Hyderabad to Visakhapatnam High-Speed Rail Corridor Project: ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్ మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైలు మార్గాన్ని హైదరాబాద్ నుంచి సూర్యాపేట, విజయవాడ మీదుగా విశాఖ వరకు అధికారులు ప్రతిపాదించారు. అటు విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్ కూడా ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది. ఈ లైన్ విశాఖపట్నం నుంచి ప్రారంభంమై సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మీదుగా కర్నూలు వరకు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ సర్వే చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సర్వే రిపోర్టును అధికారులు రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తొలి హైస్పీడ్ కారిడార్
తెలుగు రాష్ట్రాల్లో తొలి హైస్పీడ్ కారిడార్ గా హైదరాబాద్, విశాఖ రైల్వే కారిడార్ గుర్తింపు తెచ్చుకోనుంది. ఈ రైల్వే మార్గాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టుతో పాటు రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టును అనుసంధానించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే విమాన ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్-విశాఖపట్నం రైలు ప్రయాణానికి సుమారు 12 గంటల సమయం పడుతున్నది. వందేభారత్ 8.30 గంటల్లో వెళ్తున్నది. ఈ హైస్పీడ్ కారిడార్ లో గంటలకు 220 కి.మీ వేగంతో రైళ్లు ప్రయాణించేలా మార్గాన్ని రూపొందించనున్నారు. ఈ కారిడార్ పూర్తయితే, కేవలం 4 గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్-విజయవాడ 5వ జాతీయ రహదారికి దగ్గరగా..
హైదరాబాద్-విశాఖపట్నం హైస్పీడ్ కారిడార్, హైదరాబాద్, విజయవాడ 5వ జాతీయ రహదారికి దగ్గరగా నిర్మిస్తారు. తెలంగాణలోని రైలు మార్గం లేని పట్టణాలు, జిల్లాలను కలుపుతూ ఈ రైల్ కారిడార్ ను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నార్కెట్ పల్లి, సూర్యాపేట, కోదాడతో పాటు మహబూబ్ నగర్ లోని కల్వకుర్తి, వనపర్తి, నాగర్ కర్నూల్ కు రైల్వే మార్గం లేదు. ఈ ప్రాంతాలను కలుపుతూ హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్, విశాఖ హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదిత మార్గంలో మొత్తం ఎనిమిది రైల్వే స్టేషన్లను అధికారులు ప్రతిపాదించారు.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైల్వే ప్రయాణాలు.. లైఫ్ లో ఒక్కసారైనా ఈ జర్నీ చేయాల్సిందే!
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి రెండు రైలు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గం కాగా.. నల్లగొండ, గుంటూరు, విజయవాడ మరొకటి. ఈ రెండు మార్గాల్లో రైళ్లు గరిష్టంగా 110 నుంచి 130 కి. మీ వేగంతో ప్రయాణిస్తున్నాయి. వీటితో పోల్చితే హైస్పీడ్ కారిడార్ తో హైదరాబాద్, విశాఖపట్నం మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుత వందేభారత్ రైల్ తో పోల్చితే సగానికి పైగా ప్రయాణసమయం తగ్గే అవకాశం ఉంది.
Read Also: రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ.. భలే కంట్రోల్ చేశారే, హైదరాబాద్ ఆర్పీఎఫ్‌లకు నెటిజన్స్ సెల్యూట్