Big Stories

Telangana Formation Day: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అలా తెలంగాణంలో..

Telangana Formation Day: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో 1969 ఉద్యమానికి ప్రత్యేక ప్రస్థానం ఉంది. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 300 మందికి పైగా అమరులయ్యారు. అదే సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు. ఫలితంగా ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడింది. కానీ రాజకీయ ఒత్తిళ్లు, జాతీయ పరిస్థితుల కారణంగా ఉద్యమం చల్లబడింది. పార్లమెంట్ ఎన్నికల్లో 11 ఎంపీ స్థానాలు గెలిచి ఉద్యమ ఆకాంక్షను చాటి చెప్పిన ప్రజా సమితి పార్టీ.. చివరిగా కాంగ్రెస్ లో విలీనం అయ్యే పరిస్థితులు వచ్చాయి. ఆనాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్ధం నగరంలో గన్‌పార్కు వద్ద స్థూపాన్ని కట్టించారు. ఈ స్థూపమే మలి దశ పోరాటానికే స్ఫూర్తిగా నిలిచింది. పెద్ద మనుషుల ఒప్పందం, సిక్స్ పాయింట్ ఫార్ములా, విద్య, ఉద్యోగాల్లో స్థానికుల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలో పొందుపర్చిన 371(డి) అధికరణ, 610 జీవో అమలు వంటి అంశాలను అమలు చేయకుండా ఉండటం.. ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్న భావన తెలంగాణ ప్రజల్లో పెరుగుతూ వచ్చింది. ప్రజా సంఘాలు, ప్రాంతీయవాద నేతలు తమ వాణిని వినిపిస్తూనే వచ్చారు. ఇంద్రారెడ్డి వంటి నేతలు పార్టీలు కూడా ఏర్పాటు చేసినప్పటికీ… సమైక్యవాదం ముందు నిలవలేకపోయాయి.

- Advertisement -

2001లో టీడీపీ నుంచి బయటికి వచ్చిన కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధనే అజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కేవలం ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాదని భావించిన కేసీఆర్.. రాజకీయ ఎత్తుగడలతో తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ఈ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. 2004లో పోటీ చేసి సత్తా చాటిన టీఆర్ఎస్… 2009 నాటికి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మా దాటికి కుప్పకూలిపోయింది. ఒక దశలో తెలంగాణ వాదమే లేదన్న చర్చ మొదలైంది.

- Advertisement -

అది 2009 అక్టోబర్.. పోలీసు ఉద్యోగాలకు హైదరాబాద్ లో లోకల్ రిజర్వేషన్లు ఎత్తివేసి..ఫ్రీ జోన్ గా ప్రకటించాలని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పోలీస్ రిక్రూట్మెంట్ కోసం హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా సుప్రీంకోర్టు ప్రకటించింది. దీనివల్ల తెలంగాణ యువత రిజర్వేషన్లు కోల్పోతారని.. ఇది 610జీవోకు విరుద్ధమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. అలా.. మలిదశ ఉద్యమానికి నిప్పురవ్వ రాజేసింది ఈ ఫ్రీ జోన్ అంశమే.

ఇక్కడే కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చారు. 2009 నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సిద్ధిపేటలో ఆమరణనిరహార దీక్ష ప్రారంభించారు. దీనిని అడ్డుకున్న సర్కార్.. కేసీఆర్ ను అదుపులోకి తీసుకుని ఖమ్మం జైలుకు పంపించారు. ఐతే.. ఖమ్మం జైలులోనూ మెతుకు ముట్టలేదు. దీంతో కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 4న ఉదయం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఓ వైపు విద్యార్థి లోకం భగ్గుమంది.. తెలంగాణవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ఈ సమయంలోనే నవంబర్ 29న ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నాడు . ప్రాణాలతో పోరాడి డిసెంబర్ 3న శ్రీకాంతాచారి మృతి చెందడంతో ఉద్యమ ఆవేశాలు జనాల్లో పీక్స్ కు వెళ్లాయి. శ్రీకాంతాచారి స్ఫూర్తితో పోలీస్ కిట్టయ్య, వేణుగోపాల్ రెడ్డి, యాదిరెడ్డిలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం వెనక్కి తిరిగి చూడలేదని చెప్పవచ్చు. 2009 డిసెంబర్ 29 రాత్రి పదకొండున్నరకు ఓ ప్రకటన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇప్పుడే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం తెలిపారు. కేసీఆర్ వెంటనే ఆమరణనిరహార దీక్ష విరమించాలని కోరారు. ఈ ప్రకటనతో కేసీఆర్ దీక్ష విరమించగా.. యావత్ తెలంగాణ సమాజం సంబరాల్లో మునిగిపోయింది.

తెలంగాణకు అనుకూలంగా చిదంబరం ప్రకటనతో సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహా సీమాంధ్రకు చెందిన అందరు లీడర్ల సమైక్యాంధ్ర ఉద్యమం చేపట్టారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తెలంగాణ ఉద్యమానికి పోటీగా.. మరోసారి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని లెవనెత్తారు. కేంద్రం తెలంగాణ అనుకూల నిర్ణయానికి.. సీమాంధ్ర నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. రెండు ప్రాంతాల్లో ఉద్యమాలు ఎగిసిపడటంతో.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరమా అనే కోణంలో రాజకీయ పార్టీలు, ఇతర మేధావుల సూచనలు అన్ని పరిగణలోనికి తీసుకున్న తరువాత నిర్ణయం తీసుకుంటామని యూ టర్న్ తీసుకుని ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ ఉద్యమం మళ్లీ మెుదటికి వచ్చింది.

చిదంబరం ప్రకటనతో తెలంగాణలోని ప్రజాప్రతినిధులంతా 48 గంటల్లోగా రాజీనామా చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా పొలిటకల్ జేఏసీకి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దానికి అధ్యక్షుడిగా ప్రొఫెసర్ కోదండరాంను ఎన్నుకున్నారు. ఇక్కడి నుంచే పార్టీ జెండాలు పక్కన పెట్టిన తెలంగాణ నాయకులు.. ప్రత్యేక రాష్ట్రమే ఏజెండాగా పెట్టుకుని ఉద్యమంలోకి దూకారు. 2010 ఫిబ్రవరి 3న తెలంగాణ ఏర్పాటు సాధ్యసాధ్యాలపై 5 మందితో కూడిన రిటైర్డ్ జడ్జ్ జస్టిన్ శ్రీకృష్ణ నేతృత్వంలో 5 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. 9 నెలల పాటు ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగి.. కవులు, కళాకారులు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, రాజకీయనాయకులు ఇలా.. అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని అదే ఏడాది డిసెంబర్ 30 రిపోర్టు కేంద్రానికి అందజేసింది.

2011 మార్చి 10న ట్యాంక్ బండ్ పై పది లక్షల మందితో మిలియన్ మార్చ్ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలోనే ఇదో చారిత్రక ఘట్టం. ఆ తరువాత 2011 సెప్టెంబర్13 న మెుదలై.. అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు సకలజనుల సమ్మె నిర్వహించారు. ఈ 42 రోజులు తెలంగాణ రాష్ట్రం మెుత్తం స్థంభించిపోయింది. అందుకే మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె ఉద్యంలో కీలక ఘట్టాలుగా చెప్పొచ్చు.

ఎట్టకేళకు 2013 అక్టోబర్ 3న 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజనకు సంబంధించిన బిల్ ను పార్లమెంట్ కు పంపడానికి సిద్ధం చేసింది. 2014 ఫిబ్రవరి 13న లోక్ సభలో ఏపీ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 18న లోక్ సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లు పాస్ కాగా.. ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఈ బిల్లు పాసైంది. 2014 మార్చి 1 రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగా.. కేంద్రం మార్చి 2న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్రం చేసిన ప్రకటనతో అధికారికంగా జూన్ 2 న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. నేటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని.. పదో ఏట అడుగుపెట్టింది తెలంగాణం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News