Big Stories

ED Raids : క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు.. రాజకీయ నేతలే టార్గెట్

ED Raids : చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో రాజకీయ నేతలకు ఉన్న సంబంధాలను తేల్చే పనిలో ఉంది. ఇప్పటికే కొందరు రాజకీయ నాయకులను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. మరికొందరు నేతలకు నోటీసులు ఇచ్చారు. ఇంకా ఎవరెవరికి ఈడీ నోటీసులు ఇస్తుందనే టెన్షన్ రాజకీయ నేతల్లో నెలకొంది.

- Advertisement -

తాజాగా అనంతపురానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి గుర్నాథరెడ్డి వచ్చారు. క్యాసినో వ్యవహారంలో ఆయన పాత్రపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.

- Advertisement -

హైదరాబాద్ లో బుధవారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్, ధర్మేంద్ర యాదవ్ లను ఈడీ విచారించింది. ఫోన్ కాంటాక్ట్స్, వాట్సాప్ చాటింగ్స్, ఫ్లైట్ టిక్కెట్స్, బ్యాంకు లావాదేవీల ఆధారంగా తలసాని సోదరులను 9 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో వారిని విచారించారు.

అప్పుడు టూర్ ఆపరేటర్లు
క్యాసినో వ్యవహారంలో తొలుత చీకోటి ప్రవీణ్ ను విచారించారు. అప్పుడు చీకోటి ప్రవీణ్‌ తోపాటు మాధవరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. క్యాసినో ముసుగులో విదేశాలకు నిధుల మళ్లిస్తున్నారన్న ఆరోపణలపై గతంలో చీకోటి ప్రవీణ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామందిని ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తీసుకెళ్లారని నిర్ధారించింది. పెద్దమొత్తంలో నిధులను హవాలామార్గంలో మళ్లించారని తేల్చింది. అనేకమంది టూర్‌ ఆపరేటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని విచారించింది.

ఇప్పుడు రాజకీయ నేతలు
మళ్లీ 3 నెలల తర్వాత ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరులు మహేష్‌ యాదవ్‌, ధర్మేంద్ర యాదవ్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. వీరితోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఉమ్మడి మెదక్‌ డీసీసీబీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ముగ్గురు మంత్రులతో చీకోటి ప్రవీణ్ కు ఆర్ధికలావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 18 మంది ప్రస్తుత , మాజీ ఎమ్మెల్యేలు, 280 రెగ్యులర్ కస్టమర్లు చీకోటి లిస్ట్ లో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఏపీ, తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలకు చీకోటి తో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించింది. హాంకాంగ్, ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్ , గోవాలో ప్లేయింగ్ కార్డ్స్, క్యాసినో క్లబ్స్ కోసం వారు పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు సేకరించింది. గోవా, నేపాల్ లో క్యాసినో లీగల్ కావడంతో అక్కడ క్యాసినో సెంటర్లు ఏర్పాటు చేసి బినామీపేర్లతో వాటిని నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News