికులు వారిని పీఈఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బాకారాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. భార్య పరిస్థితి విషమం ఉంది. బోడెవాండ్లపల్లెకు చెందిన దంపతులు గురుప్రసాద్, సునంది బైక్‌పై తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెళ్లైన నెలకే గురుప్రసాద్ మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ఓ ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు మాటువేసి బంగారంతో పాటు నగదు చోరీకి పాల్పడ్డారు. 10 తులాల బంగారంతో పాటు. రూ 2 లక్షల నగదును అపహరించారు. ఈ చోరీలో ఇద్దరు పురుషులతో పాటు ఓ మహిళ కూడా ఉన్నట్టుగా కుటుంబీకులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తూప్రాన్‌లోని వినాయక నగర్‌లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో ఇరువైపులా ఉన్న నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది కూల్చివేస్తున్నారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారంటూ మున్సిపల్ సిబ్బందితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమరరాజా గిగా కారిడార్‌కు శంకుస్థాపన చేసి.. ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. శిల్పారామం, జంగల్ సఫారీ, కేబుల్ బ్రిడ్జిలను కూడా మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం ప్రభుత్వ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు.

వరంగల్ జిల్లా నర్సంపేటలో నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సంపేట పట్టణం నెక్కొండ రోడ్డులో అద్దెకు ఉంటూ ఓ ప్రైవేటు కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ప్రణయ్.. సాయంత్రం కాలేజీ నుంచి రూముకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నూజీవీడు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఫీజులు చెల్లించాలని యాజమాన్యం హుకుం జారీ చేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినా….అసలేం జరగలేదని యాజమాన్యం చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత పర్యటన టైమ్‌లో దాడి జరిగిన నేపథ్యంలో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. జమ్మూలో ఆయన పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా అక్కడ పర్యటిస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా గుళ్లకుంట కాలనీలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. పిల్లలిద్దరూ రెండ్రోజుల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా…పిల్లలు ఇంటి వద్దే ఆడుకుంటూ ఉన్నారు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ మైండ్ స్పేస్ మార్గంలో ట్రాఫిక్ సిగ్నల్ పోల్ రోడ్డుపై కిందపడిపోయింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పోల్ రోడ్డుపై పడిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్ పోల్ పడిపోవడంతో.. దానికి ఆనుకొని ఉన్న విద్యుత్ తీగలు కిందకు వాలిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు.. రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో భట్టి హామీల వర్షం కురిపించారు. 2024 ఎన్నికల్లో గెలిపిస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. పేదవాడికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు.

దెబ్బతగిలిందని ఆస్పత్రికి వెళ్తే కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో అతికించేశారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో ఈ ఘటన జరిగింది. ఓ బాలుడి ఎడమ కంటి పైభాగంలో దెబ్బతగలడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో అతికించారు. బాలుడి తండ్రి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. వైసీపీ ఫ్లెక్సీలు ఉంచి… టీడీపీ ఫ్లెక్సీలను తొలగించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ నాయకులకు- కమిషనర్ రామయ్యకు మధ్య వివాదం చెలరేగింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహంతో వాటిని రాత్రికి రాత్రే తొలగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఏపీలో ఇవాళ పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరిగాయి. పరీక్షలు పూర్తయిన తర్వాత కేవలం 18 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తున్నారు.

పెరూ దేశంలో విచిత్రమైన చోరీ వెలుగులోకి వచ్చింది. ఓ చెప్పుల దుకాణంలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు… అక్కడ డిస్‌ప్లేలో ఉంచిన షూస్‌ను ఎత్తుకెళ్లారు. 200 బూట్లు చోరీకి గురైనట్లు యజమాని వెల్లడించారు. అయితే, నిందితులు ఎత్తుకెళ్లినవన్నీ కుడి కాలి బూట్లే అని యాజమాని తెలిపారు. వాటి విలువ 10 లక్షలకుపైగా ఉంటుందని అంచనా.

మణిపూర్‌లో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయి. రెండ్రోజుల క్రితంతో పోలిస్తే పరిస్థితులు మెరుగయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. అయితే కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోందన్నారు. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని ఆర్మీకి ఆదేశాలు అందాయి. మరోవైపు అల్లరి మూకల దాడిలో గాయపడ్డ బీజేపీ ఎమ్మెల్యేను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు.

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 8 నుంచి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపింది. వారం రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మారిన వాతావరణ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించింది.

ఇన్ స్టా రీల్ సరదా ప్రాణం తీసింది. హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లోని ఇన్ స్టా రీల్స్ చేస్తుండగా.. రైలు ఢీకొని విద్యార్థి సర్ఫరాజ్ మృతి చెందాడు. రైల్వే ట్రాక్ పై రీల్ చేస్తుండగా ఘటన జరిగింది. ఈ ఘటనలో సర్ఫరాజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు రహ్మత్ నగర్‌కు చెందిన మహ్మద్ సర్ఫరాజ్‌గా గుర్తించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News