YS Sharmila Breaking News Updates(Breaking News Telangana) : తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని ప్రారంభించిన వైఎస్ షర్మిల పాదయాత్రతో ప్రజాదరణ పొందాలనుకున్నారు. రాష్ట్రంలో చాలా జిల్లాలను చుట్టేశారు. ప్రజల వద్దకు వెళ్లారు. తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే తన పార్టీని గెలిపించాలని కోరారు. నేరుగా రైతుల చెంతకు వెళ్లారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పట్టించుకోవడంలేదని విమర్శలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను తీరుస్తానని హామీలు ఇస్తూ పాదయాత్ర కొనసాగించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకుసాగారు. ఇలా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో షర్మిల పాదయాత్ర సాగింది.
పాదయాత్ర ముందుకు సాగిన కొద్దీ షర్మిల స్వరం మార్చారు. ప్రభుత్వంపై, మంత్రులపై ఘాటైన విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడ నుంచే షర్మిలకు పాదయాత్రలో ఆటంకాలు ఎదురయ్యాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన విమర్శలు తీవ్ర వివాదాన్ని రేపాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో షర్మిలను పోలీసులు హైదరాబాద్ కు తరలించారు.
ఈ ఘటన తర్వాత షర్మిల గేర్ మార్చారు. ధ్వంసమైన కారుతోనే ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కారు డోర్ లాక్ చేసుకున్నారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఆ కారును క్రేన్ తో లిఫ్ట్ చేసి ట్రాఫిక్ వాహనంపైకి వెక్కించి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన తర్వాత షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది.
హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు షర్మిల. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశిస్తూ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాల తర్వాత షర్మిల ఆచితూచి వ్యవహరించలేదు. అదే దూకుడును కొనసాగించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో వివాదం మరో రచ్చరేపింది. ఈ సమయంలో షర్మిల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆమె చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని హిజ్రాలు ఆందోళనకు దిగారు. దీంతో షర్మిల వారికి సారీ చెప్పారు. ఇలా నిత్యం ఏదో ఒక వివాదం షర్మిల చుట్టూ తిరుగుతోంది.
తాజాగా లోటస్ పాండ్ దగ్గర షర్మిల ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై దౌర్జన్యానికి దిగడాన్ని సామాన్యులు తప్పుపడుతున్నారు. పోలీసులను నెట్టివేయడమే కాకుండా ఓ మహిళా పోలీసుపై చేయిచేసుకోవడం కలకలం రేపింది. అంతటితో ఆగకుండా పోలీసులపై తన వాహనం ఎక్కించే ప్రయత్నం చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
కొంతకాలంగా షర్మిల విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మాటలు, చేతలు విచిత్రంగా ఉంటున్నాయని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారని తెలుస్తోంది. పాదయాత్ర ప్రారంభించిన కొత్తలో ప్రజాసమస్యలనే ప్రస్తావిస్తూ సూటిగా విమర్శలు చేసి షర్మిల తన వాక్ చాతుర్యంతో ఆకట్టుకున్నారు. కానీ ఆమె ధోరణి మారిన తర్వాత ఆమె ప్రసంగాలు ట్రోలింగ్ కు గురవుతున్నాయి. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అదుపుతప్పుతున్నాయి. దీంతో ఆమె నవ్వుల పాలవుతున్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని షర్మిల గుర్తిస్తారా..? లేక ఇదే ధోరణితో ముందుకెళతారా..?
అటు షర్మిల తల్లి విజయలక్ష్మి ప్రవర్తనపైనా విమర్శలు వ్యక్తవుతున్నాయి. షర్మిలను పోలీసులు ఎప్పుడు అడ్డుకున్నా వెంటనే విజయమ్మ ఎంట్రీ ఇస్తున్నారు. పోలీసులతో వాదనలకు దిగుతున్నారు. తాజాగా విజయలక్ష్మి కూడా సహనం కోల్పోయారు. ఓ పోలీసుపై చేయిచేసుకున్నారు. తల్లి, కుమార్తెలపై ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.