EPAPER

Singareni Elections : కోల్ బెల్ట్ వార్.. సలార్‌ను మించి..

Singareni Elections : కోల్ బెల్ట్ వార్.. సలార్‌ను మించి..

Singareni Elections : సింగరేణి కార్మిక సంస్థల ఎన్నికలంటే కార్మికుల సంక్షేమం కోసం జవాబుదారీ తనం తీసుకొచ్చేందుకే. అయితే గత టర్మ్ లో మాత్రం అదేదీ జరగలేదని, అధికారం అండతో బీఆర్ఎస్ అనుబంధ సంఘం రెచ్చిపోయిందని మిగితా సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతి పనికి రేటు కట్టారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు మాత్రం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి పూర్తిగా ఎదురుగాలి ఉందంటున్నారు.


సింగరేణి ఎన్నికల్లో సత్తా చాటుతామన్న ధీమాలో INTUC నేతలు ఉన్నారు. దీనికి సంకేతంగా ఆ సంఘంలోకి చేరికలు కూడా పెరిగాయి. 1998 నుంచి సింగరేణిలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. 1998 నుంచి వరుసగా రెండుసార్లు ఏఐటీయూసీ విజయం సాధించగా.. 2003లో INTUC గెలిచింది. ఈ సంఘానికి అదే చివరి గెలుపు. కానీ ఈసారి సీన్ మార్చేస్తామంటున్నారు. 2007లో మరోసారి ఏఐటీయూసీ గెలవగా.. 2012, 2017 ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండుసార్లు గెలిచింది. 2017లో టీబీజీకేఎస్ రెండేళ్ల కాలపరిమితితో విజయం సాధించగా, తర్వాత పదవీ కాలాన్ని నాలుగేళ్లకు పెంచాలని టీబీజీకేఎస్ ​కోర్టును ఆశ్రయించింది.

కోర్టు నాలుగేళ్లకు పొడిగించగా, పదవీ కాలం పూర్తయినా ఎన్నికలు నిర్వహించలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తే ఆ ప్రభావం ఆరు జిల్లాల్లోని 11 అసెంబ్లీ స్థానాలపై పడుతుందనే భయంతో బీఆర్ఎస్​ ఎన్నికలను వాయిదా వేయిస్తూ వచ్చింది. కాలపరిమితి ముగిసినా టీబీజీకేఎస్ ​గుర్తింపు హోదాలో కొనసాగడంపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి పెంచింది. పైగా కోల్ ​బెల్ట్ ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులకు సింగరేణిలో ప్రొటోకాల్ ​వర్తింపజేయడం, ఏటా 2కోట్ల చొప్పున అభివృద్ధి కోసం ఫండ్స్ ​కేటాయించడం, సింగరేణి ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్ ​టీ, సీఎస్​ఆర్ ఫండ్స్ ​ను మళ్లించడం వంటి చర్యలపై కార్మికులు గుర్రుగా ఉన్నారు. దీంతో ఈసారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ​కు ఓటమి తప్పదని తేల్చేశారు.


సింగరేణి కార్మికులు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జై కొట్టారు. సింగరేణి కార్మికులు ఉన్న స్థానాల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పరిధి కార్మిక క్షేత్రాల్లోని 12 నియోజకవర్గాలతోపాటు కార్మకులు ప్రభావితం చూపే నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను సాధించి కాంగ్రెస్ పట్టునిలబెట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 స్థానాల్లో సిట్టింగులకే టికెట్లు ఇచ్చింది. కానీ.. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. 9 స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో సీపీఐ గెలిచాయి. దీంతో ఇప్పుడు జరగబోయే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అనుబంధ సంఘం గెలుపు ఖాయమంటున్నారు.

గోదావరి, ప్రాణహిత నదీ తీర ప్రాంతంలో 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో సింగరేణి బొగ్గు గనులున్నాయి. ఈ ప్రాంతమంతటినీ కోల్‌బెల్ట్ గా పిలుస్తారు. తెలంగాణలోని 6 జిల్లాల పరిధిలో ఈ కోల్ బెల్ట్ విస్తరించి ఉంది. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 42 వేల మంది కార్మికులున్నారు. వీరితో పాటు 20 వేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు కూడా పనిచేస్తున్నారు. 60 వేల మందికిపైగా పెన్షనర్లున్నారు. వీళ్ల బాధలు ఒక్కటి కాదు. సమస్యలు తీరుస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదని, హామీలు ఇచ్చి వదిలేశారని సింగరేణి కార్మికులు ఆరోపించారు. ఏళ్లకేళ్లు పెండింగ్ లో ఉన్న వాటిని కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.

ఇన్‌కం ట్యాక్స్ రూపంలో కార్మికుల నుంచి భారీ మొత్తంలో కేంద్రం రాబట్టుకుంటోందని కార్మికులు అంటున్నారు. తాజాగా కోల్ బెల్ట్ ఏరియాలో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ గాంధీ కూడా ఐటీ మినహాయింపు హామీ ఇచ్చి వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా సింగరేణి కార్మికుల ఐటీ మినహాయింపు విషయంపై చాలా సార్లు హామీలు ఇచ్చి వెళ్లారు. సింగరేణి కార్మికులంటే బోర్డర్‌లో జవాన్లు అని, జవాన్లకు లేని ఇన్‌కం ట్యాక్స్ సింగరేణి కార్మికులకు ఎందుకు అని కేసీఆర్ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఇది కేంద్రం పరిధిలోని విషయమే అయినా.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు దిశగా కేసీఆర్ ఎన్నడూ ప్రయత్నాలు చేయలేదన్న విమర్శలున్నాయి.

ఎక్కువ పనిగంటలు ఉంటున్నాయని, మెకనైజేషన్ తో ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయని, కాంట్రాక్ట్ నియామకాలు, అవుట్ సోర్సింగ్ వంటి సమస్యలు కార్మికుల ముందున్నాయి. అటు సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు కూడా పింఛను విషయంలో తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా వేతన సవరణ అమలు కాకపోవడంతో పాత పింఛన్లే వస్తున్నాయని, కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ లో సమస్యలున్నాయంటున్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికులకు మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదని కొన్ని సంఘాల నాయకులు అంటున్నారు.

ఒక్కరోజు సర్వీస్ మిగిలి ఉన్నవారిని కూడా కారుణ్య నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటామని గతంలో ఇచ్చిన కేసీఆర్ హామీ అమలు కాలేకపోయిందన్ననారు. పేర్లు తేడా ఉన్నవారికి అసలు పేర్లతో క్రమబద్ధీకరిస్తామన్న హామీ కూడా చేయలేదంటున్నారు. కొత్తగా భూగర్భ గనులు ఏర్పాటుచేసి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామన్నారు కానీ, ఈ పదేళ్లలో కొత్త గని ఒక్కటి కూడా రాలేదని కార్మిక సంఘాల నేతలు కార్మికులు గుర్తు చేస్తున్నారు. పేరు మార్పు సహా పెండింగ్ హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హామీలు ఇచ్చారు.

కారుణ్య నియామకాలు చేపడతామని, ఒక్క డిపెండెంట్ ఉద్యోగం కూడా పోనివ్వబోమని మాజీ సీఎం కేసీఆర్ చెప్పడంతో వేల మంది కార్మికులు తమ వారసులకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ, సింగరేణి యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్న రూల్స్ ప్రకారం చాలా కొద్దిమందికే అవకాశం దొరుకుతోందంటున్నారు కార్మికులు. సింగరేణి సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 3 వేల కోట్లు రాయల్టీ రూపంలో జమ అవుతోందని, కార్మికులు చెల్లించే ఇన్‌కం ట్యాక్స్‌ను అందులోంచి రీఎంబర్స్ చేయాలన్న డిమాండ్లు కార్మికుల నుంచి ఉన్నాయి. సింగరేణి కార్మికుల పీఎఫ్ లో సమకూరిన మొత్తాలపై వచ్చే వడ్డీపైనా ఇన్‌కం ట్యాక్స్ పడుతోందని, వార్షిక వడ్డీ 2.5 లక్షలు దాటితే దానిపై పన్ను చెల్లించాల్సి వస్తోందంటున్నారు. ఈ పన్నులో రాయితీ రావాలంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వాలని గుర్తు చేస్తున్నారు.

అలాగే కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చినా.. ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఇవ్వలేదని కొన్ని కార్మిక సంఘాలు అంటున్నాయి. సింగరేణిలో సుమారు 49,500 క్వార్టర్లు ఉన్నాయని, 35 వేల మంది కార్మికులు క్వార్టర్లలో ఉంటుండగా 14,500 క్వార్టర్లు అన్యాక్రాంతమయ్యాయంటున్నారు. సింగరేణి సంస్థకు ఉన్న 12 వేల ఎకరాలలో కార్మికులకు స్థలాలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. అటు ప్రైవేటు కంపెనీలకు కోల్ మైనింగ్ అవకాశం కల్పించేలా ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వల్ల సింగరేణి సంస్థ మనుగడకు ప్రమాదమేర్పడుతోందన్న ఆందోళనలో కార్మికులు ఉన్నారు.

విద్యుత్ సంస్థలతో పాటు సింగరేణి సంస్థలో జరిగిన కుంభకోణాలపైనా జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేండ్లు ఒకే వ్యక్తి సీఎండీలో కొనసాగారన్నారు. ఈ క్రమంలో వేల కోట్లు మిస్ యూజ్ చేశారని, వెంటనే దీనిపై విచారణ చేయించాలని కోరారు. సింగరేణికి ట్రాన్స్ కో నుంచి 17వేల కోట్లు, జెన్​ కో నుంచి 12వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం సింగరేణి కార్మికులందరికీ ఇంటి జాగ కేటాయించాలన్నారు కూనంనేని.

టీబీజీకేఎస్ లీడర్లు ప్రతి పనికి రేటు పెట్టడం, పైరవీ లేనిదే గనుల్లో ఏ చిన్న పని కాదనే దుస్థితికి తీసుకొచ్చారని కార్మికులు ఆరోపిస్తున్నారు. 2014, 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా, 2012, 2017లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్​కు కార్మికులు పట్టం కట్టారు. అయితే 2012 నుంచి టీబీజీకేఎస్ ​నేతల అవినీతి, అక్రమాలు, దందాలు మొదలయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల సింగరేణి ఆఫీసర్లపై ఒత్తిళ్లు తీసుకొచ్చి వందలాది ఖాళీ క్వార్టర్లను బీఆర్ఎస్ పార్టీ, యూనియన్​ లీడర్లు, అనుచరులకు కట్టబెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో సీనియర్, అర్హులైన సింగరేణి కార్మికులకు క్వార్టర్లు దక్కకుండా పోయాయంటున్నారు.

రాష్ట్ర విద్యుత్​ సంస్థలు సింగరేణికి 29 వేల కోట్లకు పైగా బాకీ పడడంపై రాష్ట్ర సర్కారు సీరియస్‌‌గా ఫోకస్‌‌ పెట్టింది. బకాయిలు ఇంతలా పేరుకుపోవడానికి కారణాలు ఏమిటని ఆరా తీస్తోంది. గత పదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు అనుసరించిన విధానాల వల్ల సింగరేణి దివాలా తీసిందనే ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ సంస్థలు బకాయిలు పడ్డ వేల కోట్లను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలున్నాయి. దీంతో ట్రాన్స్ ​కో, జెన్​కో సంస్థల బాకీలు పెరిగిపోయాయి. కోల్ బకాయిలు 14 వేల కోట్లు, కరెంటు బకాయిలు 15 వేల కోట్లు కలిపి మొత్తం 29 వేల కోట్లకు పైగా సింగరేణికి బాకీ పడ్డాయి.

డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ , కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరిట వందల కోట్ల ఫండ్స్ ​ను పక్కదారి పట్టించారంటున్నారు. సీఎస్సార్ కింద ఏటా 250 కోట్లను ఖర్చు పెట్టారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టాల్సిన ఈ ఫండ్స్ ​ను మిగితా నియోజకవర్గాలకు మళ్లించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విద్యుత్​ సంస్థల నుంచి బకాయిలు రాకపోవడం, ఫండ్స్ ​ను దారిమళ్లించడం వల్ల సింగరేణి కార్మికులకు జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందంటున్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడే నాటికి సింగరేణికి 3,450 కోట్ల బాండ్స్, బ్యాంక్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌లు ఉండగా.. ప్రస్తుతం 5 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయంటున్నారు. కార్మికులకు, ఉద్యోగులకు నెలకు 250 కోట్ల జీతాలు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఇవి ఇవ్వలేక… బాండ్లు కుదువపెట్టడంతో పాటు బ్యాంకుల దగ్గర సంస్థ అప్పులు చేస్తోంది. ప్రతి నెల అప్పులు తెస్తే తప్ప కార్మికులకు, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితికి సింగరేణి చేరుకుందంటున్నారు కార్మికులు. మొత్తంగా ఈసారి తీవ్ర వ్యతిరేకతను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎదుర్కొంటోంది. అందుకే పోటీ చేసి ఘోరంగా ఓడిపోవడం కంటే పోటీకి దూరంగా ఉండడమే బెటర్ అన్న పరిస్థితికి వచ్చారు.

.

.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×