EPAPER
Kirrak Couples Episode 1

Rains: అకాల వర్షం.. పంట నష్టం.. అన్నదాతకు చానా కష్టం..

Rains: అకాల వర్షం.. పంట నష్టం.. అన్నదాతకు చానా కష్టం..

Rains: అకాల వర్షాలు తెలుగురాష్ట్రాల అన్నదాతలను ఆగం చేసేసాయి. మొన్న కురిసిన వడగండ్ల వానకు కొంతమేర దెబ్బతింటే ఇటీవల కురిసిన వర్షాలకు ఉన్నది కాస్త ఊడ్చుకుపోయింది. ఎక్కడ చూసినా రైతుల ఆక్రందన తప్ప మరోకటి కనిపించడం లేదు. మమ్మల్ని కాపాడండి ప్రభో అంటూ ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నారు.


వారం రోజుల్లో పంట చేతికొస్తుందనగా వడగండ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లోని ధాన్యం వర్షం ధాటికి వరదలో కొట్టుకుపోయింది. మామిడి కాయలు రాలిపోగా.. వరి, మక్క, జొన్న, నువ్వులు, వేరుశెనగ పంటలు నేలకొరిగాయి. 2 రాష్ట్రాల్లో ఏకంగా లక్షల ఎకరాల్లో పంటలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షాలు ఈసారి రైతుల కళ్లల్లో కడగండ్లు మిగిల్చాయి.

తెలంగాణలో వర్షం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. 3 రోజుల పాటు కురిసిన వర్షాలకు అన్ని రకాల పంటలు పూర్తిగా నాశనమైపోయాయి. కనీసం పండించిన రైతుకు గింజ కూడా మిగల్లేదు. అహర్నిశలు చెమటోడ్చి పండించిన పంట కళ్లెదుటే కొట్టుకుపోతుంటే ఏం చేయాలో తెలియక రైతులు కుప్పకూలిపోయారు. వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షార్పణం కావడంతో బిక్కుబిక్కుమంటున్నారు. రెక్కల కష్టం నీటిపాలు కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు, వడగళ్లకు వేల ఎకరాల్లో పంట దెబ్బతింది.


కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్ యార్డులో మురుగు కాల్వలో ధాన్యం కొట్టుకుపోయింది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం నాగారం సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కుప్పలు పోసిన ధాన్యానికి మొలకలు వచ్చేశాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జగిత్యాల జిల్లాలో 59 వేల 794 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 55 వేల 400 ఎకరాలు, సిరిసిల్లలో 6వేల 230, పెద్దపల్లి జిల్లాలో 22 వేల ఎకరాల్లో వరి, మరో 10 వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి, మామిడి, మొక్కజొన్న కలిపి సుమారు లక్ష ఎకరాలకుపైగానే నష్టం వాటిల్లింది.

వికారాబాద్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. యాసంగిలో అన్ని పంటల సాధారణ విస్తీర్ణం 1.04 లక్షల ఎకరాలు కాగా.. భూగర్భ జలాలు, జలాశయాల్లో నీటి నిల్వలు తగినంత ఉండటంతో సాగు విస్తీర్ణం 1.8 లక్షల ఎకరాలకు పెరిగింది. సాగు పెరిగిందని సంతోషించిన రైతులకు అకాల వర్షాలు తీరని నష్టాన్ని కలిగించాయి. ఈ యాసంగిలో వర్షాలతో ఇప్పటికే 7వేల 768 ఎకరాల్లో అన్ని రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.

కుండపోత వానలకు రైతుల కష్టం నీటిపాలైంది. పంట దెబ్బతినడమే కాకుండా పెట్టుబడి ఒక్క రూపాయి కూడా వచ్చేట్టు కనిపించడం లేదు. ఏపీలో ఎడతెరిపి లేని వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 3 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేస్తున్నారు.

అటు గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ధాన్యం రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కోనసీమ జిల్లాలో కుప్పల మీద ఉన్న వరి నీటిలో తేలుతోంది. కొన్ని చోట్ల పొలాలు వాగులను తలపిస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మిరప పంటకు తీరని నష్టం వచ్చి పడింది.

అనంతపురం జిల్లాలో మూడ్రోజులుగా గాలివాన బీభత్సంతో వందలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, గుమ్మగట్ట, శింగనమల, అనంతపురం మండలాల్లో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, వేరుసెనగ, కొర్ర తదితర పంటలకు భారీ నష్టం జరిగింది. యాడికి, గుత్తి, గుంతకల్లు, రాప్తాడు, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, శింగనమల, పామిడి, యల్లనూరు, కూడేరు, బుక్కరాయసముద్రం మండలాల్లో అరటి, మామిడి, బొప్పాయి, చీనీ, టమోటా, నిమ్మ, తదితర పంటలకు నష్టంవాటిల్లింది. మొత్తం 495 హెక్టార్లలో 3.09 కోట్ల నష్టం జరిగిందని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేసి నివేదికలు సిద్ధం చేశారు.

అయితే రైస్ మిల్లర్లు రైతుల కష్టాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని తక్కువధరకు నేరుగా రైతుల నుండి కొనుగోలు చేస్తున్నారు. తూకాల్లో సైతం బస్తాకు ఐదు కిలోల వరకు తగ్గిస్తున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించలేక రైతుల అవస్థలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×