EPAPER

GN Saibaba: తెలంగాణ గడ్డ మలిచిన బిడ్డను నేను: ప్రొ. జీఎన్ సాయిబాబా

GN Saibaba: తెలంగాణ గడ్డ మలిచిన బిడ్డను నేను: ప్రొ. జీఎన్ సాయిబాబా

నరకం చూశా..


– ఢిల్లీలో కిడ్నాప్ చేసి.. గడ్చిరోలి తీసుకెళ్లారు
– మౌనంగా ఉంటే సరి.. లేకుంటే జైలే అన్నారు
– ఆపరేషన్ గ్రీన్‌హంట్ వద్దన్నందుకే నాపై కేసులు
– వీల్‌ఛైర్ తిరగని అండా సెల్‌లో నిర్బంధించారు
– మహారాష్ట్ర జైళ్లలో చట్టాలు పనిచేయవు
– జైలులోనూ కులం బలంగానే ఉంది
– నేను తెలంగాణ గడ్డ మలచిన బిడ్డని
– తెలంగాణ కోసం ప్రొ. జయశంకర్‌తో అడుగేశా
– టీచరుగా, హక్కుల కార్యకర్తగా పనిచేస్తూనే ఉంటా
– బషీర్‌బాగ్ ప్రెస్‌మీట్‌లో ప్రొ. జీ.ఎన్. సాయిబాబా

Anda Cell: పదేళ్ల సమయం తర్వాత తాను స్వేచ్ఛగా తెలంగాణలో మాట్లాడుతున్నానని ప్రొ.జి.ఎన్ సాయిబాబా తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014లో అరెస్టైన సాయిబాబాను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించటంతో ఆయన ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, శుక్రవారం ఆయన హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడారు. జైల్లో తనను చిత్ర హింసలు పెట్టారని, పదేళ్ల తన జీవితం పాలకుల కుట్రకు బలైపోయిందన్నారు. తనను పదేళ్లు జైల్లో పెట్టినప్పటికీ.. ఒక టీచర్‌గా, హక్కుల కార్యకర్తగా పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు.


అక్రమంగా అరెస్టు..
ఆదివాసీలు, గిరిజనుల జీవితాలను ఆగం చేస్తున్న సైన్యపు ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా కొట్లాడినందుకు ప్రభుత్వం తనమీద కక్ష గట్టిందని సాయిబాబా వివరించారు. దీంతో తనపై నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనే కేసులు పెట్టారని ఆరోపించారు. తన అరెస్టుకు ముందు కొంతమంది అధికారులు తనను కలిసి, తామ చెప్పినట్లుగా చేస్తే ఏ కేసులూ లేకుండా చూసుకుంటామని, అందుకు సహకరించకపోతే మాత్రం తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపి జీవితంలో బయటకు రాకుండా చేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. ఢిల్లీలో ఉన్న తనను బలవంతంగా కిడ్నాప్ చేసి మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టులో హాజరు పరిచారని వెల్లడించారు. తమకు వ్యతిరేకంగా నోరెత్తితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని, అలాంటి వారంతా సైలెంట్ కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

కుర్చీ తిరగని సెల్‌లో…
జైలులో ఉండగా తాను 90 శాతం వికలాంగుడినని కూడా జైలు అధికారులు సానుభూతి చూపలేదని వెల్లడించారు. చిన్నప్పటి నుంచి పోలియో ఉన్న తనకు మహారాష్ట్ర జైలుకు వెళ్ళిన తర్వాత పక్షవాతం వచ్చిందని, దాని ప్రభావం ఊపిరితిత్తుల మీద పడిందని, చివరకు 21 రకాల కొత్త అనారోగ్య సమస్యల బారిన పడటంతో నరకం అనుభవించానన్నారు. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని నిర్బంధించే అండా సెల్‌లో తనను ఉంచారని, అందులో కనీసం వీల్ చైర్‌ తిరిగే పరిస్థితి కూడా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు చెందిన మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, సంజయ్ రౌత్ తదితరులు కూడా ఈ జైల్లోని పరిస్థితులను చూసి బతకలేమంటూ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు.

Also Read: Strong Warning: యూట్యూబర్లకు పోలీసుల వార్నింగ్.. పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తే తాటా తీస్తామంటూ..

అదే వారి లక్ష్యం..
ఇతర దేశాల్లో ఆదివాసీలను అంతం చేసినట్లే భారత్‌లోనూ అవే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అడవి బిడ్డలను అరణ్యాల నుంచి వెళ్లగొట్టి, అక్కడి గనులు తవ్వుకోవటమే లక్ష్యంగా కార్పొరేట్లు ప్రణాళికలు రచిస్తున్నారని, ప్రభుత్వాలు మైనింగ్ పేరుతో వారిని ఆవాసాల నుంచి ఖాళీ చేసి బైటకు పంపిస్తున్నాయని ఆరోపించారు. ఛత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్నది అదేనని వివరించారు.

జైలులోనూ కులమే..
సమాజంలోనే గాక.. తానున్న జైలులోనూ కుల వ్యవస్థ ప్రభావాన్ని తాను గమనించానని సాయిబాబా వెల్లడించారు. ఒక వ్యక్తి కులాన్ని బట్టి జైలు సిబ్బంది తీరు ఉంటుందని, ఖైదీలకు ఇచ్చే పని విషయంలోనూ కులాన్ని ప్రాతిపదికగా చేసుకోవటాన్ని తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. ముఖ్యంగా, డ్రైనేజీ, టాయిలెట్ శుభ్రపరిచే పనులు వారి కులాలను బట్టి సిబ్బంది కేటాయించారని ఆరోపించారు. అక్కడి జైలు మాన్యువల్‌లోనూ ఇదే రాసి ఉండటం చూసి తాను షాకయ్యానని చెప్పుకొచ్చారు. తన జైలు జీవితం, అనుభవించిన వేదన గురించి వివరించేందుకు తనకు రోజులు చాలవన్నారు. పదేళ్ల పాటు తాను అనుభవించిన మానసిక వేదన, బెయిల్ ఇవ్వాలని చేసిన విజ్ఞప్తులను న్యాయస్థానాలూ పట్టించుకోలేదన్నారు. మహారాష్ట్ర జైళ్ళలో రాజ్యాంగం పనిచేయదని, అక్కడ ఖైదీలను చిత్రహింసలకు గురిచేసే అవకాశం ఉన్నదంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు.

ఉద్యమాలపై ఉక్కుపాదం..
ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించటం సాధారణ విషయంగా మారుతోందని సాయిబాబా ఆవేదన వ్యక్తం చేశారు. భీమా కోరేగావ్ కేసులో తాను లేకపోయినా తనపై కేసు పెట్టారని, తన కేసును కోర్టులో వాదించినందుకు సురేంద్ర గార్లింగ్‌పైనా కేసు పెట్టారని గుర్తుచేశారు. జైళ్ళకు వచ్చిన రౌడీలు తక్కువ సమయంలో బయటకు వెళ్తారని, కానీ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవారికి దీర్ఘకాలం బెయిల్ రాదని, వారు జైలులో అనేక చిత్రహింసలకు గురవుతున్నారన్నారు.

Also Read: Karumanchi Samyukta: మహిళా సర్పంచ్ సంయుక్తపై పవన్ ప్రశంసల వర్షం.. ఎందుకంటే..?

తెలంగాణ బిడ్డను..
తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ ఉద్యమాలేవీ మొదలుకాకముందే వరంగల్ డిక్లరేషన్ పేరుతో ప్రజాస్వామిక తెలంగాణ అంశాన్ని చర్చించామని, ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ వచ్చానని అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు ప్రొఫెసర్ జయశంకర్‌తో కొన్ని రోజుల పాటు తాను చర్చల్లో పాల్గొన్నానని గుర్తుచేశారు. తెలంగాణలోని ప్రజా ఉద్యమాలే తనకు చదువును, చైతన్యాన్ని నేర్పాయని, తనను వ్యక్తిగా తీర్చిదిద్దిన తెలంగాణ గడ్డ మీద ఇప్పుడు అడుగు పెట్టడం గొప్ప అనుభూతినిస్తోందన్నారు. తనను పదేళ్లు జైల్లో పెట్టినప్పటికీ.. ఒక టీచర్‌గా, హక్కుల కార్యకర్తగా పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. కుల,మత రహితమైన మెరుగైన సమాజాన్ని కోరుకునే అనేకమందితో కలిసి పనిచేస్తానని వెల్లడించారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×