EPAPER

Revanth Reddy : ఒక్కడుగా వచ్చి.. ఒకే ఒక్కడుగా ఎదిగి.. 

Revanth Reddy : ఒక్కడుగా వచ్చి.. ఒకే ఒక్కడుగా ఎదిగి.. 
Revanth Reddy today news

Revanth Reddy today news(Telangana congress news):

ఆనాడు ఎన్టీఆర్‌ చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటే.. జనం వెంట నడిచారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రతో వస్తే ప్రజలు కదిలివచ్చారు. జయలలిత శపథం చేస్తే జనం మెచ్చారు. మరి వాళ్లకున్న చరిష్మాలేదు. సినీ నటుడు అంతకంటే కాదు. రాజకీయాల్లో పెద్దగా తలపండిపోయిన సీనియర్‌ కాదు. ఆజానుబాహుడు అంతకంటే కాదు. అవతార పురుషుడు కాదు. మాంచి ఫామ్‌లో ఉన్న పార్టీ లీడర్‌ కాదు. అయినా ఒక్కడే బలంగా నిలబడ్డాడు. అధికార బలం మందలా మీద పడినా కెరటంలా పైకి లేచాడు. సింహం సింగల్‌గానే వస్తుందని గాండ్రించాడు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక ముందు ఒక లెక్క అని పులిలా మీద పడ్డాడు. ఆనాడు వైఎస్‌ తరహాలోనే మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు నింపాడు రేవంత్‌రెడ్డి.


తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి జనంలో ఉన్న క్రేజ్‌ ఇది. రేవంత్‌రెడ్డి కనిపిస్తే చాలు సీఎం.. సీఎం.. అంటూ జోష్‌తో ఊగిపోయారు. మమ్మల్ని పాలించే నాయకుడు నువ్వేనంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆదిలాబాద్ నుండి అచ్చంపేట దాక.. సిర్పూర్ నుంచి అలంపూర్ దాక.. భద్రాచలం నుండి జహీరాబాద్ దాక.. తాండూర్ నుంచి చెన్నూర్ దాకా.. మధిర నుంచి ముథోల్ దాక.. మక్తల్ నుంచి జుక్కల్ దాక.. తెలంగాణ అంతటా ఒకటే మాట రేవంత్‌.. రేవంత్‌.. రేవంత్‌.. రానున్నది కాంగ్రెస్‌ సర్కారే అని జనం గళమెత్తారు. రేవంత్‌ మాటకు మాట కలిపారు. రేవంత్‌ పాట వినబడితే మైమరచి డాన్సులు చేశారు.

అసలు ఎవరు ఈ రేవంత్‌రెడ్డి అన్న వాళ్లకు ఒక ఉప్పెనలా ఎదురయ్యాడు. ఎక్కడుంది కాంగ్రెస్‌ పార్టీ అన్నవాళ్లను సునామీలా చుట్టేశాడు. కాంగ్రెస్‌తో చీకట్లే అంటే కరెంట్‌లా షాకిచ్చాడు. కారుతో తొక్కిస్తామంటే ముందుకే కదలకుండా పంక్చర్‌ చేసేశాడు. ఎక్కడో పాలమూరు బిడ్డ అక్కడే అడ్డుపడతామంటే ఏయ్‌ బిడ్డా ఇది తెలంగాణ గడ్డ.. నా అడ్డా అని.. గట్టిగా బదులిచ్చాడు. కొడంగల్‌లో పోటీకి రమ్మంటూ కేసీఆర్‌కు సవాల్‌ విసిరాడు. నువ్వు రాకపోతే నేనే వస్తానంటూ కామారెడ్డిలో కదం తొక్కాడు. ఎక్కడిది ఈ రేవంత్‌రెడ్డికి ఇంత తెగువ. ఇంత పట్టుదల అని కాకలు తీరిన రాజకీయ నేతలే నోరెళ్లబెట్టేలా చేశాడు. ఒక్కో మెట్టు దాటుకుంటూ హస్తం పార్టీ విజయానికి బాటలు వేశాడు.


అసలు ఈ కాంగ్రెస్‌ గెలుస్తుందా? ఈ కాంగ్రెస్‌ నేతలు ఒక మాట మీద ఉంటారా? అసలు అందరూ కలుస్తారా? ఒకరు చెబితే వినే రకాలా వీళ్లు..? పార్టీ టికెట్లు వచ్చాక. అసలు కాంగ్రెస్‌ బయటకి వస్తుందని ప్రత్యర్థులు కాచుకు కూర్చున్నారు. కానీ, వాళ్లకు ఈ విషయంలోనూ భంగపాటే ఎదురైంది. టికెట్ల కేటాయింపు.. అలకలు.. ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అయితే రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి అందర్నీ ఏకతాటిపైకి తేవడంలో సక్సెస్‌ అయ్యారు. కాంగ్రెస్ నేతలంతా భిన్నస్వరాలు వినిపించే వాళ్లే అయినా .. అంతా తన వెంటే నడిచేలా చేసుకోవడంలో సక్సెస్‌ సాధించారు. రెబల్స్‌గా నామినేషన్లు వెయించిన వారిని ఉపసంహరించుకునేలా చేయగలిగారు. కుటుంబంలో రెండు టికెట్లు ఆశించిన నాయకులకు కూడా పరిస్థితిని అర్థం చేయించగలిగారు. ఇదేం కాంగ్రెస్‌ అనే పరిస్థితుల నుంచి ఇదేరా కాంగ్రెస్‌ అని నిరూపించాడు రేవంత్‌రెడ్డి.

చేరికలతోనే రేవంత్‌రెడ్డి ముందు నుంచి చక్రం తిప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మొదలైన ఆపరేషన్‌ గద్వాల గడీల వరకు సౌండ్‌ వినిపించేలా చేసింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు నుంచి మొదలై.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి వరకు ముఖ్య నాయకులను తమవైపు తిప్పడంలో రేవంత్‌ పైచేయి సాధించారు. రేఖానాయక్‌ నుంచి అబ్రహం వరకు బీఆర్ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి క్యూ కట్టారంటే అది రేవంత్‌ చూపిన చొరవే. గతంలో రేవంత్‌రెడ్డి పేరు చెప్పి పార్టీని వీడిన వాళ్లు కూడా అతని నాయకత్వంలో పనిచేస్తామని తిరిగి సొంత గూటికి వచ్చారంటే.. రేవంత్‌కి ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసనేది క్లియర్‌గా కనిపించింది.

ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న రేవంత్‌ వ్యూహాల్లో.. అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడం.. వర్గవిభేదాలు తలెత్తకుండా చేయడం.. టికెట్ల కేటాయింపు.. ఇవన్నీ ప్రశాంతంగా జరిగిపోయాయి. రేసు గుర్రాల ఎంపిక పక్కాగా పూర్తిచేశారు. ఇక మిగిలింది మేనిఫెస్టో.. హామీలు మెప్పిస్తే సగం విజయం ఖాయమైనట్లే. అందులోనూ పీసీసీ చీఫ్‌ సక్సెస్‌ అయ్యారు. ఎన్నికలకు ముందే ఆరు గ్యారెంటీలతో రాబోయేది కాంగ్రెస్‌ పార్టీనే అని గ్యారెంటీ ఇచ్చారు. గతానికి భిన్నంగా ఏకంగా కాంగ్రెస్‌ ఎలక్షన్‌ హామీలను గులాబీ అధినేత కాపీ కొట్టగలిగేలా చేశారంటే రేవంత్‌ స్ట్రాటజీ ఎలా వర్కౌట్‌ అయిందో కళ్లకు కడుతోంది. వృద్ధాప్య పెన్షన్‌ పెంపు, 5 వందలకే గ్యాస్‌ సిలిండర్‌, రైతు బంధు పెంపు ఇలా అన్ని స్కీములను బీఆర్ఎస్‌ కాపీ కొట్టి చతికిలిపడేలా చేశారు.

ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ప్రచారం. అందులోనూ రేవంత్‌రెడ్డి ప్రత్యర్థులపై అప్పర్‌ హ్యాండ్‌ సాధించారు. అన్నీ తానై ముందుకు నడిపించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే సహా ముఖ్య నేతలతో పాటు రేవంత్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా వన్‌మెన్‌ ఆర్మీ అనేలా దూకుడు ప్రదర్శించారు. రోజూ నాలుగు సభలు అటెండ్‌ అవుతూ ప్రజలను ఉత్సాహపరిచారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలకు తాను గ్యారెంటీ అని క్లారిటీ ఇచ్చారు. రేవంత్‌ సభలకు జనం భారీగా పోటెత్తారు. ఊకదంపుడు ప్రసంగాలు.. ఉత్త ముచ్చట్లలా కాకుండా రేవంత్‌ ఏం మాట్లాడతారో అనే ఆసక్తి రేకెత్తించారు. కేసీఆర్‌ అవినీతిని ఎండగట్టారు. బీఆర్ఎస్‌ పాలనలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు ప్రతిఫలించలేదని గళమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని అధికార పార్టీని నిలదీశారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచేశారని.. కేసీఆర్‌ కుటుంబానికి ATMలా మారిందని ఫైరయ్యారు. కుగింపోయిన మేడిగడ్డ ప్రాజెక్టును రాహుల్‌ సందర్శించేలా చేసి కేసీఆర్‌ అవినీతిని ఎండగట్టారు. కాంగ్రెస్‌ వస్తే కరెంట్‌ రాదు.. రైతు బంధు దక్కదనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. కీలకమైన ప్రచార బాధ్యతలను కూడా రేవంత్‌ ఛాలెంజ్‌గా తీసుకొని విజయభేరి సభలతో తీసుకొని సక్సెస్‌ చేశారు.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని బలంగా గళమెత్తారు రేవంత్‌. తానొక్కడినే తెలంగాణ తెచ్చానంటూ ఇన్నాళ్లూ పాతపాటే పాడుతున్న కేసీఆర్‌కు గట్టిగా జవాబిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఫ్రొఫెసర్‌ కోదండరామ్‌ మద్దతు కూడగట్టారు. తెలంగాణ జన సమతి కాంగ్రెస్‌ పార్టీకి బేషరతు మద్దతు ఇచ్చేలా చొరవ చూపారు రేవంత్‌. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి గులాబీ కండువా వేసుకున్న ఎమ్మెల్యేలను కూడా ఓడిస్తానని ప్రతినబూనారు. ఆ 12 మంది మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేస్తామన్నారు. అందుకు తగ్గట్లుగానే గట్టిగా ప్రచారం చేశారు. అధికార పార్టీ టార్గెట్‌ చేసి కుట్రలు చేసిన చోట స్పెషల్‌ టాస్క్‌ అమలు చేశారు. అధికార పార్టీకి ఇన్నాళ్లూ కొరకరాని కొయ్యలా గట్టిగా నిలబడిన చోట కాంగ్రెస్‌ అభ్యర్థులకు మానసిక స్థైరం కల్పించారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్‌ 200 కోట్లు ఖర్చుచేసినా ఫలితం తమవైపే ఉండేలా ప్లాన్స్‌ వర్కౌట్‌ చేశారు. డబ్బు పంపిణీ కుట్రలను కూడా రేవంత్‌రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. నోటిఫికేషన్‌ వచ్చిన రోజే డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దామంటూ కేసీఆర్‌కు సవాల్‌ విసిరి.. ఆయన నోట మాట రాకుండా చేయగలిగారు.

ఇక పోల్‌ మేనేజ్‌మెంట్‌లోనూ రేవంత్‌రెడ్డి సక్సెస్‌ సాధించారు. ప్రచార పర్వం ముగియగానే రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లకుండా నేతలను అప్రమత్తం చేశారు. అధికార పార్టీ ప్రలోభాలు బయటపెట్టారు. నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా కట్టలు తెంచుకోగా నిలువరించారు. కొందరు పోలీసు అధికారులు కూడా డబ్బులు పంచుతుండగా.. కాంగ్రెస్‌ నేతలు అడ్డంగా బుక్‌ చేశారు. బీఆర్ఎస్‌ ఆగడాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల రూపంలో చేరవేశారు. నోటిఫికేషన్‌ సమయంలోనే అధికారుల బదిలీలో కీలకమైన పోలీస్‌ కమిషనర్లపైనా కొరడా ఝులిపించేలా చేయడంలో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు ఎలక్షన్‌ కమిషన్‌పై ఒత్తిడి తెచ్చారు. రైతు బంధు నిలుపుదలలో కాంగ్రెస్‌ ప్రమేయం లేదని బీఆర్ఎస్‌ నేతలే ఒప్పుకునేలా చేశారు రేవంత్‌. పోలింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు ప్రజానుకూల పవనాలను ఈవీఎంల వరకు చేరేలా శ్రేణులను ఉత్తేజ పరిచారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్‌ ఆగడాలను పోలింగ్ బూత్‌ల దగ్గర గట్టిగా అడ్డుకున్నారు. ఇలా కీలకమైన పోల్‌మేనేజ్‌మెంట్‌ను కూడా రేవంత్‌రెడ్డి ప్లాన్డ్‌గా ముగించారు.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. తెచ్చింది ఈ ప్రాంత ప్రజలు.. ఉద్యమకారులు.. విద్యార్థులు.. మేథావులు.. నిరుద్యోగులు.. ఇలా సబ్బండ వర్గాల పోరాటంతోనే రాష్ట్రం సిద్ధించిందని దాన్ని సాకారం చేసింది సోనియమ్మని బలంగా చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందే హైదరాబాద్‌ వేదికగా CWC సమావేశాలను నిర్వహించి తెలంగాణ ప్రాంతం తమకు ఎంత ప్రయార్టీనో అధిష్టానంతోనే చెప్పించారు. రాహుల్‌, ప్రియాంక సైతం ప్రచార సభల్లో తెలంగాణ ప్రాంతంతో తమది పేగు బంధం అని ప్రస్తావించారు. నానమ్మ ఇందిరా గాంధీ హయాం నుంచి ఇక్కడి ప్రజలతో తమ కుటుంబానికి అనుబంధం ఉందని మనసులను గెలిచారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఇచ్చిన పార్టీకి కాంగ్రెస్‌కు ఒక్కచాన్స్‌ ఇవ్వాలనే నినాదాన్ని ప్రజల్లోకి పీసీసీ చీఫ్‌ బలంగా తీసుకెళ్లగలిగారు. సోనియాగాంధీ కూడా ప్రచారానికి వచ్చి ఉంటే బాగుండేదనిపించినా.. అనారోగ్యంతో ఆమె హాజరుకాలేకపోయారు. అయితే ప్రచారం ముగింపు వేళ సోనియమ్మ సందేశాన్ని తెలంగాణ ప్రజలకు వీడియో సందేశంలో వినిపించారు.

రాహుల్‌, ప్రియాంక గాంధీ రేవంత్‌రెడ్డిపై పూర్తి విశ్వాసం చూపించారు. తెలంగాణ ప్రజల కోసం రేవంత్‌ పడుతున్న ఆరాటాన్ని ప్రచార సభల్లోనూ వాళ్లు ప్రస్తావించారు. పీసీసీ అధ్యక్షుడిగా పీఠమెక్కిన్నాడు రేవంత్‌రెడ్డిని పిడికెడు మంది కూడా సమర్ధించలేదు. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నాం.. ఈయన సారథ్యంలో మేం పనిచేయాలా అని బహిరంగంగా.. బాహాటంగానే విమర్శలు గుప్పించారు కొందరు నేతలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరైనా ఏదైనా మాట్లాడటం సహజం. అలాగే రేవంత్‌ కూడా అవన్నీ లైట్‌ తీసుకున్నారు. ఎక్కడా కక్ష సాధింపు చర్యలు గానీ.. ఎవరి మీద ఢిల్లీకీ గానీ ఫిర్యాదులు చేయలేదు. ఎవరూ పార్టీని వీడకుండా.. వెళ్లినవాళ్లు తిరిగొచ్చేలా వినమ్రత ప్రదర్శించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టాయని తెలిసినా రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ ఆయన రాజకీయ పరిపక్వతను చాటుతున్నాయి.

.

.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×