BRS Leaders : తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కిందా? దీపావళికి మరో ఐదారు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. తెలంగాణలో నేతల అరెస్టులు జరుగుతాయనంటూ మంత్రి పొంగులేటి చెప్పడంతో వాతావరణం వేడిగా మారింది. ఇంతకీ ఎవరు అరెస్టు అవుతారంటూ మరోవైపు బీఆర్ఎస్‌లో జోరుగా చర్చ మొదలైపోయింది.
బీఆర్ఎస్ నేతల్లో అలజడి మొదలైంది. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాటిలో ఫోన్ ట్యాపింగ్, ధరణి, మరికొన్ని కేసులున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్నఎస్ఐబీ మాజీ ఓఎస్డి ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు పాస్ పోర్టులను రద్దు చేశారు.
అమెరికాలో తలదాచుకున్నారంటూ వీరిద్దరి పాస్ పోర్టులు రద్దు చేయాలని పాస్ పోర్ట్ ఆఫీస్‌కు లేఖ రాశారు తెలంగాణ పోలీసులు. పోలీసుల నివేదిక ఆధారంగా వీరిద్దరి పాస్ పోర్టు రద్దు చేశారు. ఇప్పటికే వీరిద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయిన విషయం తెల్సిందే.
గత సర్కార్‌లో కీలకంగా వ్యవహరించిన 1 నుంచి 5 గురు నేతలను అరెస్ట్ చేసే అవకాశ మున్నట్లు అంతర్గత సమాచారం. అయితే వారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేస్తారా? ధరణి వ్యవహారంలో అదుపులోకి తీసుకుంటారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: పాస్‌పోర్ట్‌లు రద్దు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
ఈ వ్యహారంలో బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ మొదలైంది. దీనిపై మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తుందంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంపై గతరాత్రి మాజీ మంత్రుల్లో చిన్నపాటి చర్చ జరిగిందట.
ఒకటి నుంచి ఐదుగురు నేతలు అరెస్ట్ అయితే మన పరిస్థితి ఏంటంటూ మాట్లాడు కోవడం కనిపించింది. ఏపీలో టీడీపీ మాదిరిగా పోరాటం చేద్దామని ఒకరన్నారట. అధికారమంతా వాళ్ల దగ్గర పెట్టుకుని సొంత నియోజకవర్గానికి నిధులు కేటాయించలేని పరిస్థితిలో మనం ఉన్నామని మరికొందరు గుర్తు చేశారట.
ఒకవేళ ముఖ్యనేతలు అరెస్టయితే ఏం చేద్దామనే ఆలోచనలో నేతలు పడ్డారట. దీనిపై రెండు రోజుల్లో కారు పార్టీ కీలక నేతలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది.