V Hanumantha Rao: ఒక లక్షలోపు పంట రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే, కొందరు రైతులు తమ రుణాలు మాఫీ కాలేదని మీడియా ముందుకు రావడం చర్చనీయాంశమైంది. తమకు అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, టీపీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ కాంగ్రెస్ పార్టీదని, అందుకే తాము ఇచ్చిన హామీకి అనుగుణంగానే రుణమాఫీ చేపడుతున్నామని వీహెచ్ తెలిపారు. మాట ఇచ్చామని, ఇప్పుడు చేసి చూపిస్తున్నామని వివరించారు. అయితే, కొందరికి రుణమాఫీ కాలేదన్న వాస్తవాన్ని ఆయన ధ్రువీకరించారు. వారు ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోకపోవడం వల్లే మాఫీ కాలేదని తెలిపారు.
రైతులందరికీ, అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని వీహెచ్ చెప్పారు. సిద్దిపేటలో ఆయన విలేకరులో మాట్లాడుతూ.. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ కూడా జరుగుతుందని, వచ్చే నెలలో ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుందని వివరించారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తామని చెప్పి ఆ తర్వాత దళిత సమాజాన్ని మోసం చేశారని ఆరోపించారు. కానీ, తాము భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంగా చేసి దళితుల ఆత్మగౌరవాన్ని పెంచామని వివరించారు.
Also Read: పూజా ఖేడ్కర్ ఐఏఎస్ అభ్యర్థిత్వం రద్దు.. మరో సారి పరీక్ష రాయకుండా డిబార్
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని వీహెచ్ అన్నారు. కానీ, తాము అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఉద్యోగాల భర్తీ మొదలు పెట్టామని వివరించారు. తమ హయాంలో పోటీ పరీక్షలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా జరుగుతున్నాయని, కానీ, కేసీఆర్ హయాంలో తరుచూ కోర్టుల చుట్టూ వ్యవహారాలు నడిచాయని గుర్తు చేశారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు ఆ పార్టీ పని ఖతమైందని వీహెచ్ అన్నారు. పార్టీలో తెలంగాణ తీసేసినప్పుడే పార్టీ పని అయిపోయిందని పేర్కొన్నారు. కేసీఆర్ పేరు కోసం అనేక ప్రాజెక్టులు కట్టాలని అనుకున్నారని, ఇప్పుడు ఆ ప్రాజెక్టులో భూమిలో కూరుకుపోతున్నాయని విమర్శించారు. ఆయన కట్టిన ప్రాజెక్టుల పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు.