Big Stories

BJP : తెలంగాణలో టీడీపీతో పొత్తు ..? బీజేపీ వ్యూహమిదేనా..?

BJP : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఏపీలోనే కాదు తెలంగాణలోనూ పొలిటికల్ హీట్ ను పెంచింది. పొత్తులపై చర్చకు తెరలేపింది. శనివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారు. వారితో 50 నిమిషాలపాటు చర్చలు జరిపారు.

- Advertisement -

2018లో ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటికొచ్చింది. ఆ తర్వాత అమిత్ ‌షాతో చంద్రబాబు భేటీ కావడం ఇదే తొలిసారి. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపింది. మరో 6 నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడాదిలోపే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దీంతో అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు భేటీ కావడం మరింత ఆసక్తిని పెంచింది.

- Advertisement -

తొలుత చంద్రబాబు ఒక్కరే ఢిల్లీలోని కృష్ణ మీనన్‌ మార్గ్‌లోని అమిత్ ‌షా ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి వచ్చారు. ముగ్గురు నేతలు దాదాపు 50 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. అయితే భవిష్యత్తులో కలిసి పనిచేయడంపై చర్చించారా? అనే అంశంపై స్పష్టత మాత్రం రాలేదు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీతో టీడీపీకి పొత్తు ఉంటుందనే ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలన్నీ ఊహాగానాలే అని బీజేపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఊహాజనిత కథనాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

అమిత్‌ షా, జేపీ నడ్డాను టీడీపీ అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో మమత, స్టాలిన్‌, నితీశ్‌ కూడా మోదీ, అమిత్‌ షాను కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతలను, ప్రజలను కలవకుండా ఉండే పార్టీ బీజేపీ కాదన్నారు. కేసీఆర్‌ మాదిరిగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ బీజేపీ కాదని స్పష్టంచేశారు. కానీ టీడీపీతో పొత్తు ఉంటుందని కాని ఉండదని కాని బండి సంజయ్ తేల్చి చెప్పలేకపోయారు.

కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ బీజేపీలో జోష్ తగ్గింది. గతంలో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన నేతలు వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యమని ఇన్నాళ్లు బీజేపీ నేతలు స్పష్టం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అధికారం మాట పక్కన పెడితే పార్టీ ఉనికే ప్రశ్నార్థంగా మారింది. అందుకే బీజేపీ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. గతంలో తెలంగాణలో టీడీపీ బలమైన పార్టీ. రాష్ట్రం విడిపోయిన సమయంలోనూ 15 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి క్యాడర్ ఉంది. అందుకే బీజేపీ అధిష్టానం పెద్దలు టీడీపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారా..? ఇందుకోసమే చంద్రబాబుతో భేటీ అయ్యారా..? పొత్తులపై చర్చించారా? ఈ అంశాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News