Sharmila : ఖమ్మం జిల్లా పర్యటనలో YSRTP అధ్యక్షురాలు షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతుండగా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పక్కనున్న వారు వెంటనే అప్రమత్తమై.. ఆమెను కింద కూర్చోబెట్టారు. కొంచెం స్పృహలోకి వచ్చాక మంచినీళ్లు అందించారు. దీంతో షర్మిల తేరుకున్నారు.
ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. పొలాల్లోకి వెళ్లి.. దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి.. వారి సమస్యలు విన్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని షర్మిలకు రైతులు చెప్పుకున్నారు.పెట్టుబడి కూడా రాక అప్పులపాలయ్యామని తెలిపారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని షర్మిల మండిపడ్డారు. ఫసల్ బీమా అమలు చేయడం లేదని ఆరోపించారు. మార్చి నెలలో కురిసిన వర్షాలకు. .2 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పటికీ రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కేసీఆర్ గాలి మోటార్ లో వచ్చి గాలి మాటలు చెప్పారని విమర్శించారు. ఏప్రిల్ 29న వరంగల్ జిల్లాలోనూ షర్మిల పర్యటించారు. రైతుల వద్దకు వెళ్లి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.