EPAPER
Kirrak Couples Episode 1

Hyderabad: ఇంకెంతమంది చావాలి? హైదరా’బ్యాడ్ రోడ్స్..

Hyderabad: ఇంకెంతమంది చావాలి? హైదరా’బ్యాడ్ రోడ్స్..
hyderabad roads

Hyderabad: హైదరాబాద్ నగరంలో రోడ్లు నరకానికి నకళ్లుగా మారిపోయాయి. గజానికో గుంతతో జనం ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా ప్రాణాలే పోయేదాకా పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో ఇద్దరు విద్యార్థినులు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్లు కంకర తేలి, భయంకరంగా మారినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. అప్పటికప్పుడు టెంపరరీ రిపేర్లు తప్ప ఉపయోగం లేదు. ఎందుకీ నిర్లక్ష్యం?


హైదరాబాద్ గుంతల రోడ్లకు ఈ ఇద్దరు పిల్లలు అన్యాయంగా అకారణంగా బలయ్యారు. మొన్నటిదాకా వర్షాలతో తడిసిన రోడ్లు.. గుంతలుగా మారి ఇప్పుడు రక్తంతో తడుస్తున్నాయి. అవును గుంతలు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం ఇద్దరు పిల్లలను బలి తీసుకుంది. అభంశుభం తెలియని ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

బౌరంపేట్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో దీక్షిత మూడో తరగతి చదువుతోంది. రోజులాగే తండ్రి స్కూటీపై బయల్దేరింది. బండి బాచుపల్లి రెడ్డీస్ ల్యాబ్ దగ్గరికి వెళ్లే సరికి అక్కడి గుంత కారణంగా స్కిడ్ అయింది. తండ్రి కూతురు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వస్తున్న స్కూల్ బస్ పాపపై నుంచి వెళ్లింది. తండ్రి కళ్ల ముందే చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. నడిరోడ్డుపై చిన్నారి ప్రాణం ఎంత విలవిలలాడిందో. ఎనిమిదేళ్లకే నూరేళ్లు నిండాయా అని చూసిన వారంతా అయ్యో పాపం అన్నారు. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కానీ కదలాల్సిన యంత్రాంగాన్ని ఈ ఘటన కదిలించలేకపోయింది. అదే దారుణం. బస్సు అతివేగం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు అన్నారు. గుంతల రోడ్డుతోనే జరిగిందని స్థానికులు చెబుతున్నారు.


ఇక, కూకట్ పల్లిలో డిగ్రీ చదువుతోంది వైష్ణవి. రోజూ తండ్రి బోయిన్ పల్లి బస్టాప్ లో దింపి వెళ్తుంటారు. బోయిన్ పల్లి చెక్ పోస్ట్ దగ్గర MMR గార్డెన్ దాటాక స్కూటీ అదుపు తప్పి రోడ్డు కిందికి దిగింది. తిరిగి రోడ్డుపైకి ఎక్కిస్తుండగా గుంతను తప్పించబోయి తండ్రీ కూతుళ్లు రోడ్డుపై పడిపోయారు. అదే టైంలో వెనక నుంచి వచ్చిన డీసీఎం ఒక్కసారిగా వైష్ణవిని ఢీకొట్టింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వైష్ణవిని సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఐసీయూకి తరలిస్తుండగా.. నాన్న ఎలా ఉన్నాడంటూ చివరిసారిగా డాక్టర్లను అడిగి కోమాలోకి వెళ్లిపోయింది. తన బాధను ఓర్చుకుంటూ.. చివరి క్షణంలో తండ్రి గురించి అడగడం అక్కడున్న వారి హృదయాలను కలిచివేసింది. చికిత్స పొందుతూ కున్నుమూసింది వైష్ణవి.

ఇవి హైదరాబాద్ లో ఒకే రోజు జరిగిన రెండు విషాద ఘటనలు. భారీ వర్షాలకు సిటీ రోడ్లు నరకప్రాయంగా మారిపోయాయి. ఇంటి నుంచి బయటికెళ్లిన వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునేదాకా గ్యారెంటీ లేకుండా పోతోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం 20 వేలకు పైగా గుంతలు పడ్డట్లు ప్రాథమిక అంచనా. గ్రౌండ్ రియాల్టీలో ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. సిటీలో రోడ్డు ప్రమాదం జరగని రోజంటూ ఉండడం లేదు. ఇందుకు కారణాలు ఏవైనా.. ప్రస్తుతం గుంతల రోడ్లే జనం ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఆరోగ్యం పాడవుతోంది. వాహనాలు దెబ్బతింటున్నాయి. రోడ్లను సరిగా నిర్వహించలేకపోతున్న జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలతో పాటు శివారు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

హైదరాబాద్ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రోడ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. నిజాంపేట, జవహర్‌నగర్‌, బండ్లగూడజాగీర్‌, పీర్జాదిగూడ, బోడుప్పల్‌, బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లు, నార్సింగి, మణికొండ, పెద్దఅంబర్‌పేట, జల్‌పల్లి మున్సిపాలిటీల్లో రోడ్లు చాలా చోట్ల దారుణంగా మారాయి. కొన్ని చోట్ల పనులు జరుగుతున్నా.. చాలా చోట్ల నిర్వహణకు నోచుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే.. రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చేందుకు కూడా నిధులు లేవన్న సమాధానం అధికార యంత్రాంగం దగ్గర్నుంచి వినిపిస్తోంది. ఇటీవలి వర్షాలకు రోడ్లు మరింత దారుణంగా మారిపోయాయి. టూ వీలర్ పై వెళ్లే వారి ఒళ్లు హూనమవుతోంది. నిజాంపేట కార్పొరేషన్‌, దుండిగల్‌ మున్సిపాలిటీల్లో గతంలో మేజర్‌ పంచాయతీలుగా ఉన్నప్పుడు నిర్మించిన రోడ్లను విస్తరించారు. కొత్త రోడ్లు నిర్మించలేదు. జనాభా అవసరాలకు తగ్గట్లుగా కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో హెచ్‌ఎండీఏ రోడ్లు నిర్మిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిల్లో కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. బడంగ్‌పేట – మీర్‌పేట మధ్య రోడ్ల విస్తరణ లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్‌ ప్రధాన రోడ్లు మినహా ఇతర రోడ్లన్నీ గుంతలమయంగానే ఉన్నాయి.

హైదరాబాద్ లో 811 కిలోమీటర్ల ప్రధాన రహదారులను ఐదేళ్లు గుంతల్లేకుండా చూసుకోవాలని జీహెచ్‌ఎంసీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చింది. అందుకు 1850 కోట్ల రూపాయలు చెల్లించాలనేది ఒప్పందం. రెండేళ్లు ఆయా రోడ్లను కాంట్రాక్టర్లు మెరుగ్గా నిర్వహించారంటున్నారు. ఆ తర్వాత ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు. ప్రైవేటు నిర్వహణకు ఇచ్చిన రోడ్లు మినహా.. మిగిలిన 8,500 కిలోమీటర్ల రోడ్లను జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తోంది. వాటిని మెరుగ్గా ఉంచేందుకు ఏటా 800కోట్లు ఖర్చు చేస్తున్నా.. తారు రోడ్ల నాణ్యత దారుణంగా పడిపోయింది. పైగా జలమండలి, జీహెచ్‌ఎంసీ మధ్య పూర్తిగా సమన్వయం లోపం కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీ రోడ్లు వేస్తే.. జలమండలి కాంట్రాక్టర్లు తవ్వేస్తున్న పరిస్థితి ఉంది. రోడ్ల రిపేర్లకు ఇప్పటికే 1100 కోట్ల చెల్లించారు కూడా అయినా… అవి కూడా కంకర తేలి, గుంతలు పడ్డాయి.

ఇటీవలి వర్షాలకు నగరంలోని రోడ్ల క్వాలిటీ పూర్తిగా పడిపోయింది. నగరవ్యాప్తంగా 20వేలకు పైగా గుంతలు ఏర్పడ్డాయని ఇంజినీర్లు అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటిని వెంటనే పూడ్చుతామని ప్రకటించగా, రిపేర్లను కాంట్రాక్టర్లు మమ అన్నట్లుగా చేస్తున్నారు. మరోసారి వర్షం పడితే ఆయా ప్రాంతాల్లో మళ్లీ మోకాల్లోతు గుంతలు ఏర్పడతాయంటున్నారు స్థానికులు. సిటీలో చాలా వరకు రోడ్లు డ్యామేజ్ అయి కనిపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది. చిన్న వర్షం పడ్డా ట్రాఫిక్ జామ్ లకు ఈ గుంతలు కూడా కారణమవుతున్నాయి. ట్రాఫిక్ నెమ్మదించడం వరకు ఓకేకానీ.. ఇప్పుడు ప్రాణాలు పోయే దాకా పరిస్థితి రావడమే దారుణం.

Related News

TDP VS BJP: కూటమిలో చిచ్చు పెట్టిన కమిషనర్‌! ఆ అధికారి ఎవరు ?

BRS Leaders: ఏదో చేద్దాం అనుకున్నారు కానీ.! అడ్డంగా బుక్కయ్యారు

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Big Stories

×