EPAPER

Singareni Elections : సింగరేణి జంగ్.. కోల్ బెల్ట్ లో వార్ వన్ సైడేనా..?

Singareni Elections : సింగరేణి జంగ్.. కోల్ బెల్ట్ లో వార్ వన్ సైడేనా..?

Singareni Elections : సింగరేణి జంగ్ మొదలైంది. ఈనెల 27న పోలింగ్ కు సర్వం సిద్ధమవుతోంది. అయితే కోల్ బెల్ట్ ఏరియాలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హస్తం పార్టీ అనుబంధ విభాగం సత్తా చాటుతుందన్న అంచనాలతో.. బీఆర్ఎస్ అనుబంధ సంఘంలో ఆందోళన మొదలైంది. దాంతో పోటీ చేసేది లేదని ముందుగా నిర్ణయించుకున్న బీఆర్ఎస్.. పోటీ చేయొద్దంటూ ముందుగా ప్రకటించింది.


యూనియన్ నేతలకూ ఫోన్ చేసి విషయాన్ని చెప్పేశారు ఎమ్మెల్సీ కవిత. పోటీ చేయనప్పుడు ఇక యూనియన్‌లో ఉండడం ఎందకంటూ కీలకనేతలంతా రాజీనామాలు చేయడంతో.. ఖంగుతింది బీఆర్‌ఎస్ అధిష్టానం. పూర్తిగా పరువుపోతోందన్న భయంతో మళ్లీ హడావుడిగా ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటించింది. అసలు బీఆర్‌ఎస్‌లో ఇంత గందరగోళం ఎందుకు..? సింగరేణి ఎన్నికలంటే అంత భయం ఎందుకు..?

ఈనెల 27న జరిగే సింగరేణి జంగ్ ను ఎదుర్కొనే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. అందుకు నిదర్శనమే పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం అంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలం సింగరేణిలో హవా చెలాయించారు బీఆర్ఎస్ నేతలు. జాతీయ కార్మిక సంఘాలను అణగదొక్కి.. తమ జెండా పాతారు. కార్మికులను నోరు నొక్కేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా… కాలచక్రం గిర్రున తిరిగింది. ఇప్పుడు సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ సంస్థ ప్రభ పూర్తిగా తగ్గిపోయింది. వీటికి తోడు… ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్‌ ఏరియాలో ఎమ్మెల్యేలంతా ఓడిపోవడంతో.. సింగరేణి ఎన్నికల్లో పరువుపోతుందన్న భయం బీఆర్ఎస్ కు పట్టుకుంది.


దీంతో పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కన్నా దూరంగా ఉండడమే బెటర్ అని మాజీ సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందుకే పోటీ వద్దని తేల్చేశారు. దీనిపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యూనియన్ కు చెందిన ముగ్గురు టాప్ లీడర్లు రాజీనామా చేశారు. వీరిలో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు యూనియన్ లో ఎందుకుండాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమం నుంచి పుట్టిన యూనియన్ ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం ఆత్మహత్యాసదృశమేనని అంటున్నారు.

సింగరేణి ఎన్నికలను ఈసారి కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఓవైపు బీఆర్ఎస్ అనుబంధ విభాగం చేతులెత్తేయడంతో గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. మరోవైపు బొగ్గుగని కార్మికుల సంక్షేమం విషయంపై పూర్తిస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇప్పటికే సింగరేణి ఉద్యోగాల్లో స్థానికులకే 80 శాతం ఇవ్వాలంటూ రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ అనుబంధ విభాగం INTUC దూకుడు పెంచింది. మరోవైపు సింగరేణి ఎన్నికల వేళ… బీఆర్ఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి నేతల వలసలు మొదలయ్యాయి. కొమురం భీం జిల్లా నుంచి మొదలుకుని అన్ని చోట్లా చేరికలు కొనసాగుతున్నాయి.

2017లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా, ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలిచింది. రెండేళ్ల పాటు గుర్తింపు సంఘంగా కొనసాగేందుకు కేంద్ర లేబర్‌ కమిషనర్‌ డిక్లరేషన్‌ ఇచ్చారు. అయితే గుర్తింపు కాలపరిమితి అంతకుముందు నాలుగేళ్లు ఉందని, తమకు కూడా నాలుగేళ్లు ఇవ్వాలని టీబీజీకేఎస్‌ కోర్టుకు వెళ్లింది. ఆ వ్యాజ్యం కొనసాగుతుండగానే 2021 అక్టోబరులోనే నాలుగేళ్ల కాలపరిమితి ముగిసిపోయింది. కానీ కరోనా ప్రభావంతో 2022 వరకు ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించడంతో నవంబరులోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

దీంతో అక్టోబరు 30న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలై నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం, కొన్ని కార్మిక సంఘాలు అసెంబ్లీ ఎన్నికల తరువాత సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో డిసెంబరు 27వరకు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా అన్ని అడ్డంకులు తొలగి ఎన్నికలు జరగబోతున్నాయి.

సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుబంధ INTUC, సీపీఐ అనుబంధ AITUC కీలకం కాబోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పోల్ జరిపేందుకు రీజినల్ లేబర్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. గుర్తింపు సంఘంగా విజయం సాధించేందుకు ఆయా సంఘాల నాయకులు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. CLC శ్రీనివాసులు.. సింగరేణిలోని 13 కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు. తాజా ఓటర్ల జాబితాను కార్మిక నేతలకు అందజేశారు.

మొత్తం 39 వేల 809 మంది ఓటర్లు సింగరేణి ఎన్నికల్లో పాల్గొననున్నారు. కార్పొరేట్‌లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లెందులో 613 మంది, మణుగూరులో 2,452, రామగుండం-1లో 5,404, రామగుండం-2లో 3,557, రామగుండం-3లో 3,884, భూపాలపల్లిలో 5,395 మంది, బెల్లంపల్లిలో 998, మందమర్రిలో 4,838, శ్రీరాంపూర్‌లో 9,149, నైనీలో నలుగురు ఓటర్లు ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి 11 కౌంటింగ్‌ సెంటర్లను అందుబాటులో ఉంచింది రీజినల్ లేబర్ కమిషన్.

.

.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×