Occult Worship: రోజువారి మాదిరిగానే ఆ రైతు పొలానికి వెళ్లారు. సాగు పనుల నిమిత్తం వెళ్లిన ఆ రైతు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. కాష్మోరా సినిమాలో దృశ్యాలను పోలీనట్లుగా, దిష్టిబొమ్మకు మేకులు, పసుపు, కుంకుమ ఇలా భయానక దృశ్యాన్ని చూసిన ఆ రైతు, చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ వెలుగులోకి వచ్చిందంటే.. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో..
తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు తిరుపతయ్య వ్యవసాయమే జీవనాధారంగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన తిరుపతయ్యకు భయానక దృశ్యాలు కనిపించాయి. అక్కడ చుట్టూ ముగ్గు, పసుపు, కుంకుమ, గోధుమపిండితో చేసిన దిష్టిబొమ్మ, ఆ బొమ్మకు 9 మేకులు గుచ్చి ఉండడంతో సదరు రైతు భయంతో వణికిపోయారు. ఇలా తాను చూసిన దృశ్యాల గురించి, ఆ రైతు తన కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తెలిపారు.
వారందరూ అక్కడికి చేరుకొని, చేతబడి జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతయ్య లక్ష్యంగా క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చని, అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ పూజలు చేసినట్లు భావిస్తున్నారు. ఇలా తన పొలంలో జరిగిన క్షుద్రపూజలపై తిరుపతయ్య మాట్లాడుతూ.. తనకు, ఇతరులకు భూతగాదాలు ఉన్నాయని , ఆ నేపథ్యంలో క్షుద్రపూజలు చేసి ఉండవచ్చని తెలిపారు. తాను ఉదయం 3 గంటల సమయంలో పొలానికి రాగా, ఈ దృశ్యాలు చూసి భయాందోళన చెంది గ్రామపెద్దలకు తెలిపినట్లు తెలిపారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఏ అపాయం వాటిల్లినా, తాను అనుమానించే వారే భాద్యులని, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రైతు పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందగా, ఘటనాస్థలికి చేరుకొని వారు అసలేం జరిగిందనే అంచనాకు వచ్చారు. అనుమానితులను వారు విచారిస్తున్నారు. అయితే పొలంలో కాష్మోరా సినిమాలో హీరో కార్తీ పూజ చేస్తూ, బొమ్మలను ఉంచి పూజ చేసినట్లుగా ఇక్కడి దృశ్యాలు కూడా అదే రీతిలో ఉండగా , స్థానిక రైతులు కూడా భయాందోళన వ్యక్తం చేశారు. కారకులను వెంటనే గుర్తించి శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నేటి ఆధునిక కాలంలో కూడా వీటిని విశ్వసిస్తున్న ప్రజలు ఉన్నందుకే, ఇంకా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని మేధావులు తెలుపుతున్నారు. ఏదిఏమైనా ప్రజలను భయాందోళనకు గురి చేసే ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని చట్టరీత్యా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.