Jagityal Crime News: ఈ చోరీ అలాంటి, ఇలాంటి చోరీ కాదు. చరిత్రలో నిలిచిపోయే చోరీ. చోరీకి పాల్పడిన తీరును చూసి ఆ ఇంటి యజమాని సైతం నివ్వెర పోయారు. అంతేకాదు స్థానిక ప్రజలందరూ.. సూపర్ చోరీ.. అంటూ కితాబిస్తున్నారు. మొదటగా చోరీ జరిగిందని భయాందోళనకు గురైన యజమాని, ఆ తర్వాత చిరునవ్వులు చిందించాడు. అసలేం జరిగిందంటే?
జగిత్యాల జిల్లాలోని గోవిందపల్లి భాగ్యనగర్ వీధిలో, పెగడపల్లి మండలం మద్దతుల గ్రామానికి చెందిన మునిగోటి సత్యం రావు గత కొన్ని నెలలుగా, అద్దె భవనంలో నివాసం ఉంటున్నారు. అయితే అత్యవసర పనుల నిమిత్తం నిన్న రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లారు సత్యం రావు. గురువారం ఉదయాన్నే ఇంటికి చేరుకోగానే, పగలగొట్టిన తాళాన్ని గుర్తించి షాక్ కు గురయ్యారు. ఇంటి తాళాన్ని పగలగొట్టి ఉండడంతో, చోరీ జరిగిందని హడావుడిగా ఇంటిలోకి వెళ్లి , దొంగలు ఏమేమి తీసుకెళ్లారో గమనించారు.
అయితే ఇంటిలో ఉన్న బంగారపు ఆభరణాలు ఉన్నాయా లేవా అంటూ తనిఖీ చేసి, చివరికి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు, అసలు ఏమి పట్టుకెళ్లారో అర్థం కాని పరిస్థితి ఆయనది. చివరికి పోలీసుల వరకు విషయం వెళ్ళింది. చోరీ జరిగిందనగానే, పోలీసులు కూడా హడావుడిగా ఇంటి వద్దకు చేరుకున్నారు. మొత్తం తనిఖీ చేశారు.. ఇంటిలోని నగదు కూడా ఎక్కడ ఉందో అక్కడే ఉంది. ఇలా బంగారము చోరీ కాలేదు.. నగదు చోరీ కాలేదు.. అసలు దొంగలు ఇంటిలోనికి ప్రవేశించి ఏమి చోరీ చేశారనేది ప్రశ్నార్ధకంగా మారింది.
అప్పుడు అసలు విషయం తెలిసింది అందరికీ. అందరూ పకపకా నవ్వారు. ఇంటి యజమాని, సత్యం రావు, స్థానికులు చోరులు ఎత్తుకెళ్లిన వాటి గురించి తెలుసుకుని నివ్వెర పోయారు. చోరీ జరగడం ఏమో కానీ.. చోరీకి గురైన వాటి గురించి తలుచుకొని అందరూ నవ్వుకున్నారు. అయితే చోరీకి పాల్పడింది మంచి దొంగలుగా కొందరు చర్చించుకుంటే, మరికొందరు విలువైన వస్తువులను వదిలి, వాటిని చోరీ చేయడం ఏమిటని ఆశ్చర్యపోయారు. ఇంతకు దొంగలు సత్యం రావు ఇంటిలోకి ప్రవేశించి ఏమేమి చోరీ చేశారో తెలుసా.. ఒక జత చెప్పులు.. రెండు మద్యం సీసాలు. ఈ మాట విని నవ్వు ఆపుకుంటున్నారా.. వద్దు వద్దు నవ్వేసేయండి.