EPAPER

CAG Report : అడుగు అడుగునా నిర్లక్ష్యం.. కాగ్ నివేదికే సాక్ష్యం..!

CAG Report : అడుగు అడుగునా నిర్లక్ష్యం.. కాగ్ నివేదికే సాక్ష్యం..!

Telangana Assembly : గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల మీద తాజాగా విడుదలైన కాగ్ నివేదిక సంచలన వాస్తవాలను బయటపెట్టింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి జరిగిన పలు అక్రమాలను, ఉద్దేశపూర్వకంగా జరిగిన ఆర్థిక మోసాలను ఈ నివేదిక ఎండగట్టింది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరు అయిన హైదరాబాద్ నగరపు అభివృద్ధి, నిర్వహణ, ప్రజా రవాణా వ్యవస్థల ఏర్పాటులో గత ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం క్షమించలేని రీతిలో ఉందని వ్యాఖ్యానించింది. ఈ నిర్లక్ష్యం కారణంగా జీహెచ్‌ఎంసీ వందల కోట్ల రూపాయలు నష్టపోగా, మెట్రో రైలు, పలు ప్రైవేటు ఏజెన్సీలు ఆ లాభాన్ని ఆయాచితంగా పొందాయని కాగ్ నివేదిక బయటపెట్టింది. ఆ నివేదికలోని కొన్ని కీలక అంశాలు..


హైదరాబాద్ మెట్రో రైలు

ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో పేర్కొన్న విధంగా ఎల్ అండ్ టీ నిర్వహణలోని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ.. మెట్రోరైలు స్టేషన్లు, పార్కింగ్‌ ప్రదేశాలను అభివృద్ధి చేయలేదని, ముఖ్యంగా ఆస్తి విలువ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో తక్కువ విస్తీర్ణంలోనే మెట్రో స్టేషన్లు నిర్మించారని, ఇది ఒప్పందానికి వ్యతిరేకమని బయటపెట్టింది. అయినా.. నాటి ప్రభుత్వ అధికారులు దీని గురించి ప్రశ్నించలేదని వెల్లడించింది. దీని ద్వారా మైట్రో రైలు సంస్థ రూ.227.19 కోట్ల మేర డబ్బు మిగుల్చుకుందని తెలిపింది.


ముందు కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాలను పక్కనబెట్టేసి ఇష్టారాజ్యంగా మెట్రో రైలు చార్జీల పెంపు జరిగిందని, ఈ విషయంలోనూ ప్రభుత్వం జోక్యంచేసుకోలేదని నివేదిక ఆక్షేపించింది. దీంతో సదరు మెట్రో రైలు సంస్థ 2017 నవంబరు నుంచి 2020 మార్చి వరకు రూ.213.77 కోట్ల రూపాయల అదనపు రాబడిని ప్రయాణికుల నుంచి రాబట్టుకుందని, ఈ అవకతవకల కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.253.80 కోట్ల సర్దుబాటు వ్యయనిధి నిధులు రాకుండా పోయాయని వివరించింది.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మెట్రో రైలు యార్డు కోసం ఎకరానికి కేవలం లక్షన్నర రూపాయల అద్దె మాత్రమే నిర్ణయించటం మీద కాగ్ నివేదిక ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మార్కెట్‌ విలువలో 10 శాతాన్ని అద్దెగా ఉండాలని నాటి భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ చెప్పినా దానిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక.. ఈ యార్డు అద్దె బకాయిల విషయానికి వస్తే… మార్చి 2020 నాటికి ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ రూ.95. 47 కోట్లు చెల్లించాల్సి ఉందని కాగ్ నిగ్గు తేల్చింది.

మెట్రోకు 17 చోట్ల పార్కింగ్‌, టీవోడీ అభివృద్ధికి 57 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. రాయదుర్గంలో ప్రభుత్వం కేటాయించిన భూమి ఉన్నప్పటికీ.. నేటికీ అక్కడ పార్కింగ్ సౌకర్యం కలిగించలేదు. ఇదిగాక.. మరో 42 స్టేషన్లలో నేటికీ పార్కింగ్‌ సదుపాయం లేనేలేదని కాగ్ నివేదిక తెలిపింది. అలాగే.. సుల్తాన్‌బజార్‌ వంటి ప్రాంతాల్లో మెట్రో రైలు నిర్మాణం కారణంగా వ్యాపారాలు కోల్పోయిన బాధిత స్ట్రీట్ వెండర్స్‌ కోసం కట్టిన కమర్షియల్ కాంప్లెక్స్‌ను పూర్తిగా అద్దెలకు ఇవ్వలేదని, దీనివల్ల అక్కడ ఖాళీగా ఉన్న షాపుల మూలంగా ప్రభుత్వం రూ.2. 50 కోట్ల ఆదాయం కోల్పోయిందని బయటపెట్టింది.

ఇక.. జూబిలీ బస్ స్టేషన్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో 5.2 కి.మీ. భూసేకరణలో సమస్యలు, ప్రజాప్రతినిధుల వ్యతిరేకతతో మెట్రో నిర్మాణం సగంలో ఆగిపోయిందని, డిపో కోసం ఫలక్‌నుమా వద్ద 21 ఎకరాలు కేటాయించినా దానిని నిర్మాణ సంస్థ వాడుకోలేదని, ఇంత జరిగినా ప్రభుత్వం తరపు నుంచి దీనిపై ఏ సూచన, ఆదేశం జారీ కాలేదన్న విషయాన్ని నివేదిక ఎత్తిచూపింది.

ఒప్పందంలో ప్రయాణికుల సంఖ్య లెక్కింపు అంతా కాకి లెక్కల మాదిరిగా ఉందని, దీనివల్ల మెట్రో రైలు 35 ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వ ఆస్తిగా మారకపోవచ్చని, దీనివల్ల నిర్మాణ సంస్థ లాభ పడుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. మెట్రోకు లీజుకు ఇచ్చిన భూముల్లో ఎల్ అండ్ టీ సంస్థ కట్టిన మాల్స్‌, ఆఫీసులను మెట్రోరైలు ప్రారంభం తర్వాతే లీజుకు ఇవ్వాలని ఒప్పందంలో ఉన్నప్పటికీ.. ఆ సంస్థ ముందే అద్దెలకు ఇచ్చి బోలెడు వెనకేసుకుందని కాగ్ నివేదిక బయటపెట్టింది.

రోజు రోజుకు పెరుగుతున్న నిర్మాణ వ్యయాల నేపథ్యంలో తక్షణం పాతబస్తీ మెట్రో మార్గాన్ని త్వరగా పూర్తిచేయాలని, స్టేషన్ల నిర్మాణంలో అనధికార ఉల్లంఘనలను పట్టించుకోని నాటి అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలనీ, ప్రయాణికుల ఛార్జీలను తాజాగా సమీక్షించేందుకు కమిటీని ప్రభుత్వం చేయాలనీ కాగ్ నివేదిక సూచించింది.

జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం

ప్రధాన ప్రాంతాల్లోని హోర్డింగులు, యూనిపోల్స్‌ లైసెన్సు పునరుద్ధరణ రుసుమును పలు ఏజెన్సీలు కోట్లాది రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఏ చర్యలూ లేవని, జీహెచ్‌ఎంసీ బకాయిలు కట్టని వారి లైసెన్సులను ఎందుకు రద్దు చేయలేదని కాగ్‌ ప్రశ్నించింది. ఇక.. బస్‌షెల్టర్లు, ఇతరత్రా ప్రకటనల తాలూకూ చార్టీల వ్యవహారంమంతా గందరగోళంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చే అధికారులు బీఆర్‌సీ (బేసిక్‌ రెగ్యులరైజేషన్‌ ఛార్జీలు)ని వసూలు చేయటం మానేశారు. దీనివల్ల జీహెచ్‌ఎంసీ ఖజానాకు చిల్లు పడుతూ వస్తోంది. ఉదాహరణకు నార్త్ జోన్‌లోని ఓ హోటల్‌కు ఇచ్చిన పర్మిషన్ విషయంలోనే జీహెచ్‌ఎంసీకి రావాల్సిన రూ.4లక్షల రుసుము చేరనేలేదు. ఆ మొత్తాన్ని అందుకు బాధ్యుడైన అధికారి నుంచి వసూలు చేయాలని కాగ్ నివేదిక సూచించింది.

జలగం వెంగళరావు పార్కు, ఇమ్లిబన్‌ పార్కు, చాచా నెహ్రూ పార్కుల్లో రోజూ వచ్చే సందర్శకుల నుంచి వసూలు చేసే ప్రవేశ రుసుము వసూలు చేసుకునే కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు.. చాలా కాలంగా జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన నిర్ణీత మొత్తాన్ని చెల్లించలేదు.

రెసిడెన్సియల్, కమర్షియల్, గవర్నమెంటు ఆస్తులకు సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలు, పన్ను వసూళ్లను జీహెచ్‌ఎంసీ గాలికి వదిలేసిందని కాగ్ నివేదికలో తేలింది. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని బట్టి.. ఆస్తిపన్నులో 47.91శాతం బకాయిలుండగా, సెల్ఫ్ ఎసెస్‌డ్ టాక్స్ పరిధిలోని ఆస్తుల తాలూకూ 27 శాతం పన్ను వసూళ్లు పెండింగులో ఉన్నట్లు తేలింది.

మెట్రోరైలు నిర్మాణ సమయంలో హైదరాబాద్ నగరంలోని పలు కరెంటు స్తంభాలను పక్కకు జరిపేందుకు, భూసేకరణ కోసం మెట్రోరైలు సంస్థ.. జీహెచ్‌ఎంసీకి రూ. 956. 18 కోట్లు ఇచ్చింది. ఆ పనులు ప్రారంభించే నాటికి జీహెచ్‌ఎంసీ ఖాతాకు బదిలీ అయిన ఆ మొత్తం మీద బల్దియాకు రూ.26.09 కోట్ల వడ్డీ తోడైంది. కానీ.. దానిని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు ఇవ్వలేదు. దీనిపై నేటికీ జీహెచ్‌ఎంసీ నుంచి సరైన సమాధానమూ లేదు.

ఆస్తి, ఇతర పన్నుల వసూళ్ల విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మాటల్లో చెప్పలేనిదిగా ఉందని కాగ్ నివేదక వెల్లడించింది. ఒక్క 2017-18 సంవత్సరంలో రూ. 82.19 కోట్ల విలువైన 9,601 చెక్కులు చెల్లకుండా పోయినా.. అవి ఇచ్చిన వారి మీద జీహెచ్‌ఎంసీ ఎలాంటి చర్యా తీసుకోలేదని కాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

డబుల్ బెడ్ రూం ఇళ్లు

నిరుపేదలకు నీడ కల్పి్స్తామంటూ గత ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూములు కట్టేందుకు ఓ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన లోన్‌లో కొంత మొత్తాన్ని సదరు బ్యాంకు అకౌంట్‌లో డిపాజిట్ల రూపంలో ఉంచి, మిగతా మొత్తాన్ని సంబంధం లేని పథకాలను ఇష్టారాజ్యంగా మళ్లించారని, ఈ అనాలోచిన నిర్ణయం కారణంగా ఆ బకాయిని గృహ నిర్మాణ సంస్థ చెల్లించాల్సి వచ్చిందని కాగ్ నివేదిక బయటపెట్టింది. 2021 నాటికి కేవలం 48,178 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయిందని, ఆ పూర్తయిన ఇళ్లను కూడా 36 నెలలపాటు లబ్ధిదారులకు అందించకుండా కాలక్షేపం చేసిందని పేర్కొంది.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×