Indiramma Housing Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం తరపున మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ గృహాల లబ్ధిదారుల ఎంపికకు ఇప్పటికే ప్రత్యేక కమిటీని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా లబ్దిదారుల ఎంపికకు సంబంధించిన ప్రత్యేకమైన యాప్ ను సైతం రూపొందించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో యాప్ ఏ విధంగా పనిచేస్తుంది, లబ్ధిదారులను ఏ విధంగా గుర్తిస్తారన్న అంశాలను అధికారులు, మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేందుకు ప్రత్యేకమైన యాప్ రూపొందించడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు మంజూరవుతాయని మంత్రి భరోసా కల్పించారు. కాగా యాప్ ను పరిశీలించిన మంత్రి ఒకటి, రెండు మార్పు చేర్పులను సూచించారు. వచ్చే వారంలో యాప్ అందుబాటులోకి రానున్నట్లు మంత్రి ప్రకటించారు.
తెలంగాణ ప్రజలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో, ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు అందజేస్తున్నట్లు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ సమయం నుండి అధికారులు, లబ్దిదారులను గుర్తించేందుకు తీసుకోవాల్సిన అన్ని అంశాలను ప్రభుత్వం ముందుంచారు. ఈ పథకాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో, సంబంధిత అధికారులు ముమ్మర కసరత్తు చేశారు.
ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం అమలయ్యేందుకు వారం వ్యవధి ఉండగా, అర్హులందరికీ వర్తించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. కాగా మంత్రివర్గ భేటీ ప్రస్తుతం జరుగుతున్న సంధర్భంగా అభివృద్దికి సంబంధించిన పలు అంశాల గురించి ప్రభుత్వం తాజాగా ప్రకటన చేయనుంది. ఆ ప్రకటనలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రకటన కూడా చేసే అవకాశముందని సమాచారం.