యాదాద్రి కబ్జా ఫైల్స్
ఆర్ఆర్ ఎనర్జిటిక్స్ టు సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్
ఆనాడు జరిగిందేంటి..? ఇప్పుడు చేస్తున్నదేంటి?
స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ కథనం
– అక్రమ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి బడాబాబులమంటూ హామీలు
– ఆ రెండు జిల్లాల నేతలకు మేతగా మారిన కంపెనీ?
– నేతలని ఫీల్ అయ్యే వారందరికీ అదో బంగారు బాతేనా?
– ఎమ్మెల్సీ క్యాండెట్‌గా లోగోతో వెళ్లి హడావుడి
– కోర్టులో కేసు వాపస్ తీసుకుని కోటీశ్వరులయ్యారా?
– సెటిల్మెంట్స్‌లో ఎమ్మెల్యేకు ఆ క్రషర్ ఎలా చేజిక్కింది?
– ఒక్క యాదాద్రి జిల్లాలోనే 3175 ఎకరాల టైటిల్ వివాదం ఏంటి?
– అక్రమంగా అమ్మిన లే అవుట్స్ ఎన్ని?
– అసలు బాంబుల కంపెనీకి రియల్ ఎస్టేట్‌కి లింకేంటి?
– సాల్వో కంపెనీకి వేల ఎకరాలు ఉన్నా 80 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా ఎందుకు?
– సీఎం పేషీలో ఉండే పీఆర్వో చుట్టూ చక్కర్లు?
– అంతా చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు వార్తలు
– అధికార పార్టీ నేతలు తలుచుకుంటే అన్నీ లీగల్ అయిపోతాయా?
– బాంబుల కంపెనీ పేరుతో రియల్ ఎస్టేట్ కోసం లావణి పట్టాదారులతో అగ్రిమెంట్స్
– కేటీఆర్, హరీష్ రావుకు సన్నిహితంగా డైరెక్టర్ వంగా రాజేశ్వర్
– అదే భూముల చుట్టూ గులాబీ బినామీ వ్యవహారాలు
– అక్రమ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ చుట్టూ సాగిన దందాపై స్వేచ్ఛ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ
దేవేందర్ రెడ్డి, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Yadadri District Land Scam: ప్రభుత్వ స్థలం కబ్జా చేసి, అనామక కంపెనీ అయిన సాల్వో ఎక్స్‌ప్లోజివ్ అండ్ కెమికల్స్‌కు సింగరేణి 155 కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చింది. అంతకుముందు పిలిచిన టెండర్లను రద్దు చేసి మరీ, కట్టబెట్టడం వెనుక ఓ మంత్రి పాత్ర ఉందని తెలుస్తోంది. సాల్వో చీకటి బాగోతాన్ని ఇప్పటికే స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం బట్టబయలు చేసింది. ఇందులో తవ్వే కొద్దీ సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. ఆర్‌ఆర్ హై ఎనర్జిటిక్స్ లిమిటెడ్‌కు చెందిన 3175 ఎకరాల భూమిలో చాలావరకు దారి మళ్లింది.
అదే భూమిని చూపించి అనుమతులు తీసుకున్న సాల్వో కంపెనీ, రోజుకు 100 టన్నుల నుంచి 120 టన్నుల వరకు అమోనియం నైట్రేట్ వాడుతోంది. ఇదంతా పనిచేస్తున్నది ఎక్కడ అంటే కీసర రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 918లోని ప్రభుత్వ భూమిలోనే. ఇలాంటి కంపెనీకి కాంగ్రెస్ సర్కార్ టెండర్లు మార్చి అర్హత లేకున్నా, 155 కోట్ల రూపాయాలు దక్కేలా రెండేళ్ల పాటు సామగ్రిని ఇచ్చేలా పర్మిషన్లు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
నేతలకు మేత?
యాదాద్రి జిల్లాలో నేతగా ఎదగాలంటే ఈ సాల్వో ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ నుంచి ఆదాయ వనరులు అందాల్సిందే. తాజా ఎమ్మెల్యే భాగస్వామిగా ఉన్న స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీకి సాల్వో చైర్మన్ జయరాం రెడ్డి ఇచ్చిన భూములే అందాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఓ ఇల్లీగల్ క్రషర్ యూనిట్‌ని తన ఖాతాలో వేసుకుని తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌లో జయరాం రెడ్డి, అయన కుమారుడైన శ్యామ్ సుందర్ రెడ్డిపైన నమోదైన ఎఫ్ఐఆర్‌ని క్లోజ్ చేయించారు. ఇక ఓ ఎమ్మెల్సీ అయితే, తనకు ఎందుకు వాటా రాదనుకున్నాడో ఏమో, ఎన్నికల ముందు గ్రామస్తులను అడ్డుపెట్టుకుని తాను ప్రశ్నించే గొంతుక లోగోతో అక్కడకు వెళ్లొచ్చారు. తర్వాత ఎన్నికలు సాఫీగా సాగాయి.
ఇక అదే జిల్లా నుంచి కాంగ్రెస్ సర్కార్‌లో పీఆర్వో (జర్నలిస్టు రూపంలో ఉన్న రాజకీయ నాయకుడు) ప్రభుత్వ భూముల కబ్జాలపై గతంలో కేసులు వేశారు. అయితే, ఈసీఐఎల్‌లో ఉండే తులసి హాస్పిటల్ సెటిల్మెంట్స్‌లో అందనంత దూరంలో సెట్ రైట్ అయ్యారని గ్రామస్తులు అనుకుంటున్నారు. దీనిపై హైకోర్టులో పిల్(92/2021) దాఖలైంది. ఈ కేసు విచారణ మధ్యలోనే డిస్పోజ్ అయింది. దీనికి కారణం ఏంటో ఆర్డర్ కూడా ఆన్‌లైన్‌లో లేదు. ప్రభుత్వ భూమిపై పిల్ వేసి కాంప్రమైజ్ కావడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు అదే భూమితో పాటు యాదాద్రిలో ఉండే లిటిగేషన్ ల్యాండ్స్‌ని పరిష్కరించేందుకు కలెక్టర్స్ బదిలీ అయ్యారని చెప్పుకుంటున్నారు. నాలుగైదు ఏండ్లుగా ఎదుగుతున్న నేతలకు ఎప్పటికప్పుడు మేత అందివ్వడంతో వీరంతా ఆర్థికంగా బలంగా మారారని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ భూమిని రక్షించాలని కోరుతున్నారు.
యాదగిరి గుట్ట సాక్షిగా గుట్టలన్నీ మాయం
రియల్ ఎస్టేట్ ముసుగులో సాల్వో కంపెనీ చేసిన పాపాలే, ప్లాట్ ఓనర్స్‌కి శాపంగా మారాయి. అదిగో గుట్ట, ఇదిగో ప్లాట్ అంటూ అమ్మకాలు చేశారు. ఆర్ఆర్ హై ఎనర్జిటిక్స్‌కు చెందిన భూములు బినామీల పేర్లతో భారీగా బదిలీలు చేశారు. బాంబుల కంపెనీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ లాభాల కోసం మళ్లించారు. సదరు కంపెనీలోని తమిళనాడుకు చెందిన డైరెక్టర్స్ వైదొలగడం, కొందరు చనిపోవడంతో వీరి పంట పండింది. ఆ భూములు సేకరించే సమయంలోనే ఓ మధ్యవర్తి 1996లో హత్యకు గురయ్యారు.
దీనిపై అనేక అనుమానాలున్నాయి. ఇప్పుడు ఆ భూములను జయరాం రెడ్డి, వంగా రాజేశ్వర్ రెడ్డి కుటుంబాల కింద ఉన్నారు. వీరు అక్కడ ఆడిందే ఆట పాడిందే పాటలాగా అంతా మారింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో నేతలను బుజ్జగించి, అక్రమ బాంబుల తయారీ కంపెనీని నడిపిస్తున్నారు. వంగా రాజేశ్వర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ నేతలకు దగ్గరగా ఉన్నాడు. కేటీఆర్, హరీష్ రావుల మనిషిగా ముద్ర వేసుకున్నాడు. దీంతో బినామీ భూముల అనుమానాలు ఉన్నాయి. అయితే. అదే భూమిని రెగ్యులరైజేషన్ చేయడానికి ఇప్పుడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కంపెనీ పేరు మార్పు కహానీ
తమిళనాడుకు చెందిన ఆర్ఆర్ హై ఎనర్జిటిక్స్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో 3 వేల ఎకరాల్లో బాంబులు తయారు చేసేలా ప్లాన్ చేసుకుంది. తర్వాత సాల్వో ఎక్స్‌ప్లోజివ్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1985లో ఏర్పాటు చేసినట్లు చూపించుకుంటున్నారు. అసలైన కంపెనీలో డైరెక్టర్స్ మారారు. దీంతో తర్వాత జరిగిన పరిణామాలేంటి? బినామీలు ఎవరు, భూములు ఎవరి చేతిలో ఉన్నాయి. అసైన్డ్ చేసింది ఎవరు? ఎలా వచ్చాయో మరో ఇన్వెస్టిగేషన్ కథనంలో చూద్దాం.