EPAPER

Telangana Assembly Elections 2023 : తెలంగాణ సర్కారుకు షాక్.. ఈసీ సంచలన నిర్ణయం

Telangana Assembly Elections 2023 : తెలంగాణ సర్కారుకు షాక్.. ఈసీ సంచలన నిర్ణయం

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో 20 మంది ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో పాటు నాన్‌ కేడర్‌ ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. హైదరాబాద్‌ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది ఈసీ. వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, నాన్‌ కేడర్‌ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది. బదిలీ అయిన అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకుని కింది స్థాయిలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. సీఎస్‌ శాంతికుమారిని కూడా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, దేవాదాయ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.


మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతో పాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో గురువారం సాయంత్రం 5 గంటల్లోగా కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఈసీ. ఈ మేరకు ఒక్కొక్క పోస్టుకు ముగ్గురు ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ అధికారుల పేర్లను ప్రతిపాదించాలని.. వారికి సంబంధించిన గత ఐదేళ్ల వార్షిక పనితీరు, విజిలెన్స్‌ క్లియరెన్స్‌లను సైతం జత చేయాలని ఆదేశిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్‌.బీ జోషి సీఎస్‌కు లేఖ రాయడంతో..బదిలీ అయిన వారు తక్షణమే ఆయా పోస్టులకు వెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. ఈసీ కొరడా ఝుళిపించిన వారిలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ వి.సత్యనారాయణ ఉన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, నిబంధనల అతిక్రమణ, తమ దృష్టికి వచ్చిన ఇతర అంశాల ఆధారంగానే పెద్ద సంఖ్యలో అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఈ నెల 3 నుంచి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌లతో కూడిన బృందం పర్యటించింది. ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది. ఈ సమయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల వ్యవహార శైలిపై ప్రతిపక్షాల ప్రతినిధులు ఈసీ బృందానికి పలు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లా కలెక్టర్లుగా, ఎస్పీలుగా బదిలీ చేశారని..నిష్పక్షపాతంగా వ్యవహరించే యువ అధికారులను పక్కనపెట్టారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనికితోడు ఈ అధికారులు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేసిన విషయం కూడా ఎన్నికల కమిషన్‌ దృష్టికి వెళ్లింది.


కేంద్ర, రాష్ట్రాల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల ఉన్నతాధికారులు, డీజీపీ, సీఎస్, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశాల సందర్భంగా గతంలో నిర్వహించిన ఎన్నికల తీరుపై సీఈసీ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతోపాటు అనంతరం జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు, మద్యం, బంగారం, ఇతర కానుకలు పంపిణీ చేసినట్టు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణతోపాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఓటర్లను అత్యధికంగా ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. ఇంత జరుగుతున్నా ఎన్నికల సమయంలో జప్తు చేస్తున్న డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం, వెండి, ఇతర కానుకలు నామమాత్రంగానే ఉన్నాయని..ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలు నిర్వహించిన తీరుపై పదేపదే ఆక్షేపణలు తెలిపినట్టు తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్, లిక్కర్‌ మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదని ఎన్నికల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మహారాష్ట్ర, గుజరాత్‌లలో పెద్ద మొత్తంలో దొరికన డ్రగ్స్‌ రాష్ట్రం నుంచే తరలివెళ్లినట్టు నివేదికలు ఉన్నాయని.. డ్రగ్స్‌ మాఫియాతో చేతులు కలిపారా..అని ఈసీ ప్రశ్నించినట్లు సమాచారం. రవాణా శాఖ కార్యదర్శి.. అధికార పార్టీ సభలకు వాహనాల కేటాయింపులో సహకరించినట్టు వచ్చిన ఆరోపణలతో ఆయనను తొలగించారని వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ జిల్లాల్లో ఎస్పీలు ప్రతిపక్షాల సభలు, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో విస్తృతంగా సమీక్షలు జరిపి వెళ్లిన వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై బదిలీ వేటు వేయడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ చేసిన అధికారులను ఇంకా ఎలాంటి ఇతర పోస్టుల్లో నియమించలేదు. అయితే బదిలీ అయిన 10 మంది జిల్లా ఎస్పీల్లో 9 నాన్‌ కేడర్‌ ఎస్పీలే అంటే ఐఏఎస్‌ కాకుండా ఎస్సై, సీఐ వంటి పోస్టుల నుంచి సీనియారిటీతో ఎస్పీగా నియమితులైనవారే ఉన్నారు. సాధారణంగా జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్లే వ్యవహరిస్తారు. అలాంటిది నాలుగు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయడంతో పాటు.. వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×