EPAPER

Scam: ఊరంతా కబ్జా..! రూ.170000000000 స్కాం

Scam: ఊరంతా కబ్జా..! రూ.170000000000 స్కాం

నిలదీస్తే అక్రమ కేసులు


– కొండకల్ తండాలో బరితెగించిన అపర్ణ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్
– పీటీ భూములపై కన్నేసిన అపర్ణ కంపెనీ ఓనర్, గ్రామ పెద్ద విక్రమ్ రెడ్డి
– 1980లో ఎకరం చొప్పున కొనుగోలు చేసిన గిరిజన రైతులు
– పేపర్ల మీదనే జరిగిన క్రయ విక్రయాలు
– ధరణి తర్వాత దర్జాగా రైతుల భూముల్ని అపర్ణకి అప్పగించిన విక్రమ్ రెడ్డి
– రైతుల భూములే కాదు, ఊరంతా కబ్జాకు స్కెచ్
– ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు
– చెరువు భూమిని సైతం వదలని అక్రమార్కులు
– హైడ్రా చర్యలు తీసుకోవాలని వినతులు
– ఆపరేషన్ కొండకల్ పార్ట్ 1

దేవేందర్‌ రెడ్డి చింతకుంట్ల, 9848070809


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: ధరణి వచ్చాక సమస్యల పరిష్కారం దేవుడెరుగు, కొత్తవి పుట్టుకొచ్చి చాలామంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ న్యాయం జరగక ఆవేదన చెందుతున్నారు. అలాంటి వారిలో రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ తండా వాసులు కూడా ఒకరు. ఎప్పుడో 1980లో పేపర్ల మీదనే జరిగిన క్రయ విక్రయాల భూమిని సాగు చేసుకుంటున్న వారిని అపర్ణ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ భూతం పట్టుకుంది. దీని నిర్వాహకుడు, గ్రామ పెద్ద విక్రమ్ రెడ్డి బరితెగింపుతో తండా వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. చివరకు పోలీస్ కేసులను ఎదుర్కొంటున్నారు. అసలీ గొడవేంటని ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ చేయగా, సంచలన నిజాలు వెలుగుచూశాయి. ఊరు ఊరంతా కబ్జాకు స్కెచ్ గీసినట్టు తేలింది. లిటిగేషన్ భూముల్ని చెరబడుతూ దాదాపు రూ.17వేల కోట్ల స్కాం‌కు తెరతీశారు.

అసలీ వివాదం ఏంటి?

కొండకల్ గ్రామ పంచాయతీ పెద్ద విక్రమ్ రెడ్డి నుంచి గిరిజన రైతులు 300 రూపాయలకు ఎకరం చొప్పున 1980 కాలంలో 80 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడా భూమి వారసత్వంగా వచ్చిన అక్కడి గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే కేవలం కాగితాల మీదనే అమ్మకాలు జరిగాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేవు. ఇదే అదునుగా భావించిన విక్రమ్ రెడ్డి, తనకు చెందిన అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా కథంతా నడిపించాడు. వేరే చోట భూములు ఇప్పిస్తానని నమ్మబలికి రైతుల్ని నిండా ముంచాడు. రికార్డులు లేవనే సాకుతో పొజిషనల్‌లో ఉన్న వారిని బెదిరిస్తున్నాడు. కాదు కూడదంటే గూండాలతో దాడులు చేయిస్తున్నాడు. ఊరికి దొర అని నమ్మితే తమను నట్టేట ముంచాడని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు బాధితులు.

పీటీ భూములపైనా కన్ను

కొండకల్ తండాలోని సర్వే నెంబర్లు 352, 362, 363, 364, 377లో ఉన్న భూములు అన్నీ కూడా రక్షిత కౌలుదారు(పీటీ) భూములు. వాటికి కూడా దొంగ పత్రాలు సృష్టించి విక్రమ్ రెడ్డి, అపర్ణ వాళ్లకు అమ్మేశాడని చెబుతున్నారు స్థానికులు. సర్వే నెంబర్‌ 363లో టక్రియా వారసులకు అసైన్‌ మెంట్‌ పట్టా 6 ఎకరాలకు ప్రభుత్వం ఇచ్చింది. కానీ, తమ అసైన్‌ మెంట్‌ భూమిపై కూడా విక్రమ్ రెడ్డి దొంగ పత్రాలు సృష్టించి భూములను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. సర్వే నెంబర్‌ 363 లో 11 ఎకరాలు, సర్వే నెంబర్‌ 377లో 3 ఎకరాల 25 గుంటల భూమి మిగులు భూమిగా విక్రమ్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి ప్రకటించారు. కానీ, ఆ భూమిపై ఇప్పుడు దొంగ పత్రాలు తయారు చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని అంటున్నారు.

Also Read: HYDRA: శభాష్ సీఎం.. తన కుటుంబ సభ్యుల ఇంటిని కూడా రేవంత్ కూల్చేయమన్నారు: వీహెచ్

బెదిరింపులు.. దాడులు.. కేసులు

అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఏకంగా 800 ఎకరాలను కబ్జా పెట్టింది. ఇందులో అసైన్డ్ భూములతో పాటు శ్మశానవాటిక స్థలం, చెరువును కూడా కబ్జా చేసిందని తండావాసులు ఆరోపణలు చేస్తున్నారు. గిరిజన రైతుల భూములు కబ్జా చేయడమే కాకుండా పెద్ద పెద్ద గోడలు నిర్మించారు. కబ్జా చేసిన భూముల వద్దకు స్థానికులు వెళ్లకుండా అడ్డుగా ఆల్‌ మోస్ట్‌ వందల ఎకరాల చుట్టూ ప్రహారీ నిర్మించారు. తమ తండా భూములను అపర్ణ కన్‌‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని విక్రమ్ రెడ్డి చాలా వరకు ఆక్రమించాడని వాపోతున్నారు స్థానికులు. భూములను బలవంతంగా ఆక్రమించుకోవడం, బెదిరించడం, అతి తక్కువ ధర చెల్లించడం, రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడం, అధికారులతో కుమ్మక్కు కావడం, పోలీసులతో భయపెట్టించడం, తప్పుడు కేసులు బనాయించడం వంటివి చేశారని వాపోతున్నారు. అంతేకాదు, రౌడీలను, బౌన్సర్లను తీసుకొచ్చి మహిళలపైన కూడా దాడులు చేయించారని చెబుతున్నారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూముల్లోకి వచ్చి తమపైనే రౌడీయిజం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్లకే సపోర్ట్‌‌గా ఉన్నారంటున్నారు.

కొండకల్ తండా వాసులపై పెట్టిన కేసులు
కొండకల్ తండా రైతులపై శంకర్‌ పల్లి, మోకిల పోలీస్‌ స్టేషన్లలో 8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి.

1. ఎఫ్ఐఆర్ నెం. 149/2019 (సీసీ 714/2021). 8 మందిపై కేసులు
2. ఎఫ్ఐఆర్ నెం. 318/2019 (సీసీ 150/2021). ఆరుగురిపై కేసులు
3. ఎఫ్ఐఆర్ నెం. 160/2019 (సీసీ 1159/2021). ఒకరిపై కేసులు
4. ఎఫ్ఐఆర్ నెం. 583/2019 (సీసీ 968/2021). ఇద్దరిపై కేసులు
5. ఎఫ్ఐఆర్ నెం. 142/2023 (సీసీ 232/2023). నలుగురిపై కేసులు
6. ఎఫ్ఐఆర్ నెం. 149/2024. 13 మందిపై కేసులు
7. ఎఫ్ఐఆర్ నెం. 165/2024. 22 మందిపై కేసులు
8. ఎఫ్ఐఆర్ నెం. 253/2024. 22 మందిపై కేసులు

Also Read: CM Chandrababu react: ముంబై నటి వ్యవహారం.. సీఎం చంద్రబాబు రియాక్ట్, అదొక వై‘కామ’ పార్టీ అంటూ..

కొండకల్ తండా వాసుల వినతులు

1. మిర్సాంబ్‌ కుంట, వల్లభస్వామి కుంట, గిరిజనుల అసైన్డ్‌ భూములను కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా వెంటనే కూల్చివేయాలి
2. మాపై అపర్ణ కంపెనీ సాగిస్తున్న అరాచకాలు, అకృత్యాలపై చర్యలు తీసుకొవాలి
3. కొండకల్ తండాలోని చెరువులు, కుంటలు కబ్జా చేసి అనుమతి లేకుండా నిర్మించిన ప్రహరీ గోడలను హైడ్రా వెంటనే కూల్చివేయాలి
4. అపర్ణ కంపెనీ దాడుల నుండి తమకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి
5. ఎఫ్ఐఆర్ నెం. 154/2024 447, 427, 324, 506, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, 3(1)(ఆర్)(ఎస్), 3(2)(వీఏ) ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్ కేసులో నిందితులుగా ఉన్న అపర్ణ కంపెనీ విక్రమ్‌ రెడ్డి, లచ్చిరెడ్డి, ఉదయ్‌ కిరణ్‌ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, సురేష్‌, ఉదయ్‌ కుమార్‌‌లను వెంటనే అరెస్టు చేయాలి
6. మాపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

ఊరు ఊరంతా కబ్జా చేసి 800 ఎకరాల చుట్టూ 20 అడుగుల ఎత్తులో గోడ. అది చాలదన్నట్టు, చెరువు చుట్టూ నీళ్లు రాకుండా గోడ. తండావాసులు బయటకు రాకుండా ఊరి చుట్టూ 5 అడుగుల గోడ కడుతూ బరితెగించారు. కొండకల్ గ్రామాన్ని కబ్జా చేసి లిటిగేషన్ భూముల్ని కాజేసే కుట్రలో పాత్రధారులు ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, సీవీ రెడ్డిని నడిపిస్తున్నది ఎవరు? సూత్రధారి విక్రమ్ రెడ్డి దొర కాగా, తెర వెనుక ఉన్న బడా లీడర్లు ఎవరు? 17వేల కోట్ల రూపాయల స్కాం స్కెచ్‌‌లో ఎవరెవరికి ఎంత ముడుతుంది. పక్కా ఆధారాలతో తర్వాతి కథనంలో చూద్దాం.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×