Hospital Land Occupied :
⦿ కబ్జాకు గురైన నీలోఫర్ ఆస్పత్రి స్థలం
⦿ రెండు చోట్ల కబ్జాకు గురైనట్టు గుర్తింపు
⦿ హైడ్రాకు అందిన ఫిర్యాదు
⦿ కొద్దిరోజుల క్రితం జీహెచ్ఎంసీకీ కంప్లయింట్
హైదరాబాద్, స్వేచ్ఛ: వేగంగా విస్తరిస్తున్న రాష్ట్ర రాజధానిలో కబ్జాలంటే మామూలు విషయం అయిపోయింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలా కబ్జా చేసేయడం, నిర్మాణాలు చేపట్టడం చకచకా జరిగిపోతున్నాయి. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. ముందుగా చెరువుల పునరుద్ధరణకు పూనుకున్న హైడ్రా, అక్రమ కట్టడాలను కూల్చివేసింది. ఇంకా కొన్నింటిని గుర్తించింది. ఇదే క్రమంలో కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి.
హైడ్రాకు నీలోఫర్ సూపరింటెండెంట్ ఫిర్యాదు
నీలోఫర్ ఆస్పత్రి స్థలం కబ్జాకు గురైంది. ఎమర్జెన్సీ బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్ వెనుక రెండు చోట్ల కబ్జా జరిగినట్టు హాస్పిటల్ సూపూరింటెండెంట్ గుర్తించారు. దీంతో హైడ్రాను ఆశ్రయించారు. ఓల్డ్ బిల్డింగ్ దొబీ ఘాట్ వద్ద హాస్పిటల్ కాంపౌండ్ వాల్ దాటి నిర్మాణం చేశారని, ఎమర్జెన్సీ బిల్డింగ్ వెనుక ఉన్న స్థలం కబ్జా కాకుంటే టువీలర్ పార్కింగ్‌కు వాడుకోవచ్చని తెలిపారు. హాస్పిటల్ బయట కాంపౌండ్ వాల్‌కు ఆనుకుని దుకాణాలు వెలిశాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిశీలన
ఆస్పత్రి స్థలం కబ్జాపై కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీకి ఫిర్యాదు అందింది. దీంతో టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన సిబ్బందితోపాటు రెవెన్యూ శాఖ అధికారులు సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడారు. సూపరింటెండెంట్‌ను కలిసి వివరాలు సేకరించారు. తాజాగా హైడ్రాకు ఫిర్యాదు అందడంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ కబ్జాదారుల్లో కనిపిస్తోంది.