EPAPER

Tiger: అదిగో పులి.. ఇదిగో వేట.. భయం భయం..

Tiger: అదిగో పులి.. ఇదిగో వేట.. భయం భయం..

Tiger: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను పులుల భయం వణికిస్తోంది. గడిచిన 15 రోజుల్లో అనేక సార్లు పశువులపై దాడి చేయడంతో పాటు… కుమ్రం భీం జిల్లాలో ఓ రైతును కూడా పొట్టనపెట్టుకున్నాయి. సరిహద్దుల్లో ఉన్న మూడు అభయారణ్యాల నుంచి దాదాపు 20 వరకు పులులు ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నాయని.. అటవీ అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో పులులు సంచరిస్తుండడంతో.. ఎజెన్సీ ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకు వెళ్లదీస్తున్నారు.


అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ లో పులుల సంచారం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. కవ్వాల్ అభయారణ్యం నుంచి గ్రామాలను తరలిస్తున్న క్రమంలో అక్కడ పులుల ఆవాసానికి అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్, చంద్రాపూర్ లోని తడోబా, ఇంద్రావతి అభయారణ్యాల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ అటవీ ప్రాంతాలకు పులుల మైగ్రేషన్ పెరిగి పోయింది.

మహారాష్ట్ర, తెలంగాణలోని మూడు అభయారణ్యాల్లో పులుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. దీంతో ఆవాసం కోసం వాటి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. సాధారణంగా ప్రతీ మగపులి తన చుట్టుపక్కల ఓ నిర్ణీత ప్రదేశాన్ని తన ఆవాసంగా ప్రకటించుకుంది. అందులోకి మిగతా మగపులులను రానీయదు. అందువల్ల మిగతా పులులు కూడా తమ కోసం ప్రత్యేకమైన ఆవాసాన్ని వెతుక్కునే పనిలో పడతాయి. పులులు ఆహారం ఈజీగా దొరికే ప్రాంతాలనే ఎక్కువగా ఆవాసాలుగా ఎంచుకుంటాయి. ఈ నేపథ్యంలోనే వాటికి కవ్వాల్‌ అభయారణ్యం డెస్టినేషన్ స్పాట్ గా మారుతోంది.


పులులు ఆవాసాలను ఎంచుకునే క్రమంలో 9 రోజుల నుంచి 45 రోజుల వరకు ప్రయాణాలు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే మధ్య మధ్యలో ఆకలి తీర్చుకోవడానికి పశువులపై మనుషులపై దాడులకు దిగుతాయి. ఈ విధంగా ఒక్క తడోబా అభయారణ్యంలోనే గడిచిన 6 నెలల కాలంలో 37 మందిని, వందలాది పశువులను పొట్టన బెట్టుకున్నాయి. ఒంటరి మనుషులనే టార్గెట్ చేయడం అక్కడి పులులకు అలవాటైన చర్యగా అక్కడి అధికారులు గుర్తించారు.

మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అభయారణ్యాల మధ్య పెన్ గంగ, ప్రాణహిత నది పరివాహక ప్రాంతం ఉంది. విస్తారమైన అటవీ ప్రాంతం కావడంతో తరచు పులులు వచ్చిపోతుంటాయి. ఈ మధ్య కాలంలో తడోబా అభయారణ్యంలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో… అవి అవాసాల కోసం తిప్పేశ్వర్, కవ్వాల్‌, ఇంద్రావతి అభయారణ్యాల వైపు పయనిస్తున్నాయి. ఈ మార్గంలో ఉన్న గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

ఈ మూడు రిజర్వ్‌ ఫారెస్టుల్లోనూ పులులు ముఖ్యంగా కవ్వాల్ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీనికి కారణం ఇక్కడ పెద్ద సంఖ్యలో అడవి జంతువులు, అనువైన వాతావరణం ఉండడమే. ఇటీవల జైనథ్ మండలంలోని హత్తి ఘాట్ ప్రాంతంలోని ఓ కెనాల్ లో రెండు పులులు సంచరించగా వాటిని యువ జంటగా అధికారులు గుర్తించారు.

ఈ రెండు తిప్పేశ్వర్ నుంచి వస్తూ పెన్ గంగా నది దాటి దాని పరివాహక ప్రాంతం గుండా భీంపూర్, జైనథ్, బేలా మీదుగా నార్నూర్ పరిసరాల గుండా కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశించాయి. తాజాగా మరో నాలుగు పులులు కూడా ఇదే ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ బాటసారుల కంటపడ్డాయి.

పులుల సంచారానికి మరో ముఖ్యమైన కారణం… తిప్పేశ్వర్ ప్రాంతంలో అడవి అంత దట్టంగా ఉండకపోవడం. అలాగే అక్కడ చాలా గ్రామాలున్నాయి. ఈ కారణంగానే తడోబా నుంచి అక్కడికి వచ్చిన పులులు అక్కడ ఎక్కువ కాలం నివసించలేకపోతున్నాయి. మరో ఆవాసాన్ని వెతుక్కుంటూ ఆదిలాబాద్ జిల్లాలోకి అడుగుపెడుతున్నాయి. గడిచిన పది రోజుల కాలంలో తలమడుగు, బోథ్, సారంగాపూర్ గుట్టల మీదుగా రెండు పులులు ప్రయాణించినట్టు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. అవి అటు నుంచి నిర్మల్‌ ఘాట్ మీదుగా జన్నారం, కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు.

కవ్వాల్ అభయారణ్యం నైసర్గిక స్వరూపం కూడా పులుల ఆవాసానికి అనువుగా మారుతోంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తలమడుగు, బోథ్ మండలాల్లోని గుట్టలు తప్ప ఇంకెక్కడా దట్టమైన అడవులు కనిపించవు. ఇక అటు భీంపూర్, తాంసి, జైనథ్, బేల మండలాలతో పాటు.. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, పెంచికల్ పేట, దహేగాం తదితర మండలాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువ. కాబట్టి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులులు ఆహారం కోసం పాడిపశువులు, మనుషులపై దాడులు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం పెంచికల్ పేట సమీపంలో విఘ్నేష్, నిర్మల అనే ఇద్దరిని A2 అనే పులి పొట్టన బెట్టుకుంది. తాజాగా వాంకిడి మండలం ఖానాపూర్‌లో సిడాం భీము అనే రైతును పులి చంపి అడవిలోకి లాక్కెళ్లింది.

పెద్దపులుల మైగ్రేషన్‌ సజావుగా సాగేందుకు అటవీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. అక్కడక్కడా తలెత్తే లోపాల కారణంగా.. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పులులు జతకట్టే కాలం. ఆ సమయంలో మగపులులు ఆడతోడు వెతుక్కుంటూ పయనం సాగిస్తుంటాయి. ఆ టైమ్ లో అవి చాలా ఆగ్రహంతో ఉంటాయని.. వాటికి ఎదురుపడ్డ వారికి హాని తలపెడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా.. పులులు తిరుగుతున్న ప్రాంత గ్రామాలను అప్రమత్తం చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే గర్భం దాల్చిన పులులు, పిల్లలతో ఉన్న పులులు కూడా.. సురక్షితమైన ఆవాసాలను వెతుక్కునేందుకు సుదీర్ఘ ప్రయాణాలు సాగిస్తుంటాయి.

దశాబ్దాలుగా ఉన్న ఈ పులుల సమస్య.. ఈ మధ్య వాటి సంఖ్య గణనీయంగా పెరగడంతో మరింత ఎక్కువైంది. పులులు సంచరించే మార్గాల్లో అడవుల పెంపకం… అభయారణ్యంలోని కోర్‌, బఫర్ ఏరియాల్లో పులుల ఆవాసానికి కావాల్సిన అన్ని వసతులు కల్పించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ముఖ్యంగా పులుల ఆహారమైన వన్యప్రాణులను సంరక్షించే చర్యలు చేపట్టాలని… అప్పుడే అవి మనుషులు, పాడి పశువుల వైపు రావని.. అటవీ నిపుణులు సలహా ఇస్తున్నారు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×