భారతదేశంలో ఎన్నో ఆచారాలు, నమ్మకాలు ఉంటాయి. అయితే కొన్ని ఆచారాలు చూస్తే మాత్రం వింతగా ఉంటుంది. అలాంటి ఓ ఆచారమే కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామంలోనూ ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడి ప్రజలు ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు. దీపావళి సందర్భంగా గ్రామంలో కొలువై ఉన్న కారుమంచేశ్వర, హుల్తిలింగేశ్వర స్వామి వారికి ఇక్కడ గంగపూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది.
గంగపూజ అనంతరం హంద్రీ వాగు కట్టపై స్వామివారి ఉత్సవ విగ్రహాల ముందు భక్తులు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ పడుకుంటారు. స్వామి వారి విగ్రహాన్ని ఓ వ్యక్తి తలపై మోస్తుంటారు. ఆ వ్యక్తి పాద స్పర్శ తాకితే కష్టాలు తీరుతాయని ఇక్కడి భక్తులు నమ్ముతుంటారు. పాదాలను తాకడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడంతో పాటు సంతాన సాఫల్యత కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుండి సైతం ఇక్కడకు భారీగా భక్తులు వస్తుంటారు.
గంగపూజ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందేందుకు భక్తులు గంటల తరబడి హంద్రీ వాగులో స్నానం చేసి తడిబట్టలతో బోర్లా పడుకునే ప్రార్థిస్తారు. బోర్లా పడుకుని ఉన్న భక్తుల వద్దకు స్వామి వచ్చి స్పర్శించి పలకరిస్తే వారికి పూలు, బండారు ఇచ్చి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు. ఇక్కడికి వచ్చి పాత స్పర్శ భాగ్యం కలిగితే సకల కష్టాలు తీరుతాయని భక్తులు ఎంతో నమ్మకంగా పూజిస్తారు. వింత ఆచారంతో జరిగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా వస్తారు.