Rahul Gandhi Hyderabad Visit: రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయ్. ప్రతి నిమిషం విలువైనది ఈ సమయంలో.. కానీ తెలంగాణ ప్రజలకు తానెప్పుడూ అండగా ఉంటానని, అవసరమైన సమయంలో పిలిస్తే వస్తానంటూ ఇచ్చిన హామీ మేరకు మా నేత రాహుల్ గాంధీ వస్తున్నారు. అది మా నేత నైజం అంటూ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్ పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ రేపు వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ఎన్నో దశాబ్దాల తర్వాత జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే రాహుల్ పర్యటన సంధర్భంగా కాంగ్రెస్ నాయకులు బిజీబిజీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్వర్యంలో రాహుల్ కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఈ సంధర్భంగా రాహుల్ పర్యటన గురించి మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా.. తెలంగాణ కు రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు. కుల గణనకు అత్యంత ప్రాధాన్యం ఉన్నందున తమ నేత, హైదరాబాద్ పర్యటనకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
5వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారని, బిజీ షెడ్యూల్ ఉన్నందున రాహుల్ గంట సేపు మాత్రమే ఉంటారని తెలిపారు. కుల గణన లో ఎలాంటి అంశాలు ఉండాలో సూచించడం కోసం ఈ పర్యటన దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత గా కాంగ్రెస్ పార్టీ స్వీకరించిందన్నారు. భారత్ జోడో యాత్ర లో కుల గణన చేపట్టి ఆయా వర్గాల జనాభా ప్రకారం సంపద పంపిణీ జరగాలన్నది రాహుల్ గాంధీ ఆలోచనగా మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కుల గణన జరిగితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నది పార్టీ అభిమతమని, అందుకే తెలంగాణలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ గణనలో అనేక ప్రశ్నలు పొందుపరచడం జరుగుతోందని, ఇంకా ఎలాంటి అంశాలు ఉంటే సమగ్రంగా మరింత లోతుగా సర్వే తీరు ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మహేష్ అభిప్రాయ పడ్డారు.
ఇలాంటి చారిత్రాత్మక ప్రాధాన్యత గా ఉన్న గణనకు అన్ని వర్గాలు సహకరించాలని తెలంగాణ పీసీసీ చీఫ్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లు చాలా పట్టుదలతో రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, తెలంగాణలో జరిగే కులగణన దేశానికి ఆదర్శంగా ఉంటుందన్నారు. రాహుల్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మహేష్ గౌడ్ కోరారు.