పంచాయితీరాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం ఒకేసారి జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పీఆర్, ఆర్డీ శాఖల్లో దాదాపు 8వేల ఉద్యోగులు ఉన్నారు. వారికి ఎంత వేతనం చెల్లిస్తున్నారో వివరాలు సేకరించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో ఇప్పటికే అధికారులు లిస్ట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల ఫైల్ సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపగా అనుమతి రావడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం సమయానికి జీతాలు అందనున్నట్టు సమాచారం.
ALSO READ: ఒవైసీ దెబ్బకు బీఆర్ఎస్ క్లోజ్?
దీనికోసం ఆన్ లైన్‌లో ఏకకాలంలో జీతాలు చెల్లించేలా కొత్త విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారట. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 92వేల మందికి లబ్ది చేకూరనుంది. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, ఉపాధిహామీ పథకం ఇలా వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారందరికీ సమయానికి జీతాలు అందుతాయి. వీరికి ప్రతినెలా రూ.117 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులప్పుడే వీరి జీతాలకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమయానికి జీతం రాక ప్రభుత్వ ఉద్యోగులే ఇబ్బంది పడినట్టు వార్తలు వచ్చాయి.
పదిహేనవ తేదీ వరకు జీతాలు అందకపోవడంతో ఉద్యోగుల్లో వ్యతిరేకత మొదలైంది. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియక ఆందోళన చెందారు. పలుమార్లు వీరు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల ముందు సమయానికి జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరవాత మొదట ఉద్యోగులకే ప్రియారిటీ ఇస్తూ ఒకటో తారీఖునే జీతాలు వేస్తోంది. ఇక ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం సమయానికి జీతాలు ఇస్తామని ప్రకటించడంతో సంబురాలు చేసుకుంటున్నారు.