RevanthReddy: ప్రగతి భవన్ గోడలు కూల్చుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అక్రమాలకు, పార్టీ ఫిరాయింపులకు ప్రగతిభవన్ అడ్డాగా మారిందని మండిపడ్డారు.
రాజ్యాలను కూల్చి, రాచరికాన్ని బొందపెట్టిన ఘనత తెలంగాణ పౌరుషానిదని రేవంత్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 మీటర్ల గొయ్యితీసి పాతిపెట్టాలని తన దగ్గర బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారని చెప్పారు. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి.. కొత్త సంవత్సరంలో ప్రగతి భవన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సవాల్ చేశారు రేవంత్ రెడ్డి.
ప్రగతి భవన్ అనే గడిలోకి సామాన్యులకు ఎందుకు ప్రవేశం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు, కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందని ఆరోపించారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కేసులు పెడుతున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు రేవంత్.
“తెలంగాణలో ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు.. 8వ తారీఖు వచ్చినా జీతాలు లేవు.. అప్పుల బాధతో 29 మంది రైతులు పురుగుల మందు తాగి చనిపోయారు.. నకిలీ విత్తనాలతో రైతులను మోసగించిన వారిపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టరు? జనవరి 1, 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిస్తాం.. భూ నిర్వాసితులకు పరిహార బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది.. పోలీసు ఉద్యోగులకు వారంలో ఒక రోజు సెలవు కల్పిస్తాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.
హాథ్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర 3వ రోజు పెనుగొండ నుంచి ఈదులపూసపల్లి, మహబూబాబాద్ వరకు సాగింది. పాదయాత్రలో ప్రజలు తనతో ఎన్నో సమస్యలు చెప్పుకున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.