BRS Leaders – Harish Rao: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారా? కేవలం కేటీఆర్, హరీష్‌రావు వాయిస్ మాత్రమే బయటకు వస్తోంది ఎందుకు? మిగతా నేతలను సైలెంట్‌గా ఉండమన్నారా? వారే దూరంగా ఉంటున్నారా? ఇంతకీ పార్టీలో ఏం జరుగుతోంది? అన్నదానిపై ప్రజలు రకరకాలుగా చర్చించుకోవడం మొదలైంది.
తెలంగాణలో కారు పార్టీ అధికారం పోయి దాదాపు 11 నెలలు పూర్తి అయ్యింది. మా పార్టీ బలంగా ఉందని, రేపో మాపో జాతీయ పార్టీ అవుతుందని నేతలు బలంగా చెప్పేవారు. ఇదంతా ఒకప్పటి మాట. కాలం మారింది.. అధికారం పోయింది.. రాజకీయాలు మునుపటి మాదిరిగా లేవు. కేవలం వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి.
గడిచిన పదేళ్లు గులాబీ పార్టీ నేతలకు స్వర్ణయుగం. పార్టీ అధికారంలో ఉండడంతో ఎవరైనా ఏమైనా అంటే మీడియా ముందుకొచ్చి ఎదురుదాడి చేసేవారు. ఇప్పుడు మచ్చుకైనా నేతలు కనిపించలేదు. ప్రస్తుతం రాజకీయాలు వారిని గందరగోళంలోకి నెట్టేశాయా? అన్నడౌట్ వెంటాడుతోంది.
పార్టీ అధికార ప్రతినిధులు సైతం అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఏ నేత మాట్లాడినా.. కేటీఆర్, లేదంటే హరీష్‌రావులే ముందుకొస్తున్నారు. మాట్లాడాల్సిన మాటలు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు మిగతా ప్రాంతాల నేతలు గానీ కనిపించలేదు.
ALSO READ: హరీష్‌రావు.. ఇంకా సిగ్గు రాలేదా? అంటూ విప్ శ్రీనివాస్ ఆగ్రహం
ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? అనేదానిపై తెలియక తర్జనభర్జన పడుతున్నారు కారు పార్టీ నేతలు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న నేతలు, ప్రస్తుతం సైలెంట్‌గా ఉండటాన్ని ఆ పార్టీ శ్రేణులు సైతం జీర్ణించుకోలేక పోతున్నాయి.
తెలంగాణ వ్యాప్యంగా హైడ్రా, మూసీ, జనవాడ ఫామ్ హౌస్ పార్టీ వంటి అంశాలపై ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం కేటీఆర్, హరీష్‌రావులు మాత్రమే ముందుకొస్తున్నారు. చాలా మంది నేతలు మౌనంగా ఉంటున్నారు.
కొద్దిరోజుల కిందట గులాబీ పెద్దల నుంచి కీలక నేతల ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లాయి. మీడియాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, ఎలాంటి మసాలా ఇవ్వకూడదన్నది దాని సారాంశం. మాట్లాడక పోయినా పర్వాలేదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నోరు జారితే కష్టమని సూచన చేసిందట. దీంతో నేతలు సైలెంట్ అయిపోయారన్నది పార్టీ వర్గాల మాట.
మరో వర్గం వాదన ఇంకోలా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కొందరు నేతలు గమనిస్తున్నారు. ఆ క్రమంలో కొందరు పార్టీ జంప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని గుసగుసలు పార్టీ కార్యాలయంలో బలంగా వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో నేతల సైలెంట్‌పై ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.