Janwada Farm House Case : జన్వాడ ఫామ్ హౌస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల విచారణ ముగిసింది. మోకిల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన రాజ్ పాకాలను పోలీసులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించారు. సుమారు 8 గంటలకు పైగానే విచారణ ప్రక్రియ సాగింది. ఫామ్ హౌస్ ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు.. భారత న్యాయ సంహిత సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. అనేక అంశాలపై పోలీసు అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు పార్టీ ఎందుకు నిర్వహించారు. ఎవరెవరు హాజరయ్యారు వంటి విషయాలతో పాటు విజయ్ మద్దూరి రక్త పరీక్షల్లో కొకైన్ వచ్చిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఫామ్ హౌస్ లో పోలసులు సోదాలు నిర్వహించిన సమయంలో విజయ్ మద్దూరి ఫోన్ కనిపించకపోవడంతో దాని గురించే విచారణలో ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్ లభిస్తే అందులోని సాంకేతిక ఆధారాలు కేసు పురోగతికి పనికొస్తాయని భావిస్తున్న పోలీసులు.. ఈ ఫోన్ కోసమే విచారణ మధ్యలో జన్వాడా ఫామ్ హౌస్ దగ్గరకు రాజా పాకాలను తీసుకువెళ్లారు. అక్కడ దాదాపు 3 గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. అనంతరం.. తిరిగి మోకీల పోలీస్ స్టేషన్ కి తిరిగి వచ్చారు. పార్టీలో పాల్గొన్న వారిలో విజయ్ మద్దూరి రక్త నమూనాల్లో కొకైన్ పాజిటివ్ రావడం, అతని ఫోన్ కనిపించకుండా పోవడంతో పోలీసులు మరిన్ని కోణాల్లో విచారణను సాగిస్తున్నారు. విచారణకు హాజరైన రాజ్ పాకాల స్టేట్ మెంట్ రికార్ట్ చేసుకున్న పోలీసులు.. అతని సెల్ ఫోన్ ని సీజ్ చేశారు. ప్రస్తుతానికి విచారణ ప్రక్రియ ముగిసిందని తెలిపిన పోలీసులు.. అవసరం అయితే మరోసారి విచారణకు రావాలని సూచించారు.
పోలీసుల విచారణ ప్రక్రియ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రాజ్ పాకాల.. తాను పోలీసు విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పారు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, మరోసారి అవసరమైతే విచారణకు రావాలని పోలీసులు చెప్పారని వెల్లడించారు. ఆ రోజు జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగింది పూర్తిగా ఫ్యామిలీ పార్టీనే అని.. అందులో రేవ్ పార్టీ కానీ, మత్తు మందుల వినియోగం కానీ జరగలేదని వెల్లడించారు. అలానే.. పోలీసులకు విజయ్ మద్దూరి ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదని మీడియాకు వెల్లడించారు. పార్టీలో ఎవరికో పాజిటివ్ వస్తే తానేమి చేయాలని ప్రశ్నించారు. వారు ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారో.. పోలీసులు విచారణ జరిపి తెలుసుకోవాలని, తన పార్టీలో ఎలాంటి డ్రగ్స్ వినియోగం జరగలేదని వెల్లడించారు. తన కుటుంబ పార్టీని ఇలా రచ్చ చేయడంతో తన ఫ్యామిలీ మొత్తం బాధ పడుతుందని అన్నారు. ఎవరూ ఫ్యామిలీ పార్టీ చేసుకోకూడదా..? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కావాలనే రచ్చ చేస్తున్నారన్న రాజ్ పాకాల, చాలా చిన్న విషయాన్ని ఏదో ఉద్దేశ్యంతో పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
Also Read : రాజ్ పాకాలను 9 గంటల సుదీర్ఘ విచారణ.. పోలీసుల ప్రశ్నల వర్షం
ఓ వైపు విచారణకు హాజరైన రాజ్ పాకాల, మరోవైపు తనను లేనిపోని కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్థించారు. అయితే.. ఇప్పటి వరకు ఈ కేసులో తాము ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపిన తెలంగాణ పోలీసులు.. ఇంకా విచారణ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. కేసు విచారణలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని వెల్లడించారు.