Chit Fund Company Fraud :
⦿ చీటింగ్ చిట్ ఫండ్స్ బాధితుల ఆవేదన
⦿ చిట్టీ డబ్బుల కోసం ఆందోళన
⦿ అజ్ఞాతంలో మేనేజ్మెంట్.. రోడ్డునపడ్డ కస్టమర్స్
⦿ గుట్టు చప్పుడుగా ఒక్కో బ్రాంచ్ మూసివేత
⦿ సెంట్రల్ కంప్లైట్ సెల్‌కు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు
⦿ పోలీసుల తీరుపై అనుమానాలు
⦿ అక్షర చిట్ ఫండ్ మోసంతో నిండా మునిగిన బాధితులు
సతీష్ పబ్బు, స్వేచ్ఛ వరంగల్ ఇన్వెస్టిగేషన్ టీం
వరంగల్, స్వేచ్ఛ: మీ భవిష్యత్‌కు భరోసా.. మీ ఆర్థిక ఎదుగుదలకు చేయూత అంటూ వరంగల్, హన్మకొండలోని పలు చిట్ ఫండ్ సంస్థలు కస్టమర్లను నిండా ముంచేస్తున్నాయి. చిట్టీ డబ్బులు రాక సంవత్సరాల తరబడి కంపెనీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. అనుకున్న సమయానికి డబ్బులు అందక, ఆర్థిక ఇబ్బందులు తీరక కస్టమర్లు పడే బాధ వర్ణనాతీతం. కస్టమర్ల వద్ద డబ్బులు వసూలు చేసిన చిట్ ఫండ్ సంస్థలు బోర్డు తిప్పేశాయి. ఓనర్లు ముఖం చాటేశారు. దీంతో ఆందోళన బాట పడుతున్నారు బాధితులు.
రౌడీలతో బకాయిల వసూళ్లు
వరంగల్ కేంద్రంగా వెలిసిన మెజారిటీ చిట్ ఫండ్ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా బిజినెస్ చేస్తున్నాయి. జిల్లాల్లో బ్రాంచీలు పెట్టి మేనేజర్లు, ఏజెంట్లను నియమించి రూ.వందల కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించాయి. చిట్టీ తీసుకున్నోళ్లు, గడువు ముగిసినోళ్లు డబ్బుల కోసం బ్రాంచీల దగ్గరకు వెళ్తే నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం సహా దాదాపు 25 జిల్లాల నుంచి వరంగల్‌లోని చిట్ ఫండ్స్ హెడ్ ఆఫీసుల చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. వారికి రావాల్సిన బకాయిలను రౌడీలను పెట్టి మరీ వసూలు చేసుకుంటున్న చిట్ ఫండ్ సంస్థల యాజమాన్యాలు, కాలపరిమితి అయిపోయాక వారు ఇవ్వాల్సిన డబ్బులు అడిగితే అదే రౌడీలతో బెదిరిస్తున్నారని బాధితులు అంటున్నారు. ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా చిట్ ఫండ్ సంస్థలు కొన్ని బ్రాంచీలను మూసేస్తున్నాయి. పూర్తిగా మూసివేస్తే బాధితులు ఇండ్ల మీదకు వస్తారనే భయంతో నామమాత్రంగా ఆఫీసులు నిర్వహిస్తున్నారు. అక్కడ సమాచారం ఇచ్చేవారు, సమాధానం చెప్పేవారు ఉండరు.
జనం సొమ్ముతో రియల్ ఎస్టేట్ దందా
చిట్టీల రూపంలో దర్జాగా జనం నుంచి డబ్బులు వసూలు చేసిన సంస్థలు రియల్ ఎస్టేట్ దందా సాగిస్తున్నాయి. కస్టమర్లకు డబ్బులివ్వకుండా బ్యాంకర్లతో జత కలిసి పోస్ట్ డేటెడ్ చెక్కులిస్తున్నారు. ఇలా కాలం వెళ్ళబుచ్చుతూ ఏడాదిన్నర కాలంగా తిప్పుకుంటున్నారు. తర్వాత వివరాలు రాసుకుంటామంటూ చిట్ హోల్డర్లతో ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకుంటున్నారు. సంస్థ చేస్తున్న మోసాలపై బాధితులు పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇస్తే తెలియక చేసిన సంతకాలను చూపిస్తూ కేసులు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కొంతమంది పోలీసులు చిట్ ఫండ్స్ సంస్థల యజమానులతో కుమ్మక్కై వారికి అనుగుణంగానే సెటిల్మెంట్స్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కమిషనరేట్‌లో చేసిన ఫిర్యాదును సెంట్రల్ కంప్లైట్ సెల్‌కు ఫార్వార్డ్ చేస్తున్నారు. డబ్బుల కోసం తిరిగి తిరిగి విసుగు వచ్చిన కస్టమర్లకు విలువలేని ప్లాట్లను అంటగట్టి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని చిట్ ఫండ్ వ్యాపారుల మోసాలపై దృష్టి పెట్టి తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
రౌడీలతో దాడి చేయిస్తున్నారు
నా భార్య నేను ఇద్దరం కలిసి అక్షర చిట్ ఫండ్స్‌లో రూ.25 లక్షల చిట్టీ వేశాం. కాలపరిమితి అయిపోయాక వాళ్ళ దగ్గరే డిపాజిట్ చేయమన్నారు. నమ్మి డిపాజిట్ చేస్తే మూడేళ్లు గడిచినా డబ్బులు ఇవ్వడం లేదు. డబ్బుల కోసం వస్తే రౌడీలతో మాపైనే దాడి చేయించారు.
రమేష్, బాధితుడు, ఏలూరు
డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు
పిల్లల పెళ్లిళ్ల కోసం పైసా పైసా కూడబెట్టి చిట్టీ వేస్తే మా డబ్బులు మాకివ్వకుండా వేధిస్తున్నారు. రిటైర్మెంట్ పెన్షన్ డబ్బులతో చిట్టీ వేస్తే డబ్బులివ్వకుండా ఆఫీసు చుట్టూ తిప్పిస్తున్నారు. డబ్బులు అడుగుదామని ఆఫీసుకు వస్తే ఎవరూ ఉండడం లేదు. నా డబ్బులు రాకుంటే నా పిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలి.
సుబ్రమణ్యం, బాధితుడు
సొంతింటి కల నీరుగారిపోయింది
మా ఫ్రెండ్ మాటలు నమ్మి ఇల్లు కట్టుకుందామనుకున్న డబ్బులతో అక్షర చిట్ ఫండ్‌లో చిట్టీ వేశాను. కాలపరిమితి అయిపోయి 4 సంవత్సరాలు అయింది. కానీ, డబ్బులు ఇవ్వడం లేదు. అడిగితే ఇవాళ, రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
చిట్ ఫండ్ బాధితుడు, వరంగల్
నన్ను నమ్మి చిట్టీ వేశారు.. పరువు పోతోంది
నేను కరీంనగర్ బ్రాంచిలో రూ.25 లక్షల చిట్టీ వేశాను. నన్ను నమ్మి ఇంకా కొంతమంది డబ్బులు కట్టారు. ఇప్పుడు చిట్ ఫండ్ వారు నా డబ్బులు, వాళ్ళ డబ్బులు ఇవ్వడం లేదు. నన్ను నమ్మిన వారు డబ్బుల కోసం మా ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
సుదర్శన్ రెడ్డి, కరీంనగర్ బాధితుడు
దిక్కున్నచోట చెప్పుకో అని బెదిరిస్తున్నారు
కరీంనగర్ రాజీవ్ చౌక్ బ్రాంచ్‌లో రూ.5 లక్షల చిట్టీ వేశా. 16 నెలలు గడిచాక ఈ బ్రాంచ్ మూసేస్తున్నాం. మీ డబ్బులు సంవత్సరం తర్వాత ఇస్తామన్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయినా నా డబ్బులు ఇవ్వలేదు. అడిగితే మీ దిక్కున్నచోట చెప్పుకోండంటూ బెదిరిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నా మమ్మల్ని పట్టించుకునే వారే లేరు.
చిట్ ఫండ్ బాధితుడు
నా కూతురు పెళ్లి ఎలా చేయాలి
మాది గూడూరు. నా కూతురి పెళ్లి కోసం రూ.11 లక్షల చిట్టీ వేశాను. కాల పరిమితి అయిపోయిన సంవత్సరం నుండి డబ్బుల కోసం తిరుగుతున్నా, ఇప్పుడు నేను పెళ్లి ఎలా చేయాలి. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి.
చిట్ ఫండ్ బాధితురాలు
క్రమం తప్పకుండా పైసలు కట్టి పిచ్చోళ్ళలా తిరుగుతున్నాం
మాది రామగుండం. అక్షర చిట్ ఫండ్‌లో రూ.10 లక్షలు కట్టాను. ప్రతి నెలా క్రమం తప్పకుండా డబ్బులు చెల్లించాను. గడువు తీరాక వాళ్ళ దగ్గరే డిపాజిట్ చేశా. ఇప్పుడు డబ్బుల కోసం వస్తే వాళ్ళ దగ్గరి నుండి ఎలాంటి సమాధానం లేదు. ఆఫీస్ చుట్టూ పిచ్చివాళ్ళలా తిరగాల్సి వస్తుంది.
చిట్ ఫండ్ బాధితుడు, రామగుండం