MLA Satyam Threat Call : “మర్యాదగా రూ.20 లక్షలు ఇవ్వు.. లేదంటే నీ పిల్లల్ని అనాథల్ని చేస్తా” “నీ పరువు తీసి.. నిన్ను రాజకీయంగా అప్రతిష్టపాలు చేస్తా” ఇదీ ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్ కాల్. అందరిలా మామూలు వారిని బెదిరిస్తే ఏముంటుంది అనుకున్నాడో.? ఏమో.? ఏకంగా అధికార పార్టీ నేతనే టార్గెట్ చేశాడు. రూ.20 లక్షలు ఇవ్వకుంటే తన రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని మొదట బెదిరించిన నిందితుడు.. తర్వాత తీవ్రత పెంచి చంపేస్తానంటూ పరోక్షంగా హెచ్చరించాడు. దాంతో ఆ ఎమ్మెల్యే పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఎదురైంది.
రెండు రోజుల క్రితం అర్థరాత్రి వేళ ఎమ్మెల్యేకు వాట్సప్ లో ఫోన కాల్ వచ్చింది. ఆ సమయంలో ఎవరు చేశారోనని మాట్లాడగా.. నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై ఎమ్మెల్యే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బెదిరింపు ఫోన్ కాల్స్ పై విచారణ ప్రారంభించారు. వాట్సప్ కాల్స్ కావడంతో సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని సైబర్ పోలీసుల సాయంతో కేసును టేకప్ చేశారు. ఈ కాల్ లండన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు.. కాల్ లో మాట్లాడింది.. రంగారెడ్డి బోడుప్పల్ లోని భవనీ నగర్ కు చెందిన యాసా అఖిలేష్ రెడ్డిగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు లండన్ లోనే ఉన్నాడన్న పోలీసులు.. అతని కోసం లక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు.. దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే వివరాలను వెల్లడించారు. నిందుతుడి గురించిన సమాచారాన్ని సేకరించి అతనిపై 339/2024 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇతనిపై భారతీయ న్యాయ సంహిత లోని 308, 351(3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ప్రకటించిన కరీంనగర్ ఏసీపీ వెంకట రమణ. నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు.
అసలు లండన్ లో ఉన్న నిందితుడు అఖిలేష్ రెడ్డి అక్కడి నుంచి ఎందుకు ఫోన్ చేశాడు అనేది పోలీసులకు అసలు ప్రశ్నగా మారింది. విదేశాలకు వెళ్లిన వ్యక్తి డబ్బుల కోసం ఈ పని చేశాడా.? లేదా ఎమ్మెల్యేతో ఏమైనా పరోక్ష వివాదాలు ఉన్నాయా.? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Alsos Read : ఆ బీఆర్ఎస్ నేతలను వదలం.. మావోయిస్టుల హెచ్చరిక
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఈ ఏడాది జూన్ లో బలవన్మరణానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె.. హైదరాబాద్ అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తాలుకు బాధలో ఉన్న ఎమ్మెల్యేకు ఇలాంటి కాల్స్ రావడం.. తనకున్న ఇద్దరు పిల్లల్ని అనాథల్ని చేస్తానంటూ చెప్పడంతో ఎమ్మెల్యే మరింత బాధకు గురయ్యారు.