EPAPER

Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం.. ఆకట్టుకునేందుకు పార్టీల ప్రయత్నాలు

Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం.. ఆకట్టుకునేందుకు పార్టీల ప్రయత్నాలు
TS assembly election updates

TS assembly election updates(Political news in telangana):

తెలంగాణ ఎన్నికల సమరంలో ఈసారి యువ ఓటర్ల కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్నికల పోలింగ్‌కు ఇంకా కొన్ని రోజులే ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ యువ జపం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈసారి తెలంగాణలో యువ ఓటర్లు భారీ స్థాయిలో ఉండటంతో చాలా నియోవజర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను యువతే డిసైడ్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో యువతను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. యువతే లక్ష్యంగా తమ అస్త్రాలకు పదునుపెడుతూ గాలం వేస్తున్నాయి.


యువ ఓటర్లపైనే దృష్టి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం పార్టీల అభ్యర్థులతో పాటు ఓటర్లు కూడా సిద్ధం అవుతున్నారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్టార్ క్యాంపైనర్లు, ఇతర ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే, ఈ సారి ఎక్కువ దృష్టి రాష్ట్రంలోని యువ ఓటర్లపైనే ఉంది. ఎందుకంటే, రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమరంలో యువ ఓటర్లు ఎప్పుడూ కీలక పాత్రనే పోషిస్తుంటారు. ప్రశ్నించే గుణం, స్పందించే తత్వం కలిగిన యువత సహజంగానే ఎన్నికల సయంలో కూడా అత్యధికంగా ప్రభావితమవుతారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ చర్చలు మొదలుకొని.. పార్టీల తరఫున ప్రచారం చేయడం, సాంకేతిక సహకారం అందించటం.. వంటి వ్యవహారాల్లో తమవంతుగా యువత ఉత్సాహంగా పాలుపంచుకుంటారు. కాలేజీ విద్యార్థుల నుండి ఉద్యోగాలు, వ్యవసాయం చేస్తున్న యువతీ యువకులు వరకూ ఎన్నికల సమయంలో నియమావళి నుంచి నిబంధనల అతిక్రమణలపై ఎక్కువగా స్పందిస్తుంటారు. ప్రతి అంశంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడాలేకుండా ఎన్నికల వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు. ముఖ్యంగా, సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల్లో వీరి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఓటు నమోదు నుండి ఓటరుకు చైతన్యం కలిగించడంలో, ఓటు వేయటం, వేయించడంలో వ్యక్తిగతంగా, గ్రూపులుగానూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పనిచేస్తుంటారు. అందుకే.. ఈ ఎన్నికల్లోనూ పార్టీలు అధికారంలోకి రావడంలో యువ ఓటర్లే కీలకంగా మారారు.


నేతల పాట్లు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్లలో సగం మంది యువతే కావడంతో వారిని ఆకర్షించడానికి నేతలంతా పాట్లు పడుతున్నారు. యవతను ఆకట్టుకునే కార్యక్రమాల రూపకల్పన, ఎన్నికల మ్యానిఫెస్టోలతో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో కీలకంగా మారనున్న కొత్త ఓటర్లు తెలంగాణలో 9 లక్షల 99 వేల 667 మంది ఉండగా ఈ ఓట్లు గెలుపులో కీలకంగా మారనున్నాయి. తెలంగాణలోని మెుత్తం ఓటర్ల సంఖ్య 3.14 కోట్లు కాగా.. వారిలో 35 ఏళ్లలోపు ఓటర్లు 30 శాతం మంది ఉన్నట్లు తేలింది. ఇక.. తెలంగాణలోని 12 నియోజకవర్గాల్లో 12 లక్షలకు పైగా కొత్త ఓటర్లు.. 21 నియోజకవర్గాల్లో 10 లక్షలకు పైగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. అయితే.. హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనే అత్యధికంగా కొత్త ఓటర్లు మేడ్చల్‌ నియోజకవర్గంలో నమోదయ్యారు. ఇక్కడ అత్యధికంగా 17 వేల 12 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. కాగా, మేడ్చల్ నుంచి బరిలో మంత్రి మల్లారెడ్డి ఉండగా యువ ఓటర్లను ఆకర్షించడానికి మల్లారెడ్డి నానా తంటాలు పడుతున్నారు. ఇక, కుత్బుల్లాపూర్‌లో 15 వేల 117 మంది కొత్త ఓటర్లు.. రాజేంద్రనగర్‌లో 14 వేల 94 మంది కొత్త ఓటర్లు.. మహేశ్వరంలో 14 వేల 39 మంది కొత్త ఓటర్లు.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో అత్యల్పంగా 2 వేల 171 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు.

7 లక్షలమంది కొత్త ఓటర్లు

యాదృచ్ఛికంగా, 2018 ఎన్నికల సమయంలో కూడా 18-19 ఏళ్ల గ్రూపులో 7 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటరు జాబితాలో చేరారు. అయితే, రెండో సారి అధికారమిస్తే కొలువులు ఇస్తామని చెప్పి అధికారి బీఆర్ఎస్ పగ్గం చేపట్టింది. కానీ, గత కొంత కాలంగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు తీవ్రమైన ఆందోళనలు చేశారు. ఉద్యోగాల కల్పన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు టీఎస్‌పిఎస్సీ పేపర్ లీకేజ్ వంటి అంశాలు అధికార బీఆర్ఎస్‌కు ఈసారి యువ ఓటర్లను దూరం చేస్తాయనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం యూత్ ఎందుకు ఓటు వేయాలి అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. ఈ సారి మిస్ అయితే మళ్లీ ఐదేళ్ల దాకా ఛాన్స్ ఉండదు గనుక యువతకు ఉద్యోగాలు ఇచ్చేవారికే ఓటెయ్యాలనే అభిప్రాయం బాగా పెరిగినట్లు కనిపిస్తుంది. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలోని ఖానాపూర్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణను అధికారంలోకి తీసుకొని వస్తే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చారు. కేసీఆర్‌ పాలనలో నిరుద్యోగులకు ఏనాడూ న్యాయం జరగలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా వారికి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాజస్థాన్ తరహాలో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రియాంగా గాంధీ వెల్లడించారు.

పలు విధాలుగా యువతను ఆకట్టుకునేలా రాజకీయ పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ ఉద్యోగాల కల్పన, ప్రైవేటు పరిశ్రల్లో ఉపాధి, కార్పొరేట్‌ ప్రోత్సాహకాలు, సబ్సిడీ రుణాలు వంటి వాటిపై ఫోకస్‌ పెట్టింది. ఇక, ప్రతిపక్ష కాంగ్రెస్‌ “యూత్‌ డిక్లరేషన్‌”తో ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువ ఓటర్లను ఆకర్షిస్తోంది. కాగా బీజేపీ సైతం యువత కోసం విభిన్న కార్యక్రమాలను ప్రచారం చేస్తోంది. వారిని ఆకర్శించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. వారిని ప్రభావితం చేసేందుకు యువ నాయకులను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన కొందరు నేతలు.. ఎక్కువగా యువకులను కలుస్తూ తమ అభ్యర్థిని ఆదరించాలని కోరుతున్నారు. అన్ని పార్టీలు ప్రధానంగా ఉద్యోగాలపై ప్రచారం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతుండగా.. ప్రతిపక్షాలు తమ ఎన్నికల అస్ర్తాలుగా టీఎస్‌పీఎస్సీ వైఫల్యం మొదలైన అంశాలను ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే “యూత్‌ డిక్లరేషన్‌” ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. తమ ప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రచారం చేస్తోంది.

రాజకీయాలపై విభిన్న అభిప్రాయం

ఇక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేది యువతే అన్న మాట వాస్తవం. వారు ఎవరివైపు మొగ్గు చూపితే వారికే విజయం దక్కుతుందనేది గతంలో ఎన్నో సార్లు రుజువయ్యింది. అయితే, సమకాలీన రాజకీయాల్లో యువతకు, మధ్య వయసువారికి, వయోవృద్ధులకు మధ్య ఉండే అవగాహన, రాజకీయ పరిణామాలపై విశ్లేషణ భిన్నంగా ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవడంలో వారి భావోద్వేగాలు, ప్రలోభాలకు లోనయ్యే స్థాయిలు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా యువతలో ప్రశ్నించేతత్వం, ఉడుకు రక్తం, సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకునే స్థాయి కూడా విభిన్నంగా ఉంటుంది. ఏదీ ఎలా ఉన్నా యువత ఓటు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమనేది నిజం. అందుకే, మంచి నాయకుడిని.. మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే బాధ్యత యువ ఓటర్లదే అంటూ రాజకీయ విశ్లేషకులు ఎన్నికల వేళలో అవగాహన కల్పిస్తుంటారు. ఓ వైపు నిరుద్యోగం.. విద్యావ్యవస్థ భ్రస్టు పట్టడం.. దోపిడీ.. అవినీతి.. అక్రమాలు.. అన్నింటికీ చెక్‌ చెప్పగలిగేది ఓటు మాత్రమే అనీ.. ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కోల్పోయినట్లే అని స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తుంటాయి. కాగా, క్రికెట్ టీమ్‌లో షమిలాంటి వాడిని వరల్డ్‌ కప్‌ మొదటి నాలుగు మ్యాచ్‌లకు పక్కన పెట్టినందుకు అల్లాడిపోయాం.. టీమ్‌లోకి తీసుకోవాలని పట్టుబట్టాం.. మరి మంచి లీడర్‌కు ఓటేయకుండా మనం పక్కన పెట్టడం కరెక్టేనా.. అంటూ ప్రస్తుతం నిపుణులు యువతకు మార్గనిర్ధేశం చేస్తున్నారు. నిజాయితీగా మనం ఓటేయకపోతే.. మేనేజ్ చేసుకోగలిగిన వాడే గెలుస్తాడు.. అలా మేనేజ్ చేసుకోగలిగేవాడికి పగ్గాలు ఇచ్చేద్దామా.. అంటూ యువత సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.

అయితే, సాధారణంగా యువత ఎన్నికల ఓటింగ్‌పై ఎంత శ్రద్ధగా ఉంటుంది అనేదానిపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త ఓటర్లు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపరనే అభిప్రాయం లేకపోలేదు. ఆయా నియోజకవర్గాల పరిధిలో వృద్ధులు, దివ్యాంగులు వరుసలో గంటల తరబడి నిరీక్షించి ఓటు హక్కును వినియోగించడానికి ఆసక్తిని చూపిస్తే.. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేసేందుకు కొంతమంది యువకులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం విస్మయం కలిగిస్తోంది. నిజానికి, ప్రజల ఓటు అనేది ఐదేళ్ల పాలనపై ఇచ్చే పెద్ద తీర్పు. అంటే, మరో ఐదేళ్లకు మనం తెచ్చుకునే మార్పు. ఇలాంటి అవకాశం పోతే ..మళ్లీ ఐదేళ్ల దాకా ఆగాల్సిందే అన్నది వాస్తవం. బిర్యానీ తినాలంటే మంచి హోటల్‌నే ఎంచుకుంటాము. టీ, కాఫీ, కూల్‌డ్రింక్ ఏదైనా సెలెక్ట్‌ చేసుకుని నచ్చిందే తాగుతాము. నచ్చినదాని కోసం అవసరమైతే ఎంత దూరమైన వెళ్లి తెచ్చుకుంటాము. ఎంత టైమ్ అయినా పెడతాము. మరి.. మనల్ని పాలించేవారిని ఎంచుకోవడంలో మాత్రం బద్ధకం ఎందుకనే ప్రశ్న మేథావులు ఎప్పుడూ అడిగేదే.. ఐదేళ్ల పాలన కోసం.. అరగంట పోలింగ్ బూత్ దగ్గర వెయిట్ చేయలేమా..? ప్రభుత్వం సెలవు ఇచ్చింది వెళ్లి ఓటేయమనే కానీ ఇంట్లో కూర్చోమని కాదుగా అంటూ మేథావి వర్గం సూటిగానే ప్రశ్నిస్తుంది. అందుకే, యువత తమ ఓటుకున్న పవర్‌ను తెలుసుకోవాలని… ఓటును వినియోగించుకొని “దేశానికి యువత పట్టుగొమ్మలనే” మాటను నిజం చేయాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. తర్వాతి రోజు ఎగ్జామ్ ఉందన్న టెన్షన్ మానేయాలనీ.. ఒక్క అరగంట మన కోసం, మన భవిష్యత్తు కోసం పోలింగ్ బూత్ వద్ద సమయాన్ని వెచ్చిద్దాం అని సూచిస్తున్నారు. మన జీవితంలో చేయగలిన అత్యంత మంచి పనుల్లో ఓటు వినియోగించుకోవడం చాలా గొప్ప పని అని.. దీన్ని యువత గుర్తించాలని మేథావి వర్గం కోరుకుంటుంది.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×