EPAPER

Telangana Congress : జనం మనసు గెలిచి.. జయపతాక ఎగరేసి..

Telangana Congress :  జనం మనసు గెలిచి.. జయపతాక ఎగరేసి..
Telangana Congress news

Telangana Congress news(Telugu breaking news today):

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముచ్చటగా మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో రసవత్తరంగా సాగిన పోటీలో కాంగ్రెస్ జయపతాక ఎగరవేసింది. రాష్ట్రంలో గులాబీ పార్టీకి తప్ప మరో పార్టీకి అవకాశమే లేదంటూ బీఆర్ఎస్ ఊదరగొట్టిన ప్రచారం కాంగ్రెస్ దూకుడు ముందు దూదిపింజలా ఎగిరిపోయింది. చివరి క్షణం వరకు నువ్వా నేనా అంటూ సాగిన ఎన్నికల రణరంగంలో జనం హస్తం గుర్తుకే జై కొట్టారు. మార్పు కావాలి… కాంగ్రెస్ రావాలి అనే వారి ప్రచారాన్ని నిజం చేసి చూపించారు. ఆరు గ్యారెంటీలతో బాటు.. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసి రావటంతో గులాబీ పార్టీ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.


నిజానికి తెలంగాణలో బీఆర్‌ఎస్‌పై నేటి ఎన్నికల ఫలితాల్లో వ్యక్తమైన వ్యతిరేకత రాత్రికి రాత్రి ఏర్పడినదేం కాదు. 2018 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన నెల రోజుల నుంచే ఇది మొదలయింది. 2018లో బీఆర్‌ఎస్‌ 46.9 శాతం ఓట్లతో 88 సీట్లను గెలుచుకుంది. ఇంత భారీ విజయం సాధించిన తర్వాత కూడా కేసీఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా తమ పార్టీలోకి తీసుకోవడం ప్రజలకు నచ్చలేదు.

అందుకే ఈ ఎన్నికల తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే వచ్చిన ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డిని గెలిపించారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 4 సీట్లు కట్టబెట్టటంతో బాటు నగరం నడిబొడ్డున ఉన్న మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి విజయం అందరినీ ఆశ్చర్యపరచినా.. గులాబీ పార్టీ మాత్రం మేలుకోలేదు. ఆ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా 19 శాతం ఓట్లు కోల్పోయింది.


అలాగే.. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కీలకనేత పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అతికష్టంగా తీన్మార్‌ మల్లన్నపై గెలిచారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు భంగపాటే ఎదురైంది. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో గెలిచినా ఓట్ల శాతం మాత్రం పెరగలేదు. వామపక్షాల సహకారంతో మునుగోడు ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలిచి అనంతరం వారిని దూరం పెట్టారు.

ఇలా ప్రతి ఎన్నికలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతున్నా కేసీఆర్‌ దిద్దుబాటుకు ప్రయత్నించకుండా తనకు ఎదురే లేదన్నట్టు వ్యవహరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో తమ ఎజెండా ఇంకా పూర్తి కాలేదని ‘గుడ్‌ టు గ్రేట్‌’ నినాదంతో బీఆర్‌ఎస్‌ ప్రచారం సాగించింది. మరోవైపు ఆశించినట్టుగా పీఆర్సీ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, సమ్మె చేసిన సమయంలో కేసీఆర్‌ చేసిన అవమానాన్ని మర్చిపోలేని ఆర్టీసీ కార్మికులు ‘ఇక చాలు… మార్పు కావాలి’ అని ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సైలెంట్‌ ప్రచారం మొదలుపెట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా, అతివిశ్వాసంతో రెండు నెలల ముందే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వటమూ జనానికి మింగుడుపడలేదు. ఈ నిర్ణయంలో ఆయన ఆత్మవిశ్వాసం కంటే.. ఒంటెత్తు పోకడ, నియంతృత్వ ధోరణినే జనం చూశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో సిట్టింగ్‌ కార్పొరేటర్లను తిరిగి పోటీ చేయించి ఓటమి పాలయినా… అదే సూత్రాన్ని ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేల విషయంలోనూ సీఎం కేసీఆర్ మళ్లీ అమలు చేయటంతో నిండా మునగాల్సి వచ్చింది.

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, దళిత బంధు, బీసీ బంధు పథకాలు గులాబీ నేతల అనుచరులకే చేరటం, కొత్త రేషన్ కార్డులు అందకపోవటం, పంటకు కనీస మద్దతు ధర లభించకపోవడం, పై స్థాయిలో కనిపించకుండా పెరిగిన అవినీతి.. జనాన్ని కాంగ్రెస్ వైపు చూసేలా చేశాయి. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని గతంలో చెప్పిన కేసీఆర్‌ మాట తప్పడమే కాకుండా, టీఎస్పీఎస్సీ కుంభకోణంతో 35 ఏళ్లలోపు ఉన్న 90 లక్షల యువ ఓటర్లు కాంగ్రెస్‌కు జైకొట్టారు. రైతుబంధు ఓకే గానీ, రైతు రుణమాఫీ జరగలేదనే అసంతృప్తితో ఉన్న రైతాంగం రెండు లక్షల రుణమాఫీ అన్న కాంగ్రెస్ చెంత చేరేలా చేశాయి.

ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని కొత్తగా వచ్చిన ‘బీటీ’(బంగారు తెలంగాణ) టీమ్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరగటం, ఉద్యమకారుల గుండె మండేలా చేసింది. దీంతో మేధావులు, ఉద్యమకారులు, విద్యావంతులు గులాబీ పార్టీ నుంచి దూరం జరిగిపోయారు.

కాంగ్రెస్‌లోని నేతలను చేర్చుకొని ఆ పార్టీని బలహీనపర్చవచ్చని బీఆర్‌ఎస్‌ భావించింది. కానీ, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ కేడర్‌ గురించి బీఆర్‌ఎస్ తక్కువ అంచనా వేసింది. మునుగోడులో విజయానికి బీఆర్‌ఎస్‌కు సాయపడిన కమ్యూనిస్టులను కలవటానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్ వైఖరి, తెలుగుదేశంలో పనిచేసిన నేతగా రేవంత్ తన పాత సహచరులందరినీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించటం, ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి విరమించుకోవటమూ కాంగ్రెస్ పార్టీకి మేలు చేశాయి.

సీఎం కేసీఆర్‌ ప్రజలకు అందుబాటులో లేకున్నా.. కనీసం మంత్రులకు, పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో ఉండకపోవటం, దీనిని నిలదీసిన కాంగ్రెస్ నేతల మీద కేసులు పెట్టటం.. గులాబీ పార్టీ నియంతృత్వ ధోరణికి పరాకాష్టగా నిలిచాయి. హైదరాబాద్ అభివృద్ధి గురించి కేటీఆర్ ఊదరగొట్టే ప్రచారం.. గ్రామీణ ఓటర్లకు కోపం తెప్పించింది. ఇందులో అభివృద్ధి కోణం కంటే పార్టీ నేతల రియల్‌ ఎస్టేట్‌కే ఉపయోగపడ్డాయనే భావన గ్రామీణ ఓటర్లలో స్పష్టంగా కనిపించింది.

కేసీఆర్‌ ముచ్చటపడి కట్టించుకున్న కొత్త సెక్రటేరియట్‌కు రాకపోవటంతో ఆయన ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారక కట్టడాలు జనం మనసును గెలవలేకపోయాయి. తెలంగాణలో బాగుపడింది కేసీఆర్‌ కుటుంబం మాత్రమే అని ప్రతిపక్షాల ఆరోపణలు బీఆర్‌ఎస్‌కు నెగెటివ్‌గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ కుంగడం చూసిన జనం.. కాంగ్రెస్‌ను ఒక ప్రత్యామ్నాయంగా నిలబెట్టాయి.

కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత కలహాలను పదేపదే ప్రస్తావిస్తూ సాగిన సీఎం ఎన్నికల ప్రచార పర్వం.. తెలంగాణ ఇచ్చిన మన పార్టీ తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదనే సంకల్పం కాంగ్రెస్ శ్రేణుల్లో బలపడేందుకు దోహదపడింది. దీంతో అన్ని విభేదాలనూ పక్కనబెట్టి వారంతా ఒక్కటిగా పనిచేశారు. రాహుల్‌ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర, కర్ణాటక ఎన్నికల ప్రభావం కూడా దీనికి తోడయింది.

మరోవైపు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో, దుబ్బాక, హుజురాబాద్‌ బైపోల్ గెలుపు, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో జోష్ మీదున్న బీజేపీ.. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు చేసిన కుటిల యత్నాలను జనం చీదరించుకున్నారు. కవిత అరెస్టు తర్వాత దర్యాప్తు నిలిచిపోవటం, ఆ వెంటనే బండి సంజయ్‌ స్థానంలో కిషన్‌రెడ్డిని నియమించటం, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూనే ఆ పార్టీ నేతలపై చర్యలు తీసుకోకపోవటం, మునుగోడులో ధనబలమున్న రాజగోపాల్ రెడ్డిని బరిలో దించి నవ్వులపాలు కావటం, ఐటీ దాడులన్నీ కాంగ్రెస్ నేతల మీదే జరగటం, గోషామహల్‌లో కేసీఆర్ మిత్రపక్షమైన ఎంఐఎం తన అభ్యర్థిని దింపకపోవటం వంటివన్నీ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకే టీమ్ అని జనాన్ని నమ్మేలా చేశాయి. తాము గెలవకున్నా ఫర్వాలేదు గానీ, దక్షిణాదిలో కాంగ్రెస్‌ బలపడకూడదనే బీజేపీ ఉద్దేశాన్ని జనం స్పష్టంగా అర్థం చేసుకునేలా చేశాయి.

ఇక… పీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి దూకుడు, అందరినీ కలుపుకుపోయిన తీరు, ప్రజావైఫల్యాలను తన పదునైన విమర్శలతో జనంలోకి తీసుకుపోవటం, తామంతా ఒక్కటిగా నిలిస్తే.. బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టగలమని పదేపదే చెబుతూ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన తీరు ఈ ఎన్నికల్లో హైలెట్‌ అని చెప్పక తప్పదు. చంద్రబాబు అరెస్టుపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో సీమాంధ్రుల్లో నెలకొన్న అసంతృప్తిని గుర్తించి, వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో రేవంత్ చాణక్యాన్ని ప్రశంసించాల్సిందే.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏదో జరుగుతుందనుకున్న జనం కలలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిజం కాకపోవటం, కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు జనం మదిలో నిలిచిపోవటంతో ప్రధాని మోదీ ప్రకటించిన ఎస్సీ వర్గీకరణ, బీజేపీ బీసీ సీఎం ప్రభావం తేలిపోయాయి. చివరకు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలవబోతుందనే అంచనాకు వచ్చిన బీజేపీ అధిష్ఠానం చివరి దశలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి పరోక్షంగా బీఆర్‌ఎస్‌కు లబ్ది చేకూర్చాలని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ వైపు వీచిన గాలిలో ఇవన్నీ కొట్టుకుపోక తప్పలేదు.

మొత్తంగా గులాబీ పార్టీ స్వయంకృతాపరాధాలు, మితిమీరిన అప్రజాస్వామిక ధోరణులు, నిర్ణయాల్లో ఆ పార్టీ బాస్, ఆయన కుటుంబ సభ్యుల ఒంటెత్తు పోకడలు, ధనిక, కులీన వర్గాల ప్రతినిధులుగా వారిని జనం ముందు నిలిపాయి. దీనికి భిన్నంగా.. కాంగ్రెస్ అగ్రనేతల ప్రజాస్వామిక నిర్ణయాలు, పార్టీలో ఉత్సాహం నింపిన తీరు, సానుకూలంగా సాగిన యావత్ ప్రచారపర్వం, కాంగ్రెస్ నేతల ఐకమత్యం, ఒక కొత్త కాంగ్రెస్‌ సంస్కృతిని జనం చూడటంతో వారంతా కాంగ్రెస్‌కు జై కొట్టక తప్పని ఒక అనివార్యతను సృష్టించాయని చెప్పక తప్పదు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×