Brahmamudi serial today Episode: రాజ్ ఏంటి సీన్ రివర్స్ అయినట్ల ఉంది అనుకుని రాజ్ వెళ్లి ఒక్కోక్కరిని పలకరిస్తుంటాడు. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ప్రకాష్ పిలిచి నిన్నటి నుంచి నీకేదో చెప్పాలి అనిపిస్తుందిరా అనగానే నాకు తెలుసు బాబాయ్ నువ్వేం చెప్తావో.. చెప్పు.. చెప్పు అనగానే మర్చిపోయానురా అంటాడు ప్రకాష్. దీంతో అందరూ నవ్వుతుంటారు. ఇప్పటి నుంచి నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఒక బోర్డు మీద రాసి పెట్టుకో బాబాయ్ అంటాడు రాజ్. ఆ బోర్డు కూడా ఎక్కడ పెడతారో మర్చిపోతాడు రాజ్ అని ధాన్యలక్ష్మీ అనడంతో నువ్వు ఉన్నావు కదే గుర్తు చేయడానికి అయినా నీకు కూడా రాజ్ లాగా పని పాట ఏం లేదు కదా? ఎప్పుడు అక్కడ కూర్చుని కాఫీలు తాగుతుంటావు కదా? నువ్వే గుర్తు చేయ్ అంటాడు ప్రకాష్.
ఇంతలో రాజ్ సుభాష్ దగ్గరకు వెళ్లి పలకరించి మీరు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా..? డాడ్ అంటాడు. అవున్నా కానీ నువ్వు ఒప్పుకుంటావో లేదోనని ఆగిపోయాను అంటాడు సుభాష్. అయితే ఏమీ చెప్పొద్దులే డాడ్ మీరు ఏం చెప్తారో నాకు అర్థం అయింది అంటాడు. అదేంట్రా నేను నీ కారు తీసుకెళ్తానని నీకు ఎలా తెలిసింది అంటాడు సుభాష్. ముందునుంచి కారు తీసుకెళ్లడానికి వాణ్ని అడగడం ఏంటన్నయ్యా.. వాడికెలాగూ పని లేదు కదా? నువ్వు తీసుకెళ్లు అంటాడు ప్రకాష్.. అపర్ణ అప్పుడే రాజ్‌న పిలుస్తూ తన రూంలోంచి బయటకు వస్తుంది. అపర్ణను చూసిన రాజ్ మరింత ఉత్సాహంతో మమ్మీ గ్యారంటీగా అదే అడుగుతుంది అని మనసులో అనుకుని.. మమ్మీ ఏంటి మమ్మీ.. అంటూ ఎదురుగా వెళ్తాడు.
నీతో ఇదే చిక్కురా.. ఏదైనా చెబితే ఒక పట్టానా ఒప్పుకోవు అంటుంది అపర్ణ. ముందు విషయం ఏంటో చెప్పు మమ్మీ.. ఒప్పుకోవాలా వద్దా అనేది. నేనే డిసైడ్ చేస్తాను అంటాడు రాజ్. అదేంటంటే అని అపర్ణ ఏదో చెప్పబోతుంటే.. ఆపు మమ్మీ నాకు తెలుసు నువ్వేం చెప్తావో అంటాడు రాజ్. నీకు ముందే తెలుసా..? నేను నిన్ను కూరగాయలు తీసుకురమ్మని చెప్తానని నీకు ముందే తెలుసా..? అంటూ అపర్ణ ఆశ్చర్యంగా అడుగుతుంది. దీంతో షాకింగ్ గా రాజ్ నేను కూరగాయలకు వెళ్లాలా..? అంటూ అడుగుతాడు. అవునని.. ఇంట్లో నువ్వే ఖాళీగా కూర్చున్నావు కదా? అంటూ పైగా కావ్యకు భయపడి ఆఫీసుకు కూడా వెళ్లడం లేదు అంటుంది అపర్ణ. ఓహో మీరు ఇలా రూటు మార్చారా… సరే నేను రూటు మారుస్తాను అని మనసులో అనుకుని రాజ్ సరే మమ్మీ ఏమేం కూరగాయలు కావాలో చెప్పు నోట్ చేసుకుని వెళ్లి తీసుకొస్తాను అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇందిరాదేవి వీడి కూరగాయలు తీసుకొస్తే అన్ని పుచ్చులు.. చచ్చులే ఉంటాయి అంటుంది. రాజ్ రోషంగా నేను కూరగాయలు తీసుకొచ్చాక ఆ మాటను నాన్నామ్మా అంటూ వెళ్లిపోతాడు రాజ్. అపర్ణ వెంటనే కనకానికి ఫోన్ చేసి రాజ్ కూరగాయలకు నేను చెప్పిన షాపు దగ్గరకే వస్తున్నాడని చెప్తుంది. అయితే ఇక నేను చూసుకుంటాను అని కనకం చెప్తుంది.
కావ్య ఆఫీసుకు రాగానే మేనేజర్ నుంచి డీమోట్ అయిన సెక్యూరిటీ గార్డు సెల్యూట్ కూడా చేయకుండా చూస్తుంటే తిడుతుంది కావ్య. నమస్తే చెప్పడం కూడా రాదా నీకు ఇంకా పొగరు తగ్గలేదా? ఇలాగైతే బాత్రూం క్లీనింగ్ సెక్షన్ లో వేస్తానని చెప్తుంది. దీంతో ఆ ఉద్యోగి భయంతో కావ్యకు సెల్యూట్ చేసి వద్దని వేడుకుంటాడు. కావ్య లోపలికి వెళ్తుంది. ఉద్యోగులందరూ ఒకచోట చేరి కావ్య మేడం వస్తుందని కొందరు.. రాజ్ సార్ వస్తారని కొందరు బెట్ వేసుకుంటుంటారు. కావ్యను చూసి భయంతో ఎవరి ప్లేస్‌కు వాళ్లు వెళ్లిపోతారు. కావ్య.. శృతిని పిలిచి మన పాత క్లయింట్స్ అందరిని పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేయమని చెప్తుంది.
వెజిటేబుల్ షాపునకు వెళ్లిన రాజ్ అక్కడి వ్యక్తితో విచిత్రంగా బేరం ఆడుతుంటాడు. అతను ఒక రేటు చెబితే ఆ రేటు మీకు ఎలా గిట్టుబాటవుతుంది. అంటూ అందుకు డబుల్ రేటు ఇస్తానంటుంటాడు. గుమ్మడికాయకు వంద రూపాయలు చెబితే రెండు వందలు తీసుకో అంటుంటాడు. ఇలా ప్రతిదీ రివర్స్ లో బేరం ఆడుతుంటే గోడ చాటు నుంచి కనకం చూసి తల బాదుకుంటంది. షాపు అతను మాత్రం వీడెవడో తలతిక్క వెధవలా ఉన్నాడు అని మనసులో అనుకుని మీరు ధర్మప్రభువులు సార్ అంటూ రాజ్ ను పొగడ్తలతో పైకి ఎత్తుతాడు. రాజ్ కూరగాయలు తీసుకున్న తర్వాత ఆరు వందలు అయిన కూరగాయలకు ఆరు వేలు చెప్తాడు. దీంతో ఉండబట్టలేక గొడ చాటు నుంచి కనకం బయటకు వచ్చి షాపతన్ని తిడుతుంది. ఎంత మా అల్లుడు గారు ఖాళీగా ఉంటే మాత్రం అంత రేట్లు చెప్తావా? అంటూ నిలదీస్తుండటంతో రాజ్ మాత్రం కనకాన్ని గుర్రుగా చూస్తుంటాడు.
కనకం ఏం బాబు ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతుంది. దీంతో ఈ టాఫిక్ లోకి నేను ఖాళీగా ఉన్నానన్న టాఫిక్ ఎందుకు తీసుకొచ్చారు అంటూ కోపంగా తిడతాడు. దీంతో అది కాదు బాబు వీడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అని చెప్పడంతో ఆవునా మీరు చేసింది ఏంటి కాన్సర్ కనకం గారు. మీరు క్యాన్సర్ అని రాలిపోయే పువ్వు అని వాలిపోయే పొద్దు అని నన్ను మోసం చేయలేదా? అంటాడు. దీంతో కనకం ఏదో చెప్పబోతుంటే రాజ్ వినకుండా కూరగాయలు తీసుకుని వెళ్లిపోతాడు.
శృతి వచ్చి పాత క్లయింట్స్ ఎవరూ కూడా మీటింగ్ కు రావడం లేదు మేడం అని కావ్యకు చెప్తుంది. ఎందుకు రావడం లేదు అని అడుగుతుంది. దీంతో ఏమో మేడం అంటూ శృతి చెప్తుండగానే అనామిక, కావ్యకు ఫోన్ చేస్తుంది. పాత క్లయింట్స్ ఎవ్వరూ రావడం లేదా? కావ్య అని వెటకారంగా అడుగుతుంది. నువ్వు బావిలోంచి బయటకు రా కావ్య అంటూ చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.