TSPSC : TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో బేగంబజార్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. తెలియని వ్యక్తులు TSPSC సర్వర్‌లోకి వెళ్లి లాగిన్ అయినట్టు పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోణంలో విచారణ కొనసాగుతోంది. దళారుల వ్యవహారం కూడా బయటకు రావడంతో ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారు.
ఆదివారం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు పరీక్ష జరగాలి. ఈ నెల 15న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంది. ఈ లోపే పేపర్ లీకేజీ వ్యవహారం దుమారం రేపింది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నిస్తున్నారు. ప్రమీణ్ నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి పేపర్లు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు అభ్యర్థులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో కొందరు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దించారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్.. విచారణలో పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ముగ్గురు దళారులతో కలిసి పేపర్ లీకేజీకి కుట్రపన్నాడని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇందుకోసం రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది.
FOR MORE UPDATES PLEASE FOLLOW : https://bigtvlive.com/telangana