EPAPER

Derogatory Comments: బూతులపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు సేవ చేయడంపై లేదా..?

Derogatory Comments: బూతులపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు సేవ చేయడంపై లేదా..?

Derogatory Comments: కాలుజారితే వెనక్కు తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేమని సామెత. నోరు మంచిదైతే ఊరు మంచిదనే మాటా తెలుగునేలపై విరివిగా వాడుకలో ఉంది. అయితే, ఎందుకో తెలియదు గానీ, ఇంత మంచి మాటలను మన నేతలు మాత్రం ఒంటపట్టించుకోవటం లేదు. లేచింది మొదలు ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలు తవ్వితీయడం, వారి వ్యక్తిగత అలవాట్లపై నోరు పారేసుకోవడం నేటి రాజకీయంలో ఒక సరికొత్త ట్రెండుగా మారింది. ఈ జోరులో వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితాలు వేరనే సోయి నేతలకు లేకుండా పోవటం దురదృష్టకరం. ఇటీవల మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలను గులాబీ నేతలు పదేపదే ప్రస్తావిస్తూ రెండు రోజులుగా నానా హడావుడి చేస్తున్నారు. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం చేసిన లేకి ప్రచారంతో తీవ్ర భావోద్వేగానికి గురైన మంత్రి సురేఖ ఈ ప్రచారానికి బాధ్యుడైన కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కొన్ని వ్యాఖ్యాలు చేశారు. అయితే, తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా, మహిళగా ఆమె తన తప్పుకు విచారం వ్యక్తం చేయటం ఆహ్వానించదగిన పరిణామం. అయితే, ఆమెను లక్ష్యంగా చేసుకున్న బీఆర్ఎస్ నేతలు గత పదేళ్లలో ఏనాడూ తమ రోత మాటల పట్ల ఈపాటి విజ్ఞతను ప్రదర్శించిన దాఖలాలు లేవనే చెప్పాలి.


బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ ముచ్చటే తీసుకుందాం. ఒక సీనియర్ నేతగా, పార్టీ అధ్యక్షుడిగా, మరీ ముఖ్యంగా ఒక సీఎంగా ఉంటూ గతంలో తాను పనిచేసిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిని గత పదేళ్లలో పదుల సార్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని అత్యంత అసభ్యమైన పదజాలం వాడుతూ సంబోధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకపోతే హైదరాబాద్ సంకనాకి పోతుందని ఓటర్లను పరోక్షంగా బెదిరించే యత్నం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత నిండా మూడు నెలలు నిండని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకుని ‘కాంగ్రెస్ వల్లే కరువు వచ్చింది.. కాంగ్రెస్​ వచ్చినంక కరెంట్ ఉంటలేదు.. మళ్లీ మోటర్లు కాలుతున్నయ్​.. కాళేశ్వరం నీళ్లను కావాలనే ఎత్తిపోస్తలేరు.. నీళ్లున్నా పంటలను ఎండవెడ్తున్రు.. రైతులు పండించిన వడ్లను కొంటలేరు’ లాంటి కామెంట్లు చేస్తూ వచ్చారు. ‘మేడిగడ్డ కుంగిపోతే అదో పెద్ద విషయమా.. ప్రాజెక్టులన్నంక కుంగిపోవా?’ అంటూ దానిని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలను బండబూతులు తిట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫిబ్రవరిలో నల్గొండ సభ కోసం తొలిసారి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి మాట్లాడారు. ఆ మీటింగ్‌‌‌‌లో ఆయన సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నవ్. అక్కడ తోకమట్ట ఏమైనా ఉన్నదా? మూడు పిల్లర్లు కుంగిపోతే పెద్ద రాద్దాంతం చేస్తున్నవ్‌‌‌‌. మమ్మల్ని బద్నాం చేస్తవా? మిమ్మల్ని బతకనీయం.. వెంటాడుతాం.. వేటాడుతాం’ అని హెచ్చరించారు.

Also Read: కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఫిర్యాదు చేసింది ఎవరంటే ?


ఆ తర్వాత మార్చిలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో సభ పెట్టి లోక్‌‌‌‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ, ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌‌‌‌కు ఓటేసిన్రు’అంటూ జనంపై నిందలేయడం మొదలుపెట్టారు. ఎండిన పంటల పరిశీలన కోసం కరీంనగర్‌, సిరిసిల్ల ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహించి, సిరిసిల్లలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించి.. ‘ప్రస్తుత ప్రభుత్వం తెలివితక్కువ, అసమర్థ, అవివేక, అర్భక, చవట విధానాల వల్లనే నాశనానికి వచ్చింది. నీటి నిల్వ సామర్థ్యం తెల్వని లత్‌కోర్‌లు, చవట దద్దమ్మలు రాజ్యమేలుతున్నరు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. తప్పించుకోవాలని అనుకుంటే ప్రజలు వీపు విమానం మోత మోగిస్తారు. వదిలిపెట్టరు. కాళేశ్వరం పంప్‌లను ఆన్‌చేసి వరదకాలువకు నీళ్లు వదిలారని సిగ్గులేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతాడు. సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యేటట్లు ఉన్నాయి. ఓ కాంగ్రెసోడు నిరోధ్‌లు, పాపుడాలు అమ్ముకుని బతకమని అంటడు. నిరోధ్‌లు అమ్ముకొని బతకాల్నా కుక్కల కొడుకుల్లారా? చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా. చేనేత కార్మికులను మొన్నటిదాకా దొబ్బితిన్నరు.. దోచుకుతిన్నరని అంటారా దొంగ నా కొడుకుల్లారా. రూ.500 బోనస్‌ ఇవ్వకపోతే గొంతు కొరికి చంపుతాం’ అని పదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్ నోరు పారేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ కేసీఆర్ ప్రచారం మీద 48 గంటల నిషేధం విధించింది.

ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా, ఆయన దారిలోనే ఆయన సుపుత్రుడు కేటీఆర్ నడుస్తున్నారు. ఉచిత బస్సు గురించి మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి, మహిళా కమిషన్ ముందు దోషిగా నిలబడ్డారు. బడ్జెట్ సెషన్‌లో తన కంటే ఆరేళ్లు వయసులో పెద్ద అయిన ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించటం, దీనిపై కాంగ్రెస్ సభ్యలు అభ్యంతరం వ్యక్తం చేయటంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవటం జరిగిపోయాయి. రంగారెడ్డి జిల్లా పోతుగల్ గ్రామపు 200 మంది వృద్ధులు, తమకొచ్చే ఆసరా పింఛనులో మనిషికి 20 రూపాయలు వేసుకొని షాద్‌నగర్ – చేవెళ్ల రహదారి గుంతలను పూడ్చారనే వార్తపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘వృద్ధులు పెన్షన్ డబ్బులతో మరమ్మతు చేస్తుంటే మీకు సిగ్గు లేదా’ అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు. పదే పదే కేంద్రంలోని మోదీని నానా తిట్లు తిట్టి.. అతి తెలివి ప్రదర్శిస్తూ ‘ఈ మాటలన్నీ మేం అనగలం.. కానీ అనం’ అంటూ ముక్తియింపునివ్వటంతోనే పార్లమెంటు ఎన్నికల్లో జనం గట్టిగా కారుకు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్‌ మీదా ఇలాంటి అహంకారపు వ్యాఖ్యలే చేసి, తర్వాత నాలుక్కరుచుకున్నారు. ఢిల్లీలో రైతులకు సంఘీభావంగా అక్కడ దీక్ష చేసిన పార్టీ నేత.. పొరుగు తెలుగురాష్ట్రంలోని పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేయటంపై నోరుజారటంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందనే వాస్తవాన్ని మరిచి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ‘ఆ పార్టీలో అనేక మంది మాకు టచ్‌లో ఉన్నారు, మహారాష్ట్ర వలే ఏకనాథ్ షిండేలు ఉన్నారు, 39 సీట్లు చేతిలో పట్టుకుని మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టబోతున్నారు’ అని ప్రకటిస్తూ వచ్చారు. కానీ, బీఆర్ఎస్ ప్రారంభించిన అనైతిక ఫిరాయింపులే నేడు శాపాలుగా మారి తమ పార్టీని కబళిస్తుంటే.. తీవ్ర ఆక్రోశంతో ఏదేదో మాట్లాడుతున్నాడు కేటీఆర్.

Also Read: అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తా: భట్టి విక్రమార్క

నాయకులను బట్టే అనుచరులు అన్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయారు. ఏకంగా నాటి గవర్నర్ తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. జాతీయ మహిళా కమిషన్ ముందు సంజాయిషీ ఇచ్చుకున్నారు. తర్వాత జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో రైతు దినోత్సవ సభలో.. రైతుల మీదే నోరు పారేసుకుని విమర్శల పాలయ్యారు. గ్రామాల పర్యటనల్లో అధికారులను, సిబ్బందిని దూషించిన వీడియోలు వైరలయ్యాయి. ఈటల రాజేందర్ సామాజికవర్గమైన ముదిరాజ్ లను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడి అభాసు పాలయ్యారు. ఇక.. కేసీఆర్ నమ్మినబంటు బాల్క సుమన్ మొదలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీ నేతల జాబితా కొండవీటి చాంతాడంత ఉంది. మన రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ.. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ నేతలు నోరుపారేసుకోవటంతోనే నేడు ఈ ఇలాంటి ఘటనలు పలు పార్టీల నేతల నుంచి వినాల్సి వస్తోంది. నేతల బూతు పురాణంతో ప్రజా సమస్యలు మరుగున పడిపోతున్నాయి. ప్రత్యర్థుల్ని తిట్టడం మీద ప్రజా ప్రతినిధులు చూపిస్తున్న శ్రద్ధ కాస్తైనా ప్రజల మీద, వారి సమస్యల పరిష్కారం మీద పెడితే.. దేశానికి కాస్తైనా మేలు జరుగుతుంది. అడ్డంగా నోరుజారే సంస్కృతికి రాజకీయ పార్టీలు అడ్డుకట్ట వేయాలి..లేదంటే ఆ పని ప్రజలు వేసే రోజు కచ్చితంగా వస్తుంది.. ఆ రోజు నేతలకు నోరెత్తే అవకాశం ఉండదు.

– డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం

Related News

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

CM Revanth Reddy: ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం: సీఎం రేవంత్ రెడ్డి

Ponguleti: త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి

KCR: కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఫిర్యాదు చేసింది ఎవరంటే ?

Secunderabad To Goa Trains: సికింద్రాబాద్ టూ గోవా రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి

Bhatti Vikramarka: అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తా: భట్టి విక్రమార్క

×